Single Screen Cinemas: మూసివేత దిశగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్.. బాలీవుడ్ ఇండస్ట్రీనే కారణమా?

ఇటీవలి కాలంలో మల్టీప్లెక్సులు పెరిగినా.. వాటికి వెళ్లే ఆడియెన్స్ చాలా తక్కువ. వీటి ద్వారా ఇండస్ట్రీకి వచ్చే ఆదాయం కూడా తక్కువే. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, నగరాలు, దక్షిణాది ఫిలిం మేకర్స్ ఈ విషయాన్ని గుర్తించి సినిమాలు తీస్తుంటే.. బాలీవుడ్ మాత్రం మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కోసమే సినిమాలు తీస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 18, 2023 | 05:01 PMLast Updated on: May 18, 2023 | 5:01 PM

Single Screen Cinemas Are Closing Because Of Bollywood

Single Screen Cinemas: సినిమాలకు ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టేవి సింగిల్ స్క్రీన్ థియేటర్లే. ఇటీవలి కాలంలో మల్టీప్లెక్సులు పెరిగినా.. వాటికి వెళ్లే ఆడియెన్స్ చాలా తక్కువ. వీటి ద్వారా ఇండస్ట్రీకి వచ్చే ఆదాయం కూడా తక్కువే. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, నగరాలు, చివరకు మెట్రోల్లోనూ సింగిల్ స్క్రీన్ల ద్వారానే సినిమా ఇండస్ట్రీకి లాభం. దక్షిణాది ఫిలిం మేకర్స్ ఈ విషయాన్ని గుర్తించి సినిమాలు తీస్తుంటే.. బాలీవుడ్ మాత్రం మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కోసమే సినిమాలు తీస్తున్నారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీని నమ్ముకున్న సింగిల్ స్క్రీన్లు కలెక్షన్లు లేక వెలవెలబోతున్నాయి. మూసివేత దిశగా సాగుతున్నాయి.
బాలీవుడ్ ఇండస్ట్రీకి ముంబై, ఢిల్లీ వంటి నగరాలే ముఖ్యం అనిపిస్తుంటుంది వాళ్ల సినిమాలు చూస్తుంటే. నాగ్‌పూర్, లక్నో, పాట్నా వంటి నగరాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్లలోకి వచ్చే ప్రేక్షకు‌ల్ని పట్టించుకోవడం లేదు. అందుకే వాళ్లకు నచ్చే సినిమాలు తీయడం లేదు. ఫలితంగా ఇలాంటి నగరాల్లోని సింగిల్ స్క్రీన్లు మూతపడుతున్నాయి. మరోవైపు ప్రేక్షకులూ బాలీవుడ్ సినిమాలకు దూరమవుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రేక్షకులు ఎక్కువగా సింగిల్ స్క్రీన్లనే ఇష్టపడతారు. ఆ మాస్ ఫీల్ ఉండేది వీటిలోనే. థియేటర్లో ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లుతాయి. మల్టీప్లెక్సుల్లో ఈ పరిస్థితి ఉండదు. పైగా వాటి టిక్కెట్ల ధరలు ఎక్కువ. సింగిల్ స్క్రీన్ టిక్కెట్ల ధరలు తక్కువ. అందుకే ప్రేక్షకులు వీటివైపు మొగ్గు చూపుతారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాల మూలంగా సింగిల్ స్క్రీన్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది. వాళ్లను ఆకట్టుకునే సినిమాల్ని బాలీవుడ్ తీయడం లేదు. అనేక చోట్ల థియేటర్లు మూతపడుతున్నాయి. ముంబైలో తక్కువ సంఖ్యలోనే సింగిల్ స్క్రీన్లు మిగిలి ఉన్నాయి. ఉత్తరాదిలోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. దక్షిణాదిన సింగిల్ స్క్రీన్ల పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఈ పరిస్థితికి బాలీవుడే కారణం అంటున్నారు విశ్లేషకులు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో చూడండి.. ప్రేక్షకులు సింగిల్ స్క్రీన్లకు ఎలా క్యూ కడతారో! కొత్త సినిమా.. అందులోనూ మాస్ మూవీ విడుదలైందంటే టిక్కెట్లే దొరకని పరిస్థితి. ఇక్కడ రూపొందే సినిమాలు కూడా ఎక్కువగా మాస్‌ను దృష్టిలో పెట్టుకుని తీసేవే. అందుకే ఈ సినిమాలు ఎక్కువగా ఆడే బీ, సీ సెంటర్లలో సినిమా థియేటర్లు ఇంకా నడుస్తున్నాయి. కానీ, బాలీవుడ్ సినిమాల్ని నమ్ముకున్న ఉత్తరాది రాష్ట్రాల సింగిల్ స్క్రీన్లు మూసివేత దిశగా వెళ్తున్నట్లు సినీ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమాల్ని బాలీవుడ్ తీయకపోవడమే దీనికి కారణం.
బాలీవుడ్ పంథా వేరు
గతంలో బాలీవుడ్‌లోనూ మాస్ సినిమాలు రూపొందేవి. గ్రామీణ ప్రాంతం, అక్కడి జీవన విధానం నేపథ్యంలో సినిమాలు రూపొందేవి. ప్రేక్షకులు కూడా వీటికి కనెక్ట్ అయ్యేవాళ్లు. కానీ, రెండు దశాబ్దాలుగా బాలీవడ్ పంథా మారింది. అంతా అర్బన్, వెస్టర్న్ కల్చర్ బేస్డ్ సినిమాలే తీస్తూ వస్తున్నారు. దీంతో సింగిల్ స్క్రీన్లు ఉండే గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల ప్రేక్షకులు ఈ చిత్రాలకు కనెక్ట్ కాలేకపోయారు. ముంబై వంటి మెట్రో నగరాల్లో.. అది కూడా సంపన్న కుటుంబాలకు చెందిన కథలతోనే సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఫ్యామిలీ సినిమాలైనా.. లవ్ స్టోరీలైనా ధనవంతులు, మెట్రో సిటీ ప్రజల సంస్కృతినే చూపించారు. నగరంలో పెరుగుతున్న మల్టీప్లెక్సుల కారణంగా వీటికి ఆదరణ దక్కినట్లు కనిపించినా.. గ్రామీణ, పట్టణ ప్రేక్షకులు దూరమయ్యారనే విషయాన్ని బాలీవుడ్ గ్రహించలేకపోయింది. బాలీవుడ్‌లో కొన్నేళ్లుగా కనకవర్షం కురిపించిన సినిమాలేవీ పెద్దగా మాస్ ప్రేక్షకులకు దగ్గరకాకపోవడమే ఇందుకు నిదర్శనం.

Single Screen Cinemas
ప్రేక్షకుల్ని అర్థం చేసుకోని పరిశ్రమ
భారతీయ సినిమా ప్రేక్షకుల్ని కొత్తగా వచ్చిన బాలీవుడ్ ఫిలిం మేకర్లు అర్థం చేసుకోలేదనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల ప్రజల్ని, అక్కడి జీవితాల్నే మర్చిపోయారు. వాళ్లకు ప్రజలంటే ముంబై, ఢిల్లీవంటి నగరాల్లో జీవించే ఉన్నత వర్గం వాళ్లే అనుకుంటారు. అందుకే వాళ్ల గురించే సినిమాలు తీశారు. ఈ చిత్రాలు మాస్ ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. అదే సమయంలో తెలుగు, తమిళ సినిమాలు మాత్రం పూర్తి నేటివిటీతో రూపొందాయి. మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలతోనే అక్కడివాళ్లు సినిమాలు తీస్తూ వచ్చారు. పల్లె ప్రజలు, వారి జీవన విధానానికి దగ్గరగా ఉండే సినిమాలు తీస్తున్నారు. అందుకే దక్షిణాది పరిశ్రమకు ప్రేక్షకులు ఇంకా దగ్గరగా ఉన్నారు. ఈ తరహా సినిమాలు తీయకపోవడం వల్లే బాలీవుడ్‌కు ఆడియెన్స్ దూరమయ్యారు. అందుకే దక్షిణాది నుంచి వచ్చిన బాహుబలి, ట్రిపులార్, కేజీఎఫ్, కాంతార, పుష్ప వంటి సినిమాల్ని ఉత్తరాది ప్రేక్షకులు ఆదరించారు. బాలీవుడ్ సినిమాలు మాత్రం అక్కడి వాళ్లనే కాదు.. దక్షిణాది ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకోలేకపోతున్నాయి. పుష్ప సినిమా అంత పెద్ద విజయం సాధించిందన్నా.. ఆ సినిమాలోని పుష్ప రాజ్ పాత్ర ప్రేక్షకులకు నచ్చిందన్నా.. కారణం ఆ పాత్ర ప్రేక్షకుల జీవితానికి దగ్గరగా ఉండటమే. ఇలాంటి రియల్ లైఫ్ క్యారెక్టర్స్ బేస్డ్ సినిమాలు తీస్తే బాలీవుడ్ మనుగడ సాగిస్తుంది.
పఠాన్ కాస్త నయం
ఉత్తరాదిలో అనేక చోట్ల సింగిల్ స్క్రీన్లు కొంతకాలంగా ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. ఇటీవలి కాలంలో ఆ థియేటర్లకు ఆదాయం తెచ్చిపెట్టినవి దక్షిణాది సినిమాలే. పుష్ప, ట్రిపులార్, కేజీఎఫ్, కాంతార వంటి సినిమాల వల్లే ఆ థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడాయి. హిందీకి సంబంధించి పఠాన్ మూవీ ఒక్కటే సింగిల్ స్క్రీన్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో థియేటర్లు మనుగడ సాగించేంత ఆదాయం రావడం లేదన్నది వాటి యజమానుల మాట. ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ, వాళ్లను మెప్పించే సినిమాలే బాలీవుడ్ తీయడం లేదు. ఒక ప్రాంతంలో థియేటర్లు మూతపడుతున్నాయి అంటే.. అక్కడి ప్రేక్షకులు సినిమాలకు దూరమవుతున్నారనే అర్థం. ఇలా జరుగుతోంది అంటే.. సినిమా పరిశ్రమ ఆదాయాన్ని కోల్పోతున్నట్లే. ఇకనుంచైనా బాలీవుడ్ ప్రేక్షకుల్ని అర్థం చేసుకుని సినిమాలు తీస్తేనే థియేటర్లు నడుస్తాయి. ఇండస్ట్రీ బాగుంటుంది.