శ్రీదేవి డెత్ మిస్టరీ.. అసలు ఏడేళ్ల కింద ఆ రోజు బాత్ టబ్ లో ఏం జరిగింది..?
శ్రీదేవి.. పరిచయం అవసరం లేని పేరు. ఈమె చనిపోయి ఏడేళ్లవుతున్న ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు అభిమానులు. కోట్ల మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న హీరోయిన్ ఈ అతిలోక సుందరి

శ్రీదేవి.. పరిచయం అవసరం లేని పేరు. ఈమె చనిపోయి ఏడేళ్లవుతున్న ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు అభిమానులు. కోట్ల మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న హీరోయిన్ ఈ అతిలోక సుందరి. ఈ రోజుకూ ఈమె గురించి అభిమానులు బాధ పడుతూనే ఉన్నారు. అనుకోకుండా భువి నుంచి దివికి ఏగిపోయిన ఈ తార గురించి ఇప్పటికీ కన్నీరు కారుస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 24న ఈమె వర్ధంతి. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో పెళ్ళికి వెళ్ళిన శ్రీదేవి అక్కడే అర్ధాంతరంగా అందరికీ దూరమైపోయారు. బాత్ టబ్ లో పడి ఎలా చనిపోయారనేది ఇప్పటికి రహస్యమే. దీని గురించి ఎవరూ మాట్లాడరు.. అసలు ఏం జరిగింది అనే విషయం ఎవరికీ చెప్పరు.
ఓ హీరోయిన్ గురించి చెప్పాలంటే ఈమె ఇక్కడ నెంబర్ వన్.. అక్కడ నెంబర్ వన్ అని చెప్తారు. కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ అని చెప్పే హీరోయిన్ మాత్రం శ్రీదేవి.. ఉరఫ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా. దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ ఒక్క ఆఫర్ సంపాదించడమే అనూహ్యం అనుకుంటే.. అక్కడే ఉండి రేఖ, మాధురి దీక్షిత్ లాంటి స్టార్ హీరోయిన్లను కూడా తన అందంతో మైమరిపించి.. పక్కకు నెట్టేసి నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది శ్రీదేవి. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి ఆ తరం నటుల నుంచి.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి ఈ తరం నటుల వరకు అందరితోనూ ఆడిపాడిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి. తమిళనాట కూడా రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్ లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ.
కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. ఈమె మరణం మాత్రం ఇప్పటికి మిస్టరీనే. దుబాయ్ లో పెళ్లి కోసం వెళ్లిన శ్రీదేవి అక్కడే అనుమానాస్పద రీతిలో బాత్ టబ్బులో పడి చనిపోయింది. దుబాయ్ పోలీసులు ఇది హత్యా..? లేదంటే అనుకోకుండా జరిగిందా అని తేల్చడానికి నాలుగు రోజుల పాటు శ్రీదేవి శవాన్ని అక్కడే ఉంచారు. అప్పట్లో దీనిపై చాలా పెద్ద చర్చ జరిగింది కూడా. చివరికి శ్రీదేవి మద్యం మత్తులో చనిపోయిందని.. ఆమెను ఎవరు హత్య చేయలేదని తేల్చారు దుబాయ్ పోలీసులు.
ఆ మధ్య సత్యర్థ్ నాయక్ అనే రైటర్ శ్రీదేవి బయోగ్రఫీ రాశారు. ఈ బయోగ్రఫీలో శ్రీదేవి గురించి బయట ప్రపంచానికి తెలియని విషయాలను రాసాడు నాయక్. శ్రీదేవికి రక్తపోటు ఉందని పంకజ్ పరాషర్, నాగార్జున చెప్పారని రాశారు. షూటింగ్ సమయంలో ఆమె చాలా సార్లు కళ్ళు తిరిగి పడిపోయిందని.. ఓసారి ఇలాగే బాత్రూంలో పడిపోతే మొహానికి పెద్ద గాయం కూడా అయిందని శ్రీదేవి మేనకోడలు చెప్పారని బయోగ్రఫీలో రాశాడు. ఇంకోసారి వాకింగ్ చేస్తూ శ్రీదేవి కుప్పకూలిందని బోని కపూర్ తెలిపినట్టు సత్యర్ధ్ తెలిపారు. మొత్తానికి దుబాయ్ లో కూడా అలాగే జరిగి ఉంటుందని నాయక్ తన బయోగ్రఫీలో చెప్పాడు. ఇవన్నీ ఇలా ఉంటే.. శ్రీదేవి మరణం మీద అనవసరపు రచ్చ చేయొద్దు అంటూ బోనీ కపూర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు. అంతేకాదు తాను ప్రాణాలతో ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్ రాదు అని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఏడేళ్లు కాదు ఎన్నేళ్ళైనా డెత్ మిస్టరీ అలాగే ఉండిపోయేలా కనిపిస్తుంది.