Telugu Film Industry: పేరుచూసి కాదు పాటవిని – హీరోను చూసి కాదు దర్శకుడిని నమ్మి..!
సినిమా అంటే ఏమిటి అని అడిగితే.. అందరూ చెప్పే ఒకే ఒక్క సమాధానం వినోదం. ఈ వినోదంలో కొన్నిరకాలా మార్పులు ప్రతి దశాబ్దానికీ చోటు చేసుకుంటుంది. దీనినే మూకీ ఎరా, టాకీ ఎరా అంటారు. ఒకప్పుడు వస్తాలంకరణ, మరికొన్ని రోజులకు హెయిర్ స్టైల్, మరికొన్నిరోజులకు సాహిత్యం, ఇప్పుడు సంగీతం, దర్శకత్వం. ఇలా ఎందుకు చెప్పవల్సి వచ్చిందంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
సంగీతం మనసుకు హాయిని కలిగించే ఒక సాధనం. ఇందులో మంచి సాహిత్యం, అర్థవంతమైన పదాలు ఉపయోగిస్తే ప్రతిఒక్కరికీ నచ్చుతుంది. దీనికి మరింత మెరుగైన రాగాన్ని సమకూరుస్తే ఇక చెప్పేదేముంది. ప్రతి ఒక్కరి యద లోతుల్లోకి చొచ్చుకు పోతుంది ఆపాట. అలాంటి సంగీతం ప్రస్తుతం ఉందా అనే భ్రమను మనలో కలుగజేసేవారూ లేకపోలేదు. ఎందుకంటే అర్థం లేని పదాలు, సంగీతంలో చొప్పింపజేయాలనే ఉద్దేశ్యంతో ఒత్తులు లేని చోట వాటిని అమర్చి, దీర్ఘాలు లేని చోట వాటిని చేర్చి పాట అర్థాన్ని మార్చేస్తున్నారు. ఇదంతా ఒకరకమైతే ఇప్పుడు మరో మర్పుకు బీజం పడింది. అదేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వారందరి కోసమే నవీన ప్రయోగం ఈ కథనం.
ఒకప్పుడు సుప్రసిద్ధ సంగీత దర్శకులు, గాయనీ గాయకుల పేర్లు తెలుసుకొని వారు పాడే పాటలు వినేవారు. గంటసాల, ఎస్పీ బాలు, సునీత, చిత్రా వంటి గాయనీ గాయకులు పాడిన వారిపేర్లు తెలుసుకొని వాటిని వినేవారు. ఇలాంటి పరిస్థితులు క్రమక్రమంగా అటకెక్కాయి. దీనికి ప్రత్యేక నిదర్శనం అంతగా పరిచయం కానీ వారి పాటలు విని అవి బాగున్నాయి అనిపించి, అప్పుడు వారి గురించి తెలుసుకోవాలనే విధంగా ఒక సరికొత్త ఒరవడికి సినీరంగం చోటు కల్పించింది. శ్రోతలకు ఇలాంటి వింత భావన చోటు చేసుకుంది.
దీనికి సరైన ఆధారాలతో కూడిన వివరాలే 2019 లాక్ డౌన్ నుంచి నేటి వరకు వచ్చిన పాటలు. గొప్పగా సినిమా రంగంలో అనుభవం లేకున్నా తొలి పరిచయంతోనే తమ పాటలతో సంగీత దర్శకత్వంతో మంచి విజయాలను సాధించిన వారు పదుల సంఖ్యలో వున్నారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం. జాతిరత్నాలు, పుష్పక విమానం, నల్లమల, అర్ధశతాబ్ధం ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల పాటలు శ్రోతలను అలరించాయి. వీటిని పాడిన వారు (రామ్ మిరియాల, సిద్ శ్రీరామ్, PK) ఎవరు అప్పట్లో గొప్ప అనుభవం వున్న వారు కాదు. అందరూ కొత్తవాళ్ళే. కానీ ప్రస్తుతం వీరి పాటలకు ప్రజాదరణ పొందడంతో వీరిపేర్లు అలవోకగా తెలిసిపోతున్నాయి. వీరిపాటలు వెలుగులోకి రాకముందు మనకు అస్సలు వీరి మొఖం కూడా అంతగా తెలిసేది కాదు.
ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు. అయితే 15 – 20 సంవత్సరాల క్రితం వున్న జనరేషన్ వాళ్ళకి మ్యూజిక్ డైరక్టర్, సింగర్స్ పేర్లు తెలుసుకొని ఆతరువాతే వారి పాటలు వినేవాళ్లా అనే సందేహం మీలో కలుగవచ్చు. దీంతో పాటూ మరో సందేహం కూడా రావచ్చు. అప్పట్లో ఇంతటి సాంకేతికత, తెలుసుకోవాలన్న జ్ఞానం లేదు అందుకే తెలుసుకోలేక పోయేవారు అని అనుకోవచ్చు. కానీ వీటన్నింటికీ సమాధానం ఖచ్చితమైన హేతుబద్దంగానే ఉంది. అప్పట్లో ఇలాంటి ప్రతిభ కలిగిన వాళ్ళు వ్రేళ్ళలో లెక్కపెట్టేలా వుండేవాళ్ళు కాబట్టి వారి పేర్లు తరచూ వినిపిస్తూ వుండేవి. ( ఇళయరాజా, ఏసుదాస్, జానకి, S.P.B, S.P.S, చిత్ర, సునీత, గీతామాధురి, శ్రీ కృష్ణ). ద్విదశాబ్దాల నుంచి లాక్ డౌన్ వరకు ఇవే పేర్లు వినిపించేవి.
కానీ ఇప్పుడు ఒక్క ఏడాది కాలంలోనే చాలా మంది గాయనీ గాయకులు, సంగీత దర్శకులు ఒకరిని మించిన కళా నైపుణ్యంతో మరొకరు అమాంతం వెలుగులోకి వచ్చారు. వారి పాటలు అంతకన్నా అద్భుతంగా వుంటున్నాయి. అందుకే సంగీతం సమకూర్చి, పాడేవారి గురించి కన్నా పాటల గురించి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు కొత్తవారు అసంఖ్యాకంగా వస్తుండడంతో పాటలు విన్నాక వారి పేర్లను తెలుసుకునే పరిస్థితులకు మారిపోయాయి.
ఇదే తరహా వాతావరణం సినిమా దర్శకత్వంలో కూడా పడింది. ఒకప్పుడు హీరోను చూసి థియేటర్లకు వెళ్లేవారు. అతను ఏం చేసినా చూడక తప్పేది కాదు. కానీ ప్రస్తుతం ఈ శకం ముగిసింది. ఇలా ముగియడానికి కారణం రాజమౌళి, త్రివిక్రమ్, పూరీ జగన్నాధ్ లు. రాజమౌళి తన సినిమాలో హీరో ఎలా ఉండాలో ప్రేక్షకుల నాడిని పట్టుకొని చూస్తాడు. అదే హీరో అయితే తనకు వచ్చినట్లుగా కేవలం ఒక తరగతికి చెందిన వారిగానే చేస్తారు. త్రివిక్రమ్ కూడా అంతే తనదైన రచనా దర్శకత్వానికి తగ్గట్టుగా కథానాయకులను ఎంపిక చేసుకుంటాడు. పూరీ జగన్నాధ్ అయితే ప్రతి సినిమాలో హీరోకి ఒక మ్యానరిజాన్ని క్రియేట్ చేస్తాడు. దీంతో హీరోలు ఎప్పుడూ ఒకే రకంగా కనిపించకుండా కొత్త రకంగా కనిపిస్తారు. ఇలా చేయడం వల్ల సినిమా అభిమానుల్లో వీరు అయితే చూపించిందే పదే పదే చూపించి మనమీద రుద్దకుండా ఏదో ఒక కొత్త అంశాన్ని ప్రపంచానికి తమ సినిమా ద్వారా పరిచయం చేస్తారన్న ఉద్దేశ్యంతో ముందు డైరెక్టర్లను తెలుసుకొని సినిమా హిట్టా కాదా అనే అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఏది ఏమైనా సినిమా రంగం ప్రస్తుతం సరికొత్త విధానాలను, విచిత్ర కథాంశాలను, విచిత్రమైన వేషధారణలతో ప్రేక్షకులను అలరించేందుకు తీవ్రంగా శ్రమిస్తుందని చెప్పాలి.
T.V.SRIKAR