South Indian Films: బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న సౌత్ సినిమా.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మనదే హవా..!
ఒక్కొక్క సినిమా కాదు షేర్ ఖాన్.. వంద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా పర్వాలేదు.. బాలీవుడ్‌ను షేక్ చేసి పాన్ ఇండియాలో వసూళ్ల వర్షం కురిపించే సత్తా కేవలం ఇప్పుడు సౌత్ ఇండియాకు మాత్రమే ఉంది. ఒకప్పుడు భారతీయ సినిమాలు అంటే బాలీవుడ్ గురించి మాత్రమే మాట్లాడుకునే వాళ్లు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై దక్షిణాది చిత్రాలు మెరిసిపోతున్నాయ్. ఖాన్‌లు, కపూర్‌ల రోజులు పోయాయ్.. పాన్ ఇండియాలో ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్న సినిమాలను దక్షిణాది పరిశ్రమ మాత్రమే అందిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, సాండల్‌వుడ్.. వీటి ముందు బాలీవుడ్ సినిమాలు తేలిపోతున్నాయ్. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పొన్నియన్ సెల్వన్ వంటి భారీ చిత్రాలను, పాన్ ఇండియాలో వాటి విజయాన్ని చూసి చెబుతున్న మాటలు కావివి. సగటు ఇండియన్ ఆడియన్స్ సౌత్ సినిమాకు ఎలా కనెక్ట్ అయ్యాడో బాక్సాఫీస్ లెక్కలే చెబుతున్నాయ్.
మెయిన్ స్ట్రీన్ సినిమాగా రీజనల్ మూవీస్
సినిమాలో కథ కథనం ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంటే భాష ఏదైనా సరే.. ఇండస్ట్రీ ఎక్కడిదైనా సరే.. ఇండియన్ మూవీ లవర్స్ ఖుషీ అవుతారనడానికి ప్రాంతీయ సినిమాల కలెక్షన్లే నిదర్శనం. ఫిక్కీ లెక్కల ప్రకారం గడిచిన మూడేళ్లలో బాలీవుడ్ హిందీ సినిమా వసూళ్లతో పోల్చితే ప్రాంతీయ భాషా చిత్రాల బాక్సాఫీస్ వసూళ్లు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయ్. 2019లో రీజనల్ సినిమాల గ్రాస్ కలెక్షన్స్..4వేల కోట్ల రూపాయలు ఉంటే..2022 నాటికి సౌత్ ఇండియన్ మూవీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. 5300 కోట్లకు చేరుకున్నాయ్. అదే సమయంలో హిందీ సినిమా వసూళ్లు 5200 కోట్ల రూపాయల నుంచి 3500 కోట్లకు పడిపోయాయ్. బాక్సాఫీస్ వసూళ్లు పడిపోయాయంటేనే ప్రేక్షకులను కట్టిపడేసే ఫార్ములాతో హిందీ సినిమాలు రావడం లేదని అర్థం. మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లలో రీజనల్ సినిమాల వసూళ్ల శాతం 42 శాతం పెరిగితే.. హిందీ సినిమాల షేర్ 39 నుంచి 28 శాతానికి పడిపోయింది.
బాలీవుడ్ ఎందుకు బోల్తా కొడుతోంది ?
సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్.. ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు కట్టిపడేయాలి. ఆ సినిమా ఏ జానర్‌లో ఉన్నా సరే.. దాని థీమ్ ఎలాంటిదైనా సరే.. చూసే ప్రేక్షకుడికి కనెక్ట్ అయిపోవాలి. అల్లూరి, కుమురం భీమ్ వంటి తెలుగు పాత్రలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్.. పాన్ ఇండియా స్థాయిని దాటి.. ఆస్కార్ వరకు వెళ్లింది. ఎక్కడో కర్ణాటకలో మారుమూల అటవీ ప్రాంతంలో కొంతమంది జీవన విధానాన్ని కాంతారాగా చూపిస్తే యావత్ దేశం కళ్లప్పగించి చూసింది. ఇక పుష్ప, కేజీఎఫ్, బాహుబలి వంటి చిత్రాల రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ కొన్నేళ్లుగా బాలీవుడ్ హిందీ సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేకపోతున్నాయ్.. షారుక్, సల్మాన్, హృతిక్, రణబీర్.. ఎవరి సినిమాలైనా.. సౌత్ సినిమా రేంజ్‌లో ఆదరణ పొందలేకపోతున్నాయి. హిందీ సినిమా కథల్లో ప్రేక్షకులను మెప్పించే ఎలిమెంట్స్ కూడా పెద్దగా లేకపోవడంతో అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అదే సమయంలో విలక్షణమైన కథలతో.. పాన్ ఇండియా తారాగణంతో దక్షిణాదిన తెరకెక్కుతున్న చిత్రాలు.. సరిహద్దులు దాటి అందర్నీ అలరిస్తున్నాయి. అందుకే సౌత్ మూవీల కలెక్షన్లను చూసి బాలీవుడ్ షేక్ అయిపోతోంది.
బాలీవుడ్ ప్లాప్స్‌కు నిర్మాతలే కారణమా ?
నిర్మాత డబ్బులు పెట్టాలి… దర్శకుడు సినిమా తీయాలి… నటీనటులు నటించాలి… ఏ సినిమాకైనా ఇదే ఫార్ములా. అయితే ఒక్కో మూవీ ఇండస్ట్రీలో ఒక్కో విభాగం డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో నిర్మాతల డామినేషన్ నడుస్తోంది. మంచి కథ కథనంతో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించే ప్రతిభావంతులైన దర్శకులు బాలీవుడ్‌లో ఉన్నా… కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో నిర్మాతలు స్టోరీ మొత్తాన్ని మార్చేస్తున్నారన్న విమర్శ బాలీవుడ్ నుంచి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విడుదలవుతున్న సినిమాల సంఖ్య గడిచిన రెండేళ్లుగా పెరుగుతూ వస్తున్నా..వాటి కలెక్షన్లు మాత్రం బాక్సాఫీస్‌ను మెప్పించలేకపోతున్నాయ్.
హిందీ కన్నా.. సౌత్ డబ్బింగ్ సినిమాలే సూపర్
భారీ తారాగణంతో సిల్వర్ స్క్రీన్ పై దండయాత్ర చేసే బాలీవుడ్ ఒరిజినల్ హిందీ సినిమాల కంటే.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలను హిందీ లోకి డబ్ చేస్తే..వాటికే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. కాంతారా, బాహుబలి ది బిగినింగ్, ఆర్ఆర్ఆర్, పుష్ దిరైజ్, బాహుబలి ది కంక్లూజన్..కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి సౌత్ సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్స్.. హిందీ ప్రేక్షకులు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 మొత్తం కలెక్షన్లలో హిందీ డబ్బింగ్ వర్షన్ వాటానే 52 శాతం ఉందంటే.. సౌత్ సినిమాలకు హిందీ ప్రేక్షకులు ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.
OTTలోనూ సౌత్ కంటెంట్‌దే హవా
కేవలం సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే కాదు.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ దక్షిణాది సినిమాల హవా నడుస్తోంది. సౌత్ ఇండియన్ మూవీలను ఓటీటీలల్లో చూస్తున్న ప్రేక్షకుల్లో 50 శాతానికి పైగా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలే ఉన్నారంట. దీనిని బట్టి దక్షిణాది రేంజ్ బాలీవుడ్‌ను క్రాస్ చేసేసిందని ఈజీగా అర్థమవుతుంది.
ఇండియన్ సినిమా రూట్ మార్చిన సౌత్
సౌత్ అన్నా.. దక్షిణాది సినిమాలన్నా.. ఉత్తరాది రాష్ట్రాల్లో చిన్నచూపు ఉండేది. సినిమా అంటేనే బాలీవుడ్ అని… కాలర్ ఎగరేసిన రోజూలు కూడా ఉన్నాయి. హమ్ ఆప్ కే హై కౌన్ వంటి చిత్రాలను దక్షిణాది భాషల్లోకి అనువదించి సొమ్ము చేసుకునే వాళ్లు. కానీ ఇప్పుడు భారతీయ సినిమానే కాదు…మొత్తం ఇంటర్నేషనల్ సినిమా ఫోకస్ మొత్తం సౌత్ ఇండియాపైనే పడింది. కొన్ని సంవత్సరాలుగా సౌత్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్‌ను పూర్తిగా పక్కకు నెట్టేశాయి. డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాదు… పాన్ ఇండియా కలక్షన్లలోనూ సునామీ సృష్టిస్తున్నాయి. దక్షిణాది నుంచి ఇదే ట్రెండ్ కొనసాగితే… బాలీవుడ్ ఇండస్ట్రీ నామమాత్రంగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. సౌత్ ఇండియన్స్ గా మనం గర్వపడాల్సిందే మరి..!