విశ్వంభరను ముంచేస్తున్న అత్యుత్సాహం.. చిరంజీవి సినిమాకు ఇలాగైతే కష్టమే..!
చిరంజీవితో పాటు ఆయన అభిమానుల ఫోకస్ మొత్తం ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా మీదే ఉంది. కానీ దీనికంటే ముందు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే ఒక సినిమా చేశాడు అనే విషయం వాళ్లకు గుర్తుందా లేదా అనే విషయం అసలు అర్థం కావడం లేదు.

చిరంజీవితో పాటు ఆయన అభిమానుల ఫోకస్ మొత్తం ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా మీదే ఉంది. కానీ దీనికంటే ముందు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే ఒక సినిమా చేశాడు అనే విషయం వాళ్లకు గుర్తుందా లేదా అనే విషయం అసలు అర్థం కావడం లేదు. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి లాంటి సినిమాల తర్వాత చిరంజీవి కెరీర్ లో వస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇది. అంగరంగ వైభవంగా ఈ సినిమాను మొదలుపెట్టాడు మెగాస్టార్. తన కెరీర్లో ఇది మరొక జగదేకవీరుడు అతిలోకసుందరి అవుతుందని చాలా నమ్మకంగా చెప్పాడు. అంతేకాదు చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇది. చిరంజీవి ప్రస్తుత మార్కెట్ తో పని లేకుండా ఏకంగా 200 కోట్లు పెట్టి విశ్వంభర సినిమాలను నిర్మిస్తున్నారు యువి క్రియేషన్స్. ఈ సినిమా షూటింగ్లో అనుకున్న దాని కంటే చాలా త్వరగా పూర్తి చేశాడు వశిష్ట. అందుకే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. కానీ ఔట్ పుట్ చూసుకున్న తర్వాత చాలా లోపాలు కనిపించడంతో కాస్త ఆలస్యమైన పర్లేదు కానీ టైం తీసుకుని క్వాలిటీ ఔట్ పుట్ తో వద్దామని సినిమాను వాయిదా వేశారు. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఉగాది దాటినా కూడా ఇప్పటివరకు అనౌన్స్మెంట్ కాదు కదా కనీసం మరో టీజర్ కూడా విడుదల చేయలేదు చిత్ర యూనిట్.
అడిగితే ప్రస్తుతం అదే పనుల్లో బిజీగా ఉన్నామంటున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి సినిమా మొదలైపోయింది. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది.. మెగా 157 మొదలైన తర్వాత 156 గురించి ఎవరూ మాట్లాడడం లేదు. మొత్తం అంతా అనిల్ సినిమా గురించే చర్చ జరుగుతుంది. చిరంజీవి కూడా ఫోకస్ మొత్తం అనిల్ రావిపూడి మీద పెట్టాడు. అసలు విశ్వంభర అనే సినిమా చేసినట్టు ఆయనకు గుర్తుందో లేదో కూడా అర్థం కావడం లేదు. ఆ సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ బేస్ మీద తెరకెక్కుతుంది. దానికి తాను చేయాల్సిన పనులు మొత్తం పూర్తి చేశాడు చిరంజీవి. ఇప్పుడు బాల్ దర్శకుడు వశిష్ట కోర్టులో ఉంది. ఆయన కూర్చుని సినిమాను ఎంత బాగా ముస్తాబు చేస్తే రిజల్ట్ అంత బాగుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని కుదిరితే ఆగస్టులో విశ్వంభర విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు ఇప్పటి వరకు ఓటిటి రైట్స్ కూడా అమ్ముడు పోలేదని తెలుస్తుంది.
దర్శక నిర్మాతలు చెబుతున్న రేటుకు ఏ డిజిటల్ సంస్థ ముందుకు రావడం లేదని.. రిలీజ్ తర్వాత సినిమాను అమ్మాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా అనిల్ రావిపూడి సినిమాకు చూపిస్తున్న అత్యుత్సాహం దాని ముందు సినిమాను మింగేస్తుంది. ఈ విషయంలో చిరంజీవి కాస్త చొరవ తీసుకొని విశ్వంభరను త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్. సినిమా చూసిన తర్వాత చాలావరకు చిరంజీవి నుంచి మార్పులు చేర్పులు జరిగాయని.. కొన్ని కొత్త సన్నివేశాలు కూడా యాడ్ చేశారని తెలుస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కనెక్టివిటీ లేని కొన్ని సీన్స్ మళ్లీ షూట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. కాస్త ఆలస్యం అయినా కూడా.. విశ్వంబర అందరికీ నచ్చే సినిమా అవుతుంది అని బలంగా నమ్ముతున్నాడు చిరంజీవి. అలా అయితే పర్లేదు కానీ.. మరో అంజి కాకుండా ఉంటే చాలు అంటున్నారు అభిమానులు. అంజి సినిమా చాలా బాగుంటుంది.. కానీ కేవలం ఆలస్యం కావడంతోనే ఈ సినిమాకు అలాంటి రిజల్ట్ వచ్చింది. విశ్వంభరకు అలాంటి పరిస్థితి రాకూడదు అంటున్నారు ఫ్యాన్స్. ఆగస్టు 22న మెగా బర్త్ డే కానుకగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.