The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’పై వివాదం దేనికి? మరో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అవుతుందా?
‘ది కాశ్మర్ ఫైల్స్’ చిత్రంలోలాగే ఇందులో కూడా కొన్ని వివాదాస్పద అంశాలున్నాయి. ఒక వర్గానికి వ్యతిరేకంగా కావాలనే ఈ చిత్రం తీశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ది కేరళ స్టోరీ’పై ఎందుకీ వివాదం?
The Kerala Story: గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’. వివాదాస్పద అంశాలు, భావోద్వేగాలు ఈ చిత్రానికి కలిసొచ్చాయి. ఇప్పుడు ఇదే కోవలో మరో చిత్రం రాబోతుంది. అదే ‘ది కేరళ స్టోరీ’. ఈ నెల 5న విడుదల కానున్న ఈ చిత్రం కూడా ప్రస్తుతం వివాదాల్ని ఎదుర్కొంటుంది. ‘ది కాశ్మర్ ఫైల్స్’ చిత్రంలోలాగే ఇందులో కూడా కొన్ని వివాదాస్పద అంశాలున్నాయి. ఒక వర్గానికి వ్యతిరేకంగా కావాలనే ఈ చిత్రం తీశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ది కేరళ స్టోరీ’పై ఎందుకీ వివాదం? ఇది కూడా సంచలన విజయం సాధిస్తుందా?
సుదీప్తో సేన్ దర్శకత్వంలో, హిందీలో రూపొందిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలాని, సిద్ధ ఇద్నాని ప్రధాన పాత్రలు పోషించారు. గత వారమే చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ నెల 5న థియేటర్లలోకి రానుంది. అయితే, గత వారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి దీని చుట్టూ వివాదం నడుస్తోంది. ఒక వర్గాన్ని, కేరళను తక్కువ చేసి చూపించే ఉద్దేశంతోనే ఈ సినిమా రూపొందించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఈ చిత్రాన్ని విమర్శించారు. ఇంతకీ ఈ చిత్రంలో వివాదాస్పదంగా ఏముంది? ఎందుకు దీనిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?
కథా నేపథ్యమే వివాదానికి కారణమా?
దేశంలో పలు తీవ్రవాద కేసుల విచారణలు జరిగిన పలు సందర్భాల్లో కేరళలో లింకులు బయటపడుతుంటాయి. నిషేధిత తీవ్రవాద సంస్థ పీటీఐ మూలాలు కేరళలోనే ఉన్నాయి. గతంలో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్ తీవ్రవాదులతో పలువురు కేరళీయులు సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో కేరళ ఇమేజ్ చాలా దెబ్బతింది. కేరళను తీవ్రవాదానికి అడ్డాగా కొందరు అభివర్ణిస్తుంటారు. తాజాగా దర్శకుడు సుదీప్తో సేన్ ఇదే అంశంతో ‘ది కేరళ స్టోరీ’ సినిమా తీశాడు.
సినిమా కథ ప్రకారం.. కేరళలో కొన్నేళ్లుగా వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. వారిని వెతికే నేపథ్యంతో చిత్రం సాగుతుంది. చివరకు నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరుతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథ. అయితే, కేరళకు చెందిన కొందరు అమ్మాయిలు ఇలా ఐసిస్‌లోకి చేరడం, ఉగ్రవాద సంస్థల్లో చేరి, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అని చూపించడమే వివాదానికి కారణమవుతోంది.
ప్రతిపక్షాల ఆగ్రహం
ఈ చిత్రంపై కేరళకు చెందిన అధికార పార్టీ నేతలు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులు, దర్యాప్తు సంస్థలు తిరస్కరించిన లవ్ జిహాద్ అంశాన్ని ఈ చిత్రం గుర్తు చేసేలా ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. కేరళను ప్రపంచం ముందు అవమానించేందుకు ఈ సినిమా తీసినట్లుందని ఆరోపించారు. ఒక వర్గాన్ని కించపరిచేందుకు, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఈ సినిమా తీశారన్నారు.
అయితే, వారి ఆటలు కేరళలో సాగవని విమర్శించారు. ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు కాంగ్రెస్, డీవైఎఫ్, ఐయూఎంఎల్ వంటి పార్టీలు కూడా ఈ సినిమా ప్రదర్శనకు అనుమతివ్వకూడదని డిమాండ్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తుంటే, కేరళలోని కొన్ని క్రైస్తవ సంఘాలు మాత్రం స్వాగతిస్తున్నాయి. దీంతో ఈ చిత్రం రాజకీయ రంగు పులుముకుంది.
‘ది కాశ్మీర్ ఫైల్స్’లాగా సక్సెస్ అవుతుందా?
‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో కూడా వివాదాస్పద అంశాలే ఉన్నాయి. ఒక వర్గాన్ని తక్కువ చేసేలా, ఒక ఎజెండా ప్రకారమే ఈ చిత్రం తీశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే, వివాదం కారణంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి ఒక వర్గం మద్దతు లభించింది. సినిమాలోని కంటెంట్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు ఘన విజయం అందించారు. ఇలాగే వివాదాస్పద అంశంతో రూపొందుతున్న ‘ది కేరళ స్టోరీ’ కూడా విజయవంతమవుతుందని కొందరు విశ్లేషకుల అంచనా. అయితే, ఇన్ని వివాదాల మధ్య అసలు ఈ చిత్రం విడుదలవుతుందా? లేదా? అనేదే అసలు విషయం.