The Kerala Story: ది కేరళ స్టోరీకి ఓటీటీ కష్టాలు.. కొనేందుకు ముందుకురాని ప్లాట్‌ఫామ్స్
పెట్టుబడికి దాదాపు 20 రెట్లు వసూళ్లు సాధించిన చిత్రమిది. ఇంతటి ఘన విజయం సాధించిన చిత్రానికి ఇప్పుడు ఓటీటీ బిజినెస్ పూర్తి కావడం లేదు. ఈ సినిమాలోని వివాదస్పద కంటెంటే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.
The Kerala Story: వివాదాస్పద చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చి, సంచలన విజయం సాధించిన చిత్రం ది కేరళ స్టోరీ. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.250 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఒక వర్గం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. బీజేపీ ఈ చిత్రానికి అండగా నిలిచింది. మరో వర్గం నుంచి, కొన్ని రాజకీయ పక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ చిత్ర ప్రదర్శనను నిషేధించాయి.
చిత్ర బృందానికి బెదిరింపులు వచ్చాయి. ఇలాంటి వివాదాల కారణంగా భారీ పబ్లిసిటీ దొరికింది. దీంతో సినిమాకు ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. పెట్టుబడికి దాదాపు 20 రెట్లు వసూళ్లు సాధించిన చిత్రమిది. ఇంతటి ఘన విజయం సాధించిన చిత్రానికి ఇప్పుడు ఓటీటీ బిజినెస్ పూర్తి కావడం లేదు. ఈ సినిమాలోని వివాదస్పద కంటెంటే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఒక వర్గాన్ని తక్కువ చేసేలా కథా, కథనాలు ఉండటం వల్ల ఏ ఓటీటీ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సినిమా వర్గాలు తెలిపాయి. నిజానికి ఘన విజయం అందుకున్న సినిమాల కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడుతుంటాయి. ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేసి మరీ ఓటీటీ రైట్స్ దక్కించుకుంటాయి. కానీ, ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ రన్ పూర్తైనా సరే.. ఇంకా ఓటీటీ డీల్ పూర్తికాలేదు.
నిజానికి ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి రావాలి. ఈ సినిమాతోపాటే రిలీజైన చాలా చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. కానీ, ది కేరళ స్టోరీ ఓటీటీ డీల్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. గతంలో కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నించినప్పటికీ.. వివాదాస్పద కంటెంట్ కారణంగా అవి వెనకడుగు వేశాయి. సరైన ఓటీటీ డీల్ కోసం ఎదురు చూస్తన్నట్లు దర్శకుడు సుదీప్తో సేన్ తెలిపారు. ఈ సినిమా తీసినప్పటి నుంచి తమకు చిత్ర పరిశ్రమలోని కొందరు వ్యక్తులు దోషులుగా చూస్తున్నట్లు, ఒక వర్గం వాళ్లు తమకు తగిన గుణపాఠం చెప్పాలని ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్ర ఓటీటీ డీల్ పూర్తైన వెంటనే సినిమా అందుబాటులోకి రావొచ్చు.