The Kerala Story: వంద కోట్ల క్లబ్బులో ది కేరళ స్టోరీ.. కోట్లు కుమ్మరిస్తున్న వివాదాలు..
ప్రతి సినిమా పబ్లిసిటీకి కోట్లు ఖర్చుపెట్టక్కర్లేదు. సినిమా వివాదాస్పదం అయితే చాలు.. ఎవరో ఒక వర్గం ప్రేక్షకులు అండగా నిలిస్తే చాలు.. సినిమాలు విజయవంతం అవుతున్నాయి. మొన్న ది కాశ్మీర్ ఫైల్స్.. నిన్న పఠాన్.. నేడు ది కేరళ స్టోరీ. పెద్దగా ప్రచారం చేయకుండానే ఈ సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధించాయి.
The Kerala Story: ఒక సినిమా ప్రేక్షకులకు చేరాలంటే దానికి తగినంత పబ్లిసిటీ కావాలి. ఆ తర్వాత సినిమాలో ఆకట్టుకునే కంటెంట్ ఉండాలి. అయితే, ప్రతి సినిమా పబ్లిసిటీకి కోట్లు ఖర్చుపెట్టక్కర్లేదు. సినిమా వివాదాస్పదం అయితే చాలు.. ఎవరో ఒక వర్గం ప్రేక్షకులు అండగా నిలిస్తే చాలు.. సినిమాలు విజయవంతం అవుతున్నాయి. మొన్న ది కాశ్మీర్ ఫైల్స్.. నిన్న పఠాన్.. నేడు ది కేరళ స్టోరీ. పెద్దగా ప్రచారం చేయకుండానే ఈ సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధించాయి. ఇటీవలే విడుదలైన ది కేరళ స్టోరీ రూ.112 కోట్ల వసూళ్లు సాధించింది. ఇంకా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నిజంగానే వివాదాలు సినిమాకు కోట్లు తెచ్చి పెడుతాయా?
గత ఏడాది ఆరంభంలో విడుదలైంది ది కాశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా వచ్చి భారీ విజయం అందుకుంది ఈ సినిమా. ఒకరిద్దరు తెలిసిన నటులు తప్ప పెద్దగా స్టార్స్ ఎవరూ లేరు. సినిమా విడుదలకు ముందు ఈ సినిమా గురించి ఎవరికీ తెలీదు. విడుదల సమయంలో ప్రచారం కూడా పెద్దగా చేయలేదు. కానీ, దేశంలోని సినీ ప్రేక్షకులు ది కాశ్మీర్ ఫైల్స్‌కు సంచలన విజయాన్ని అందించారు. కారణం.. ఈ చిత్రంలోని వివాదాస్పద అంశమే. సినిమాలో చూపించిన అంశాలపై ఒక వర్గం ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్లకు మద్దతుగా నిలిచాయి. మరోవర్గం సినిమాకు మద్దతు ప్రకటించింది. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వాళ్లు ప్రేక్షకులు ఈ సినిమా చూడాలని కోరారు. దీంతో సినిమాపై రాజకీయ పార్టీలు, ప్రేక్షకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. మీడియాలో, సోషల్ మీడియాలో స్పందిస్తూ సినిమాకు ప్రచారం కల్పించారు. దీంతో ఈ సినిమా చూసేందుకు ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ది కాశ్మీర్ ఫైల్స్ దాదాపు రూ.300 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు అంచనా.
పఠాన్‌కు కలిసొచ్చిన వ్యతిరేకత
ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం పఠాన్. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమాపై కూడా చాలా కాలంగా వ్యతిరేకత నడిచింది. ఒక వర్గం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో నెలల తరబడి ప్రచారం చేశారు. సినిమాలోని కొన్ని అంశాలపై కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. హిందూ సంఘాలు సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశాయి. ఈ వివాదాలతో సినిమాకు భారీ ప్రచారం లభించింది. సినిమాపై న్యూస్ ఛానెళ్లలో డిబేట్లు కూడా నడిచాయి. దీంతో పఠాన్ మూవీ పేరు మార్మోగిపోయింది. ఇంత వివాదం జరుగుతున్నా చిత్ర బృందం మాత్రం స్పందించలేదు. వివాదాల మధ్యే సినిమా విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాను తెగ చూసేశారు. బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేసిన ప్రేక్షకులు కూడా సినిమా చూశారు. చివరకు సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. షారుక్ కెరీర్లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌కు ఊపిరిపోసింది. సినిమా కంటెంట్‌పై కొందరు ప్రేక్షకులు కొందరు ప్రేక్షకులు పెదవివిరిచినా మొత్తానికి సినిమా హిట్టైంది. సినిమాను నిషేధించాలంటూ కొందరు పనిగట్టుకుని మరీ ప్రచారం చేయడంతో మిగతా ప్రేక్షకుల నుంచి సానుభూతి వ్యక్తమైంది. ఇది కూడా సినిమాకు కలిసొచ్చింది.
ది కేరళ స్టోరీది అదే కథ
ది కాశ్మీర్ ఫైల్స్, పఠాన్ మూవీలాగే ప్రచారం వల్ల లాభపడ్డ సినిమా ది కేరళ స్టోరీ. ఈ సినిమాలో స్టార్స్ ఎవరూ లేరు. ఈ సినిమా వస్తోందని కూడా మొన్నటివరకు ఎవరికీ తెలీదు. పైగా చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందింది. కానీ, సినిమాలో ఒక వర్గాన్ని కావాలని తప్పుగా చూపించారనే అంశమే సినిమాకు ప్రచారం కల్పించింది. దీంతో మరో వర్గం ప్రేక్షకులు మద్దతుగా నిలిచారు. ఫలితంగా సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. విడుదలైన పది రోజుల్లోనే సినిమా రూ.110 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. మరికొన్ని రోజులు సినిమా ఇదే స్థాయిలో వసూళ్లు సాధించే అవకాశం ఉంది. వివాదమే ఈ సినిమాకు కలిసొచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
వంద కోట్ల క్లబ్బులో
సినిమాలకు వంద కోట్ల క్లబ్బు సక్సెస్‌కు కొలమానం. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలే ఇలా వంద కోట్ల వసూళ్లు సాధిస్తుంటాయి. కానీ, ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమాలు వివాదాలతోనే ఈ క్లబ్బులో చేరడం విశేషం. అది కూడా సినిమా విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు సాధించాయి. ఈ సినిమాలకు విడుదలైన రోజు కంటే తర్వాతి రోజుల్లోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ప్రేక్షకులు సినిమాను భావోద్వేగాలతో ముడిపెట్టి చూడటమే వీటి సక్సెస్‌కు కారణం. ఈ సినిమాల్లాగే భవిష్యత్తులో వివాదాస్పద అంశాలతో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది.