అదిరిపోయే ఆస్కార్ వేడుక.. మనకు నిరాశే.. విజేతలు వీళ్ళే..!
రెండేళ్ళ కింద ట్రిపుల్ ఆర్‌కు ఆస్కార్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ అవార్డ్స్‌పై ఇండియాలోనూ చర్చ బాగా జరుగుతుంది. మన సినిమాలున్నా లేకపోయినా అలారం పెట్టుకుని మరీ.. పొద్దున్నేలేచి ఆస్కార్ అవార్డుల గురించి..

రెండేళ్ళ కింద ట్రిపుల్ ఆర్‌కు ఆస్కార్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ అవార్డ్స్‌పై ఇండియాలోనూ చర్చ బాగా జరుగుతుంది. మన సినిమాలున్నా లేకపోయినా అలారం పెట్టుకుని మరీ.. పొద్దున్నేలేచి ఆస్కార్ అవార్డుల గురించి.. అక్కడ వచ్చిన విజేతల గురించి ఆరా తీస్తున్నారు. ఈ సారి కూడా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, నిర్మాత కానన్ ఓబ్రియాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సారి ఇండియన్ సినిమాలేవీ రేసులో లేవు. అయినా కూడా మన దగ్గర ఆస్కార్ అవార్డ్స్ గురించి చర్చ బాగానే జరిగింది. ఈ సారి అకాడమీ అవార్డుల్లో ఎన్ని నామినేషన్స్ ఉన్నా.. అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా మాత్రం అనోరానే. ఈ హాలీవుడ్ సినిమాపై అవార్డుల వర్షం కురిసింది. ఒకటి రెండు కాదు ఏకంగా 5 విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది అనోరా సినిమా.
ఉత్తమ నటితో పాటు ఉత్తమ చిత్రం, దర్శకుడు ప్లస్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రైటర్ ప్లస్ ఎడిటర్‌గా సీన్ బేకర్‌కు అవార్డులు వచ్చాయి. ఇది ఓ వేశ్య కథ. చదువు కోసం USA వచ్చిన ఒక రష్యన్ కోటీశ్వరుడు 23 ఏళ్ల వేశ్యతో ప్రేమలో పడతాడు.. వాళ్ళ పెళ్లికి కుటుంబం ఒప్పుకోదు.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇందులో ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. వేశ్య కథ అయినా కూడా.. వాళ్లకు ఉండే మనోభావాలు, అమ్మాయిలకు ఉండే సమస్యలు.. ప్రేమలో ఉండే ప్యూరిటీ అన్నీ అద్భుతంగా చూపించాడు దర్శకుడు సీన్ బేకర్. అకాడమీ అవార్డుల్లోనే కాదు.. దీనికి ముందు చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ అనోరా సినిమాపై అవార్డుల వర్షం కురిసింది. పూర్తిగా రొమాంటిక్ కామెడీగా సాగే అనోరాను అవార్డులు బాగానే వరించాయి. ఇదే సినిమాలో నటనకు గానూ మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకున్నారు.
ఉత్తమ నటుడిగా ది బ్రూటలిస్ట్ సినిమాకు గానూ అడ్రిన్ బ్రాడీ.. ఉత్తమ సహాయ నటుడుగా ఏ రియల్ పెయిన్ సినిమాకు కీరన్ కల్కిన్.. ఉత్తమ సినిమాటోగ్రఫీగా ది బ్రూటలిస్ట్ లాల్ క్రావ్లీ.. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కాన్ క్లేవ్ సినిమాకు లభించాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఎమిలియా పెరెజ్ సినిమాలోని ఎల్ మల్ సాంగ్‌కు వచ్చింది. అలాగే ఒరిజినల్ స్కోర్ ది బ్రూటలిస్ట్ సినిమాకు అందించిన డానియల్ బ్లంబర్గ్ సొంతం చేసుకున్నారు. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నో అదర్ ల్యాండ్ సినిమాకు ఆస్కార్ వచ్చింది. అలాగే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌గా ఐ యామ్ స్టిల్ హియర్ అనే సినిమా ఎంపికైంది. బెస్ట్ సౌండింగ్‌లో పాటు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో డ్యూన్ పార్ట్ 2 అవార్డులు సొంతం చేసుకుంది. బెస్ట్ యానిమేటెడ్ సినిమాగా ఫ్లో, బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌గా ఇన్ ది షాడో ఆఫ్ సైప్రెస్ సినిమాలు నిలిచాయి.