‘ఛావా’ టీం మాట తప్పిందా..? వందల కోట్లు చూసేసరికి ఒరిజినాలిటీ పోయిందా..?
ఛావా.. గత పది రోజులుగా ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే దాదాపు 600 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఛావా.. గత పది రోజులుగా ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే దాదాపు 600 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మహారాష్ట్ర యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంబాజీ మహారాజ్ జీవితం ఆధారంగా చావా సినిమా తెరకెక్కింది. ముందు నుంచి ఈ సినిమా మీద మహారాష్ట్రలో భారీ అంచనాలు ఉన్నాయి. అక్కడ కచ్చితంగా రికార్డులు తిరగరాస్తుందని అందరూ నమ్మారు.. అయితే రిలీజ్ తర్వాత సీన్ అంతా మారిపోయింది. కేవలం మహారాష్ట్ర మాత్రమే కాదు దేశం మొత్తం దండయాత్ర చేస్తున్నాడు శంభాజీ మహారాజ్. ఈయన దెబ్బకు కలెక్షన్లకు వర్షం కురుస్తుంది.
అయితే ఛావా విడుదలైన మొదటి రోజు నుంచి కూడా.. రీజనల్ లాంగ్వేజెస్ లో ఈ సినిమాని ఎందుకు విడుదల చేయలేదనే క్వశ్చన్ వినిపిస్తుంది. ప్యాన్ ఇండియన్ సినిమాకు ఉండాల్సిన అర్హతలు అన్నీ ఉన్నా కూడా.. ఎందుకు చావా సినిమాని కేవలం హిందీకి మాత్రమే పరిమితం చేశారు అంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే దానికి దర్శక నిర్మాతల నుంచి అనూహ్యమైన సమాధానం వచ్చింది. తాము మహారాష్ట్ర యోధుడి కథ చెబుతున్నాం కాబట్టి.. కేవలం తమ భాషలోనే ఆ వీరుడి కథ అందరూ తెలుసుకోవాలి అని.. అందుకే కమర్షియలిటీ గురించి ఆలోచించకుండా కేవలం హిందీలో మాత్రమే సినిమాను విడుదల చేశామని చెప్పారు. వాళ్ల నిజాయితీ చూసి ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.. కానీ ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేయబోతుంది.
మార్చి 7న ఛావా తెలుగు వర్షన్ విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తుంది. మరి అప్పుడు తమ భాష తమ ఒరిజినాలిటీ అని చెప్పిన మేకర్స్.. ఇప్పుడు ఎందుకు ఇలా మాట మార్చారు అనేది సోషల్ మీడియాలో జరుగుతుందని చర్చ. ధనం మూలం ఇదం జగత్ అంటే ఇదే. మంచి రేట్ వచ్చిందని సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తమిళం, మలయాళం మిగిలిన భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో ఒక పాజిటివ్ మాత్రం ఉంది. చావా సినిమాను నిజంగానే రీజినల్ లాంగ్వేజెస్ లో విడుదల చేస్తే చూడాలని చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే హిందీ అందరికీ రావాలని లేదు.. పైగా ఈ సినిమాలో మాట్లాడిన హిందీ అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. అందుకే ప్రాంతీయ భాషల్లోకి ఛావా వస్తే కచ్చితంగా ఇక్కడ కూడా వసూళ్ల వర్షం కురిపించడం ఖాయం.