Tollywood: సమ్మర్‌లో కనిపించని సినిమాల సందడి? థియేటర్లు ఖాళీ.. టాలీవుడ్‌లో ప్లానింగ్ మిస్సైందా?
ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ సినిమాలే రాలేదు. అన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. అందులోనూ రెండు సినిమాలే ఇప్పటివరకు హిట్టయ్యాయి. దీంతో సమ్మర్ ఇలా వేస్టైపోయిందని అటు ప్రేక్షకులు, ఇటు ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. టాలీవుడ్ ప్లానింగ్ మిస్సవ్వడం వల్లే ఇదంతా అని విమర్శిస్తున్నారు.
Tollywood: సంక్రాంతి తర్వాత సినిమాలకు అతిపెద్ద సీజన్ సమ్మర్. గతంలో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు సమ్మర్‌లోనే వచ్చేవి. బాహుబలి, ట్రిపులార్, కేజీఎఫ్ వంటి ఇండస్ట్రీ హిట్స్ వేసవిలో వచ్చినవే. సినిమాలకు మంచి టాక్ రావాలే కానీ ఈ సీజన్‌లో కలెక్షన్లు అదిరిపోతాయి. వేసవిలో విద్యార్థులకు సెలవులుంటాయి. పిల్లలంతా తమ సొంతూళ్లకు, బంధువుల ఇండ్లకు వెళ్లి సేదతీరుతుంటారు. ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా అలా ఓ వారం సెలవుపెట్టి గడిపేస్తుంటారు. ఇలాంటి టైంలో మంచి సినిమా వస్తే థియేటర్లో ఏసీలో కూర్చుని, కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. సినిమాలు బాగుంటే బ్రేక్ ఇవ్వడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అయితే, ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ సినిమాలే రాలేదు. అన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. అందులోనూ రెండు సినిమాలే ఇప్పటివరకు హిట్టయ్యాయి. దీంతో సమ్మర్ ఇలా వేస్టైపోయిందని అటు ప్రేక్షకులు, ఇటు ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. టాలీవుడ్ ప్లానింగ్ మిస్సవ్వడం వల్లే ఇదంతా అని విమర్శిస్తున్నారు.
మంచి సినిమాలేవి?
సమ్మర్‌లో మంచి సినిమాలు రావాలని ప్రేక్షకులే కోరుకుంటారు. గత ఏడాది వేసవిలో ట్రిపులార్, కేజీఎఫ్ వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. ఎఫ్3, సర్కారువారి పాట వంటి సినిమాల టాక్ యావరేజ్‌గా ఉన్నా కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. దీనికి కారణం సమ్మర్ కావడమే. అయితే, ఈసారి మాత్రం సమ్మర్ సినిమాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. మార్చి చివర్లో వచ్చిన దసరా మాత్రమే తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఏప్రిల్ 21న విడుదలైన విరూపాక్ష మూవీ ఒక్కటే బ్లాక్‌బస్టర్ అయింది. అయితే, మంచి అంచనాలతో వచ్చిన అనేక సినిమాలు ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేశాయి. రవితేజ హీరోగా వచ్చిన రావణాసుర, మీటర్, శాకుంతలం, ఏజెంట్, ఉగ్రం, రామబాణం, కస్టడీ వంటి సినిమాలన్నీ నిరాశపరిచాయి.
డబ్బింగ్ చిత్రాలు రుద్రుడు, విడుదల పార్ట్-1, పొన్నియన్ సెల్వన్-2 వంటి సినిమాల్ని కూడా ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ సమ్మర్‌లో వచ్చిన వాటిలో దసరా, విరూపాక్ష మాత్రమే విజయం సాధించాయి. ఇప్పటివరకు విడుదలైన సినిమాలతోపాటు రాబోయే సినిమాలు కూడా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలే. త్వరలో రాబోతున్న అన్నీ మంచి శకునములే, అహింస, నేను స్టూడెంట్ సార్, మళ్లీ పెళ్లి వంటి సినిమాలన్నీ చిన్న బడ్జెట్ సినిమాలే. కంటెంట్ బాగుంటేనే వీటిని ప్రేక్షకులకు ఆదరించే అవకాశం ఉంది. డబ్బింగ్ సినిమాల్లో బిచ్చగాడు-2 ఆసక్తికరంగా ఉంది. అలాగే ఫాస్ట్ ఎక్స్, ఏలియన్స్ 2042, స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్‌వెర్స్ వంటి డబ్బింగ్ సినిమాలు రాబోతున్నాయి. వీటిలో ఏ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.
టాలీవుడ్ ప్లానింగ్ మిస్
సమ్మర్‌లో పెద్ద సినిమాలు విడుదలైతేనే ఇండస్ట్రీకి మంచిది. సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిసేది ఈ సీజన్‌లోనే. ఇందుకు తగ్గట్లుగా రెండు వారాలకో పెద్ద సినిమా విడుదలైతే చాలు. కానీ, ఈ సీజన్‌లో ఒక్కటంటే.. ఒక్క పెద్ద సినిమా రాలేదు. గత ఏడాది చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేశ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు నటించిన చిత్రాలు విడుదలయ్యాయి. ఈసారి ఇలాంటి పెద్ద హీరోల సందడే లేదు. టాలీవుడ్‌లో ప్లానింగ్ మిస్సవడం వల్లే ఇలా జరిగింది. వచ్చే నెలలో ఆదిపురుష్ సినిమా రాబోతుంది. ఈ సినిమాను ఈ సమ్మర్‌లో విడుదల చేసి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయం. దర్శక, నిర్మాతలు ఈ సీజన్‌కు అనుగుణంగా సినిమాల విడుదల ప్లాన్ చేసుకోవాలి. దీనికి తగ్గట్లుగా ప్రీపోన్ లేదా పోస్ట్‌పోన్ చేసుకోవాలి. సమ్మర్ తర్వాత రాబోయేది వర్షాకాలం. స్కూళ్లు, కాలేజీలు స్టార్ట్ అవుతాయి. అంతా ఆ హడావుడిలోనే ఉంటారు. ఇలాంటి టైంలో పెద్ద సినిమాల విడుదల కొంచెం రిస్కే. అందుకే సమ్మర్‌లో పెద్ద సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకోవడం మంచిది.
థియేటర్లు ఖాళీ
ఈ సీజన్‌లో టాలీవుడ్‌లో రెండు సినిమాలు తప్ప మిగతా సినిమాలేవీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. బాలీవుడ్‌లో కూడా ఇదే పరిస్థితి. ది కేరళ స్టోరీ ఒక్కటే ప్రేక్షకులకు నచ్చింది. మిగతా సినిమాలేవీ పెద్దగా జనాల్ని ఆకట్టుకోలేదు. భోళా, కిసీ కా బాయ్ కిసీ కీ జాన్ వంటి పెద్ద సినిమాలు కూడా ఓ మోస్తరుగానే ఆడాయి. ఛత్రపతి మూవీకి కలెక్షన్లే లేవు. తెలుగులో, హిందీలో సరైన సినిమాలు రాకపోవడంతో థియేటర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. అనేక థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు నష్టాల్లో నడుస్తున్నాయి. సరైన సినిమాలు రాకపోతే థియేటర్లకు భారీ నష్టాలు తప్పవు.