Sankarabharanam : మూస పద్ధతికి శంకరాభరణం బ్రేక్ ..
టాలీవుడ్(Tollywood)లో ఇప్పటివరకు చాలా చిత్రాలు వచ్చాయి కానీ కొన్ని చిత్రాలు మాత్రమే క్లాసిక్‌గా మిగిలిపోయాయి.. అందులో ఒకటి 'శంకరాభరణం' (Shankarabharanam).. కళాతపస్వి విశ్వనాథ్ (Kalathapaswi Vishwanath ) దర్శకత్వంలో సంగీతం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా 44 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్(Tollywood)లో ఇప్పటివరకు చాలా చిత్రాలు వచ్చాయి కానీ కొన్ని చిత్రాలు మాత్రమే క్లాసిక్‌గా మిగిలిపోయాయి.. అందులో ఒకటి ‘శంకరాభరణం’ (Shankarabharanam).. కళాతపస్వి విశ్వనాథ్ (Kalathapaswi Vishwanath ) దర్శకత్వంలో సంగీతం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా 44 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి అపట్లో శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి ఈ చిత్రం మేలిమలుపు అయ్యింది. ఇక చెప్పాలంటే మాస్ కమర్షియల్ సినిమాలు స్వైర విహారం చేస్తున్న టైంలో, సంగీత సంప్రదాయమే ప్రధానంగా, ప్రాణంగా కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన.. ఈ చిత్రం మాస్ కలెక్షన్లతో, ఏళ్ళ తరబడి ఆడేసి, దుమ్ము లేపేసింది. అంతగా పేరులేని నటీనటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషంగా చెప్పుకోవాలి.
ఫిబ్రవరి 2, 1980లో రిలీజైన శంకరాభరణం తిరుగులేని రికార్డులను తెలుగు సినిమాచరిత్రకి బహుమతిగా తీసుకొచ్చి, ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది. ఎన్ని దేశీయ అవార్డులు, మరెన్ని అంతర్జాతీయ అవార్డులు.. కళ్ళు తిరిగిపోయే రేంజ్ లో శంకరాభరణం చరిత్రని తిరగరాసింది. అయితే ముందుగా శంకరశాస్త్రి పాత్రకి అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషణ్ వంటి వారిని అనుకున్నారట దర్శకుడు విశ్వనాథ్. ఆ తరువాత కృష్ణంరాజుకు కథను వినిపించారట. అయితే ఆ పాత్ర తనకు కొత్తని, దాన్ని ప్రేక్షకులు అంగీకరించకపోతే దాని ప్రయోజనం దెబ్బతింటుందని కృష్ణంరాజు తిరస్కరించారట.. చివరగా ఇమేజ్ ఉన్న నటులు ఈ పాత్రను చేస్తే పండదని అలోచించి ఎలాంటి ఇమేజ్ లేని జేవీ సోమయాజులతో ఈ పాత్రని వేయించారు విశ్వనాథ్.. ఆ సమయంలో ఆయన డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఇక తులసి పాత్రకి అప్పటికే వ్యాంప్ పాత్రలతో ఫేమస్ అయిన మంజుభార్గవిని ఎంపిక చేశారు విశ్వనాథ్.. ఈ చిత్రాన్ని పదమూడున్నర లక్షల రూపాయలతో 60 రోజుల్లో పూర్తిచేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో స్టార్ హీరో కానీ ఓ నటుడుతో, వ్యాంప్ పాత్రలు చేసిన మంజుభార్గవితో, సంగీత ప్రధానమైన కథతో విశ్వనాథ్ పెద్ద సాహసాన్ని చేస్తున్నారని మురళిమోహన్ లాంటి హీరోలు అనుకున్నారట. 1980 ఫిబ్రవరి 2న రిలీజైన ఈ సినిమాకి ముందుగా ప్రేక్షకులే లేరు కానీ నెమ్మదిగా జనం రావడం మొదలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.. ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు చెప్పులు బయటే విడిచి సినిమా హాల్ లోకి వచ్చారట.
మొదటి వారం తర్వాత నా సామిరంగా.. టిక్కెట్లు దొరికితే ఒట్టు. ధియేటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. జనం ఏదో మైకంలో పడిపోయారు. ప్రేక్షకులు సినిమాని ధియేటర్లనుంచి తీయనివ్వలేదు. అలా కలెక్షన్ల ప్రభంజనం ఊరూరా.. ఏ సెంటర్ లేదు, బి సెంటర్ లేదు, సి సెంటర్ లేదు.. ఒకటే పిచ్చి.. ఒకటే మత్తు శంకరాభరణం అంటే. ఇక ఈ సినిమాకి గాను తొలిసారిగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే శాస్త్రీయ సంగీతమైన పాటలు పాడడం నా వల్ల కాదు బాబోయ్ అని బాలు తప్పించుకుందామని చూసిన విశ్వానాథ్ పట్టుబట్టి ఆయనచేతే పాటించారు. అవి ఎంత హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని దాదాపుగా అన్ని పాటలు ఆయనే పాడడం విశేషం.
శంకరాభరణం సినిమాతో ఏ పాటల పోటీలోనైనా ఆ పాటలే. ఇప్పటికీ అందరూ పాడుకునే పాటలవే. ఆ డైలాగులు కూడా కంఠస్థ పట్టేశారు అందరూ. పాశ్చాత్య సంగీత పెనుతుఫానులో రెపరెపలాడుతున్న సత్ సంప్రదాయపు సంగీతజ్యోతిని.. అనే శంకరశాస్త్రి డైలాగు అవపోసన పట్టేశారు. కొత్త సంగీత శిక్షణాలయాలు ఊరూరా, వాడవాడలా. ప్రత్యక్షమయ్యాయి. అప్పటివరకూ ఈగలు తోలుకుంటున్న సంగీతం మాస్టార్లకి భారీగా బేరాలొచ్చాయి. పిల్లల్ని సంగీతంలో పడేశారు పెద్దలు. మా పిల్లలు శంకరాభరణం పాటలు బాగా పాడతారు అని తలిదండ్రలు చెప్పుకునేంత సోషల్ స్టేటస్ని శంకరాభరణం పాటలు తీసుకొచ్చాయి.
కేవీ మహదేవన్ (KV Mahadevan) సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఆయనకి కూడా జాతీయ అవార్డు లభించింది. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా జనంపై ఎంత ప్రభావం చూపించిందో.. ఇక ఈ సినిమాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది జంధ్యాల మాటలు, వేటూరి పాటలు.. ఒక్కో మాట, పాట అద్భుతమే. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాల్లో భాగంగా శంకరాభరణం సినిమా గురించి ఏకంగా మూడు రోజులు విశ్లేషించారంటే అంతటి మహా మహుల్ని కూడా ఎంతగానో అలరించింది ఈ చిత్రం. అందుకే ఎన్ని ఏళ్లు గడిచినా శంకరాభరణం గురించి ఎంత చెప్పినా తక్కువే అని భావిస్తారు సినీ ప్రేక్షకులు. ఇక శంకరాభరణం చిత్రం రాసిన చరిత్రను మరే చిత్రం రాయలేకపోయింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ శంకరాభరణం సినిమా తెలుగువాళ్ళకి గర్వకారణమే. శంకరాభరణం లాంటి సినిమాని నిర్మించిన పూర్ణోదయ సంస్థ కూడా తలమానికమే. ఆవకాయ, గోంగూరు, గోదావరి.. శంకరాభరణం. ఎప్పటికి బోరు కొట్టదు.. 44 ఏళ్ళు గడిచినా ఇంకా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది .కాలం మారుతుంటుంది కాని ఇది మాత్రం కలకాలం నిలిచి ఉండే సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.