Nisha Noor: రంగుల జీవితం వెనుక వెలుగు నీడలు.. కన్నీళ్లు తెప్పించే హీరోయిన్ గాథ..
ఒకప్పటి హీరోయిన్ నిషా నూర్ మరో ఉదాహరణ. ఒకప్పుడు బహుభాషా నటిగా పేరు తెచ్చుకుని, స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన నిషా.. చివరకు అనాథగా, అథ్వాన స్థితిలో మరణించింది. ఆమె జీవితం వర్ధమాన తారలకు ఒక పాఠం.
Nisha Noor: సినిమా అంటే రంగుల ప్రపంచమే కాదు.. మాయా ప్రపంచం కూడా. సినిమా అవకాశాలు, స్టార్‌డమ్, డబ్బు నటుల్ని మాయలో ముంచెత్తుతాయి. అయితే, ఈ మాయలోంచి ఏదో ఒక రోజు కాలం బయటపడేస్తుంది. అప్పుడు ప్రపంచం అసలు రంగు తెలుస్తుంది. ఈ లోపు ఎవరైనా జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకుంటే పర్లేదు. లేదూ.. ఆ మాయలోనే ఉండిపోతే మాత్రం జీవితం కష్టాలు, కన్నీళ్ల మయమే. అందరిచేతా మావాళ్లు అనిపించుకున్న వాళ్లు కూడా అనాథగా మిగలాల్సి వస్తుంది. అందుకు సినీ రంగంలో ఎందరో ఉదాహరణగా నిలిచారు. ఒకప్పటి హీరోయిన్ నిషా నూర్ మరో ఉదాహరణ. ఒకప్పుడు బహుభాషా నటిగా పేరు తెచ్చుకుని, స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన నిషా.. చివరకు అనాథగా, అథ్వాన స్థితిలో మరణించింది. ఆమె జీవితం వర్ధమాన తారలకు ఒక పాఠం.
ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తులో నిలబెట్టి.. అంతే వేగంగా నేలకూల్చగల శక్తి సినిమా రంగానికి ఉంది. ఓవర్‌నైట్ స్టార్స్ అయ్యి.. నిర్మాతలు ఇంటిదగ్గర క్యూ కట్టే స్టేజ్ నుంచి.. ఒక్క అవకాశం కోసం డోర్ వైపు ఎదురుచూస్తూ బతికేలా చేయగలదు ఫిలిం ఇండస్ట్రీ. తమిళనటి నిషా నూర్ పరిస్థితి ఇలాంటిదే. 1980లలో నిషా నూర్ తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అగ్రహీరోలైన రజినీ కాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, రాజేంద్ర ప్రసాద్, భాను చందర్ వంటి స్టార్స్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కమల్‌తో టిక్ టిక్ టిక్, రజినీతో శ్రీ రాఘవేంద్ర, మోహన్ లాల్‌తో దేవాసురం, రాజేంద్ర ప్రసాద్‌తో ఇనిమై ఇదో ఇదో (తమిళ్) వంటి సినిమాలు చేసింది. అందం, నటనతో ఆకట్టుకుంది. 1980 నుంచి 1995 వరకు సినిమాల్లో నటించింది. ఈ సమయంలో ఏదో ఒక పరిశ్రమ నుంచి అవకాశం వస్తూనే ఉంది. దీంతో కెరీర్ సాఫీగా సాగిపోయింది. అయితే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ స్టార్‌డమ్ నెమ్మదిగా కరిగిపోయింది.
అవకాశాలు లేక
1990 తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఎలాగోలా 1995 వరకు అవకాశాలు వచ్చినా.. ఆ తర్వాత ఉన్నట్లుండి అవకాశాలు కరువయ్యాయి. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చేసిన తనకు చివరకు చిన్న సినిమాల నుంచి కూడా ఛాన్స్‌లు కరువయ్యాయి. ఒక్క ఛాన్స్ వస్తుందేమో అని ఎంత ఎదురుచూసినా అవకాశాలు మాత్రం రాలేదు. అప్పటివరకు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఎలాగోలా నెట్టుకువచ్చిన నిషా.. 1995 తర్వాత నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా ఛాన్స్‌లు రాకపోవడంతో ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చింది. అప్పటికే ఆమె సంపాదించిందంతా కరిగిపోయింది. ఇక బతకడానికి ఏదో ఒక పని చేయాలిగా..! అందుకే ఆమె ఒక మార్గాన్ని ఎంచుకుంది. కాకపోతే అది తప్పుడు మార్గం. అదే నిషా జీవితాన్ని నాశనం చేసింది.
నిర్మాత బలవంతంపై వ్యభిచారంలోకి
డబ్బు సంపాదన విషయంలో నిషా నూర్‌కు కనిపించిన సులభమైన మార్గం వ్యభిచారం. ఒక నిర్మాత బలవంతం వల్ల, తప్పనిసరి పరిస్థితుల్లో సంపాదన కోసం నిషా నూర్ వ్యభిచారంలోకి దిగాల్సి వచ్చింది. వ్యభిచారం వల్ల కొంతకాలం ఆమె జీవితం సాగింది. అయితే, ఎంతోకాలం ఇది సాగదు కదా. వయసు పైబడటం, ఇతర కారణాల వల్ల కొన్నేళ్ల తర్వాత ఆమెకు ఈ దారి కూడా మూసుకుపోయింది. దీంతో మళ్లీ ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఆదాయం లేదు. సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సహకారం దక్కలేదు. ఆమెను పట్టించుకునే వాళ్లే లేకపోయారు. దీంతో ఆర్థిక కష్టాలతో అత్యంత పేదరికాన్ని అనుభవించింది. ఇదే సమయంలో ఆమెకు ఎయిడ్స్ సోకినట్లు తేలింది. దీంతో తీవ్ర అనారోగ్యం పాలవ్వాల్సి వచ్చింది.
అనాథలా కన్నుమూసిన నిషా
తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడం, ఎలాంటి ఆదాయం లేకపోవడం, ఆదరించే వాళ్లు కూడా లేకపోవడంతో నిషా ఒక అనాథలా మిగిలింది. చివరి దశలో అత్యంత దారిద్ర్యాన్ని అనుభవించింది. చివరకు ఉండటానికి చోటు కూడా లేని స్థితికి చేరుకుంది. ఆహారం లేక, మందులు లేక బక్కచిక్కిపోయింది. ఒకప్పుడు అందంగా, ఎందరికో ఆరాధ్య దేవతలా కనిపించిన నిషా.. చివరి రోజుల్లో అనాథలా, ఎముకల గూడులా మారిపోయింది. గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంది. కదల్లేని స్థితిలో ఒంటరిగా ఒక దర్గా దగ్గర నిద్రించేది. ఆమెను గుర్తించిన ఒక స్వచ్ఛంద సంస్థ సాయమందించేందుకు ముందుకొచ్చింది. బక్కచిక్కిపోయిన ఉన్న నిషాకు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమెకు ఎయిడ్స్ ఉన్నట్లు, చివరి దశకు చేరుకున్నట్లు గుర్తించారు. ఆమెను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు అనారోగ్యంతో పోరాడుతూ 2007లో ఒక అనాథగా కన్నుమూసింది. నా అనేవాళ్లే లేకుండా 44 ఏళ్ల వయసులో మరణించింది.
వర్ధమాన తారలకు గుణపాఠం
స్టార్ హీరోయిన్‌గా వెలిగిన నిషా నూర్.. అనాథలా, నడి వయస్సులోనే మరణించడం తీవ్ర విషాదకరం. ఆమె జీవితం పరిశ్రమలోని ఎందరికో ఒక గుణపాఠం. ముఖ్యంగా వర్ధమాన హీరోయిన్స్‌కు నిషా గాథ ఒక ఉదాహరణ. పరిశ్రమలో అవకాశాలున్నప్పుడే ఆర్థిక అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. రంగుల ప్రపంచాన్ని చూసే అదే జీవితం అనుకోకూడదు. స్టార్‌డమ్ పోయినప్పుడు, అవకాశాలు తగ్గినప్పుడు కూడా ఎలా బతకాలో ముందుగానే ఆలోచించుకోవాలి. ఈ పేరు, డబ్బు ఎప్పటికీ ఉండవని తెలుసుకోవాలి. అవకాశాలు లేని రోజు వక్రమార్గాన్ని అనుసరించకుండా, సరైన మార్గంలో వెళ్తే అందరిలా సాధారణ జీవితాన్ని కూడా గడిపే అవకాశం ఉంటుంది. అంతేకానీ.. అవకాశాల కోసం అడ్డదారులు తొక్కితే చివరకు నిషాలా అనాథలా మిగలాల్సి రావొచ్చు. ఆమె గాథ సినీ పరిశ్రమ అసలు రూపాన్ని కూడా చూపించింది. ఒకప్పుడు ఆమెతో కలిసి నటించిన స్టార్స్ ఎవరూ ఆమెకు సాయం చేయలేకపోవడం పరిశ్రమ వైఖరికి నిదర్శనం. తోటి నటికి సాయం చేయడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. అందుకే ఇక్కడి బంధాలు, అనుబంధాలు అన్నీ కృత్రిమమే అంటుంటారు కొందరు సీనియర్ నటులు.