చిరంజీవి తప్పు లేదు.. చేసిందంతా నేనే.. టైమ్ రావాలి కదా అంటున్న వెంకీ..!

చిరంజీవితో సినిమా చేయాలనేది ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడి కల. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్ దర్శకులు చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2025 | 11:55 AMLast Updated on: Mar 26, 2025 | 11:55 AM

Venky Says Chiranjeevi Is Not At Fault I Did Everything Time Will Come

చిరంజీవితో సినిమా చేయాలనేది ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడి కల. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్ దర్శకులు చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోతున్నారు. మరోవైపు మెగాస్టార్ కూడా కుర్ర దర్శకులతో పనిచేయడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటి దర్శకులతో పని చేస్తే తాను కూడా అప్డేట్ అవుతాను అనేది చిరంజీవి ఆలోచన. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువగా యంగ్ డైరెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్నాడు మెగాస్టార్. తన ఇమేజ్ కు సరిపోయేలా వాళ్లు ఏ కథ తీసుకొచ్చినా కూడా.. దానికి తన అనుభవం జోడించి ప్రాజెక్టు వర్కవుట్ అయ్యేలా చూస్తున్నాడు. అయితే ఎంత ట్రై చేసినా కూడా కొన్నిసార్లు కొన్ని సినిమాలు వర్కవుట్ అవ్వవు. అనౌన్స్మెంట్ వరకు వచ్చి ఆగిపోతాయి అంతే. ఈ మధ్య చిరంజీవి కెరీర్ లో అలా ఆగిపోయిన సినిమా ఒకటి ఉంది. చలో, భీష్మ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత చిరంజీవితో సినిమా చేయడానికి దర్శకుడు వెంకీ కుడుముల ఒక కథ చెప్పి ఒప్పించాడు.

దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తానని కూడా చెప్పాడు. ఇంకా కొన్ని రోజుల్లో సినిమా మొదలవుతుంది అనగా.. అనుకోకుండా ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. కథ నచ్చకపోవడంతో వెంకీ కుడుముల సినిమాను తీసి పక్కన పెట్టాడు చిరంజీవి. దీని మీద వెంకీ కూడా ఎప్పుడు ఓపెన్ అవలేదు. సినిమా సెట్ అవ్వలేదు అని వదిలేసాడు. మరోసారి నితిన్ హీరోగా రాబిన్ హుడ్ సినిమా చేశాడు. ఈ సినిమా మార్చి 28న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి సినిమా గురించి కూడా ఓపెన్ అయ్యాడు వెంకీ. ఆ సినిమా ఆగిపోవడంలో మెగాస్టార్ తప్పులేదని.. తప్పు ఏదైనా ఉంటే అది పూర్తిగా నాది అంటూ చెప్పకొచ్చాడు. తనకు చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే చాలా ఇష్టమని.. ఆయనను ఎలా చూడాలి అనుకుంటున్నాను అలాంటి కథ ఒకటి సిద్ధం చేసి ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేశాను అన్నాడు వెంకీ. ఐడియా చెప్పగానే ఆయనకు కూడా బాగా నచ్చిందని.. కాకపోతే పూర్తి కథ సిద్ధం చేసిన తర్వాత ఎందుకో అది చిరంజీవికి సెట్ కాదు అని తనకే అనిపించింది అన్నాడు వెంకీ.

అలాగే కథ విన్న తర్వాత మెగాస్టార్ నుంచి కూడా కాస్త అసంతృప్తి రావడంతో ఆ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశానని చెప్పాడు వెంకీ కుడుముల. నిజానికి అదే కథ మీద తనను వర్క్ చేయాలని చిరంజీవి కోరాడని.. కాకపోతే చిరంజీవితో సినిమా చేస్తే ది బెస్ట్ ఇవ్వాలి అని అనుకున్నాను కాబట్టే అది తీసి పక్కన పెట్టేసాను అని చెప్పాడు వెంకీ. ఈరోజు కాకపోతే రేపు చిరుతో ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలి అనేది తన డ్రీమ్ అంటున్నాడు ఈయన. అంతేకానీ అవకాశం వచ్చింది కదా అని ఏది పడితే అది తీసి.. అనవసరంగా వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవాలని అనుకోవడం లేదని చాలా జెన్యూన్ గా చెప్పాడు వెంకీ కుడుముల. ఇప్పుడు మిస్ అయి ఉండొచ్చు.. కానీ ఏదో ఒక రోజు చిరంజీవి ఇమేజ్ కు సరిపోయే కథ రాసుకొని వెళ్లి ఆయనతో సినిమా తీయడమే తన ధ్యేయమంటున్నాడు ఈ దర్శకుడు. రేపు రాబిన్ హుడ్ హిట్ అయితే కచ్చితంగా మెగా కాంపౌండ్ నుంచి కాల్ రావచ్చేమో..! ఎందుకంటే హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈ లెక్కన అప్పుడు మిస్ అయిన ఛాన్స్ మరోసారి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న చిరు.. తర్వాత అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకులను లైన్ లో పెట్టాడు. ఇక మీద ఆరు నెలలకు ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాడు మెగాస్టార్. అందుకే నచ్చిన కథల కోసం వేచి చూస్తూనే ఉన్నాడు ఈయన.