Oscar War: ఆస్కార్‌పై బీజేపీ, బీఆర్ఎస్ యుద్ధం
అందులో భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ సినిమాలో తలకు టోపీ పెట్టుకొని కనిపించాడు. అది చూసిన బండి సంజయ్... నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కుమ్రం భీంకు టోపీ పెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు.
విషయం ఏదైనా వివాదం కావాల్సిందే అన్నట్లుగా ఉంది తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సీన్ ! తూటాలకు మించి వేగంతో పేలుతున్నాయ్ మాటలు రెండు పార్టీల మధ్య ! ట్రిపుల్ఆర్‌కు ఆస్కార్ వ్యవహారం కూడా రెండు పార్టీల మధ్య మంటలు రేపుతోంది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు.. జక్కన్న అండ్ టీమ్‌ను అభినందిస్తున్నారు. ఐతే ఇప్పుడీ ఆస్కార్ వ్యవహారమే.. కారు పార్టీకి ఆయుధంగా మారింది.
ట్రిపుల్ ఆర్ విజయాన్ని మోడీ ఖాతాలో వేసుకుంటారేమో అంటూ.. బండి సంజయ్ టార్గెట్‌గా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మోడీ వల్లే ఆస్కార్ వచ్చిందని ప్రచారం చేస్తారేమే అంటూ సెటైర్లు వేశారు. ట్రిపుల్ఆర్ టీజర్ రిలీజ్ అయిన టైమ్‌లో.. బండి సంజయ్ కామెంట్లు దుమారం రేపాయ్. కుమ్రం భీం జయంతి సందర్భంగా అప్పట్లో టీజర్ విడుదల చేయగా.. అందులో భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ సినిమాలో తలకు టోపీ పెట్టుకొని కనిపించాడు. అది చూసిన బండి సంజయ్… నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కుమ్రం భీంకు టోపీ పెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు. రాజమౌళికి నిజంగా దమ్ము, ధైర్యముంటే నిజాం రజాకార్లకు బొట్లు పెట్టి సినిమా తీయాలని సవాల్ విసిరారు. ఐతే ఆ విషయాన్ని ఇప్పుడు బయటకు తీస్తున్న బీఆర్ఎస్ నేతలు.. బండి సంజయ్ టార్గెట్‌గా సెటైర్లు వేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ యుద్ధం మరింత ముదిరింది.