మమ్ముట్టికి ఏమైంది.. మెగాస్టార్ ఆరోగ్యం క్షీణించిందా..? అసలు నిజమెంత..?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఈ మధ్య తెలుగులో కూడా వరుసగా నటిస్తూనే ఉన్నాడు. యాత్ర సినిమాతో మన ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు మమ్ముట్టి.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి తెలుగులో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఈ మధ్య తెలుగులో కూడా వరుసగా నటిస్తూనే ఉన్నాడు. యాత్ర సినిమాతో మన ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు మమ్ముట్టి. అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమాలో కూడా కీలక పాత్ర చేసాడు మమ్ముట్టి. అయినా ఇంత పెద్ద లెజెండరీ యాక్టర్లకు భాషతో పని ఉండదు.. అన్ని ఇండస్ట్రీలలో వాళ్లకు అభిమానులు ఉంటారు. వాళ్లకి ఏమైనా జరిగిందని తెలిస్తే ఫ్యాన్స్ విలవిలలాడి పోతారు. తాజాగా మమ్ముట్టి ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు విన్న తర్వాత అతని ఫాన్స్ కంగారుపడుతున్నారు. కొన్ని రోజులుగా మమ్ముట్టి ఆరోగ్యం అసలు బాగోలేదని.. ఆయన క్యాన్సర్ బారిన పడ్డాడు అంటూ ప్రచారం జరుగుతుంది. దానికి తోడు మొన్నామధ్య మోహన్ లాల్ శబరి వెళ్లి లోపల గర్భగుడిలో అయ్యప్ప స్వామికి మమ్ముట్టి పేరుమీద ప్రత్యేకమైన పూజలు చేయించాడు. ఇది తెలిసిన అయ్యప్ప భక్తులు కొందరు మోహన్ లాల్ పై మండిపడ్డారు. ఒక ముస్లింకు అయ్యప్ప దగ్గరికి వెళ్లి ఎలా మీరు పూజలు చేయిస్తారు అంటూ నిలదీశారు. దానికి ఆయన సున్నితంగా స్పందించారు. ఈ విషయంలో ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి కానీ దేవుడి ముందు అందరూ ఒకటే అని చెప్పాడు.
అంతేకాదు మమ్ముట్టి ఆరోగ్యం గురించి కూడా ఓపెన్ అయ్యాడు మోహన్ లాల్. లూసిఫర్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మమ్ముట్టి ఆరోగ్యం గురించి పదేపదే మోహన్ లాల్ ను అడుగుతున్నారు మీడియా వాళ్ళు. దానికి ఆయన చాలా ఓపికగా సమాధానం చెప్పారు. మమ్ముట్టికి ఉన్న సమస్య చాలా చిన్నదని.. సోషల్ మీడియాలో ఉన్నవి లేనివి పెట్టి అనవసరంగా ఆ సమస్యను పెద్దది చేయొద్దు అంటూ ఆయన కోరుకున్నాడు. త్వరలోనే ఆయన పూర్తి స్థాయిలో కోలుకుంటాడని.. మళ్లీ వరుస సినిమాలు చేసే అభిమానుల ముందుకు వస్తాడు అని చెప్పాడు మోహన్ లాల్. మమ్ముట్టి ఆరోగ్యం గురించి అభిమానులు అస్సలు కంగారు పడాల్సిన పని లేదు అంటూ హామీ ఇచ్చాడు ఈ సీనియర్ హీరో. మోహన్ లాల్ చెప్పిన తర్వాత మమ్ముట్టి ఫ్యాన్స్ లో కంగారు కాస్త తగ్గింది. అంతా బాగానే ఉన్నప్పుడు ఎందుకు డాక్టర్స్ హెల్త్ బులిటన్స్ విడుదల చేయట్లేదు అంటూ కొంతమంది అడుగుతున్నారు.. అయితే మమ్ముట్టి ఆరోగ్య విషయంలో అంత సీరియస్ నెస్ లేదని.. వయసు రీత్యా వచ్చే సమస్యలతోనే ఆయన బాధపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు.
మమ్ముట్టి వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన చాలా ఫిట్ గా ఉన్నాడు. అంతేకాదు వరుస సినిమాలు కూడా చేస్తూనే ఉన్నాడు. బహుశా ఈ స్ట్రెస్ వల్ల ఆయనకు కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకానీ మమ్ముట్టి ఆరోగ్యం బాగుందని.. ఈ విషయంలో అభిమానులు కంగారు పడాల్సిన పని లేదు అంటూ మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు ఆయన కుటుంబ సభ్యులు కూడా. ప్రస్తుతం మలయాళం లో మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయ్యాడు మమ్ముట్టి. ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తాను అంటే దర్శక నిర్మాతలకు ఆయన మాట ఇచ్చాడు. మొత్తానికి తమ మెగాస్టార్ ఆరోగ్యంగానే ఉన్నాడు అని తెలిసిన తర్వాత గాని మమ్ముట్టి ఫ్యాన్స్ కుదుటపడలేదు.