నితిన్ సమస్య ఏంటి.. కెరీర్ ఇంత దారుణంగా మునిగిపోతుంటే ఆయన ఏం చేస్తున్నాడు..?
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో నితిన్ కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలామంది హీరోలకు సాధ్యం కాని రికార్డులు ఈయన సొంతమయ్యాయి.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో నితిన్ కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలామంది హీరోలకు సాధ్యం కాని రికార్డులు ఈయన సొంతమయ్యాయి. ఈ జనరేషన్ హీరోలు కలలు తన ఎంతోమంది దర్శకులతో ఆయన సినిమాలు చేశాడు. రాజమౌళి, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, వినాయక్, రాఘవేంద్రరావు.. ఇలా ఎంతోమంది లెజెండరీ దర్శకులతో పనిచేశాడు నితిన్. ఇంతమంది దర్శకులతో సినిమాలు చేసినా.. 30 సినిమాలకు పైగా నటించినా.. 23 సంవత్సరాల కెరీర్లో నితిన్ సాధించింది ఏంటి అంటే చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేదు. కెరీర్ మొదట్లో వచ్చిన రెండు మూడు విజయాలు.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో మరో రెండు హిట్లు.. ఇవి కాకుండా నితిన్ ఏం చేశాడు అంటే సమాధానం చెప్పడానికి కూడా ఆయన అభిమానులు సంకోచిస్తారు. అసలు నితిన్ లాంటి హీరోకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది..? కథల విషయంలో అసలు జాగ్రత్త తీసుకోవడం లేదా లేదంటే దర్శకులు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు కదా అని ఏది పడితే అది చేస్తున్నాడో అర్థం కావడం లేదు.
ఒక సినిమా అంటే ఏదో అనుకోవచ్చు వరుసగా ఇన్ని ప్లాపులు వస్తున్నాయంటే సమస్య కచ్చితంగా నితిన్ లోనే ఉంది అని అర్థమవుతుంది. కథకు కాకుండా కేవలం కాంబినేషన్ వైపు నితిన్ అడుగులు పడుతున్నాయేమో అనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే అసలు కథలు వినే చేస్తున్నాడా లేదంటే కేవలం రెమ్యూనరేషన్ కోసమే సినిమాలు చేస్తున్నాడా అనిపిస్తుంది. తాజాగా విడుదలైన రాబిన్ హుడ్ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ రావట్లేదు. ఫస్ట్ వీకెండ్ అయిపోయిన తర్వాత ఈ సినిమాకు కనీసం 10 కోట్ల షేర్ కూడా రాలేదు అంటే పరిస్థితి అర్థం అవుతుంది. దీనికి ముందు వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ పరిస్థితి కూడా ఇంతే. మాచర్ల నియోజకవర్గం సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీనికి కనీసం 5 కోట్ల షేర్ కూడా రాలేదు. దానికి ముందు మాస్ట్రో, రంగ్ దే లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. గత ఐదేళ్లలో కేవలం భీష్మ మాత్రమే బాగా ఆడింది. దానికి ముందు మళ్ళీ నాలుగైదు ఫ్లాపులు ఉన్నాయి. త్రివిక్రమ్ పుణ్యమా అని అ.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. కెరీర్ మొదట్లో జయం, దిల్, సై.. ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయిందే, హార్ట్ ఎటాక్, అ.. ఆ, భీష్మ.. ఈ ఆరు తప్పిస్తే నితిన్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ మరొకటి లేదు.
30 సినిమాలకు పైగా నటించిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక నటుడు.. ఇలాంటి చెత్త కథలకు ఎలా ఓకే చెప్తున్నాడు అంటూ ఆయన అభిమానులు కూడా హర్ట్ అవుతున్నారు. కావాలంటే గ్యాప్ తీసుకోండి కానీ ఇలాంటి పిచ్చి సినిమాలు మాత్రం చేయొద్దు అని కోరుతున్నారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేస్తున్నాడు నితిన్. దీని తర్వాత బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ.. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్నాడు. ఈ రెండు ఖచ్చితంగా విషయం ఉన్న సినిమాలే. ఇవి ఆడితే నితిన్ కెరీర్ కచ్చితంగా నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈయన నుంచి ఒక మంచి సినిమా వస్తే చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు నితిన్. కనీసం ఇకపై అయినా కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు ఆయన ఫ్యాన్స్. మరి దీని నితిన్ ఎంతవరకు తీసుకుంటాడు అనేది చూడాలి.