ఒకవైపు సీనియర్ హీరోలు వరుస సినిమాలతో సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత కూడా బిజీ బిజీగా గడుపుతుంటే అక్కినేని నాగార్జున మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బుల్లితెరకు అలవాటు పడిన ఆయన సినిమాలను ఇష్టపడటం లేదు. గత 15 ఏళ్ళ నుంచి నాగార్జున కెరీర్ లో సరైన హిట్ లేదు. ఏదో ఫార్మాలిటీ కోసం సినిమాలు చేయడం, అవి ఫ్లాప్ కావడం మినహా పెద్దగా రాణించింది లేదు. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు. వయసు అడ్డం కాదు అంటూ దూసుకుపోతున్నారు. కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆయన. ఇక బాలకృష్ణ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా చేసి అఖండ సినిమా తర్వాతి నుంచి హిట్ ట్రాక్ లోకి వచ్చారు. వెంకటేష్ సంగతి తెలిసిందే. సైలెంట్ గా సినిమాలు చేయడం... ఆ సినిమా రిజల్ట్ చూడకుండా మరో సినిమా లైన్ లో పెట్టడం చేస్తున్నారు. కాని నాగార్జున మాత్రం సినిమాలను అసలు ఇష్టపడటం లేదనే టాక్ వినపడుతోంది. కేవలం ఆయన బుల్లితెరపై మాత్రమే మెరుస్తున్నారు. బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 8 లో నాగార్జ్జున బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ టైటిల్ సాంగ్ ను కూడా విడుదల చేసారు. ఇక అది తప్పించి ఫ్రెష్ గా నాగార్జున ఎక్కడా కనపడింది లేదు. వ్యాపారాల్లో చాలా బిజీగా ఉండే ఈ అక్కినేని హీరో... ఫిట్నెస్ పరంగా ఇతర హీరోలతో పోలిస్తే ముందు వరుసలో ఉంటాడు. అయినా సరే సినిమాల మీద ఆసక్తి చూపకపోవడం ఫ్యాన్స్ ని నిరాశకి గురి చేస్తుంది. నా సామి రంగా సినిమా తర్వాత అసలు సినిమాకు సైన్ చేయలేదు. ఆయనతో సినిమా చేసేందుకు కూడా దర్శకులు సిద్దంగా లేరనే అర్ధమవుతోంది. నిర్మాతలు కూడా పెద్దగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం లేదు. ఆయనకు ఉండే ఆడియన్ ఫాలోయింగ్ కూడా బాగా తగ్గిపోయింది. నాగార్జున సినిమాల కంటే చిన్న హీరోల సినిమాలకే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుకేనేమో నాగార్జున కూడా సినిమాలను లైట్ తీసుకున్నారని టాక్ వినపడుతోంది. ఇప్పుడున్న పోటీలో ఎంత ఇమేజ్ ఉన్న హీరోకి అయినా హిట్ పడాల్సిందే. అందుకే మహేష్ బాబు లాంటి హీరో కూడా నానా అవస్థలు పడుతున్నారు. గత కొన్నాళ్ళుగా ఆశించిన స్థాయిలో తన సినిమాలు లేకపోవడంతో మహేష్ బాబు... ఇప్పుడు రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసి ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. అలాంటి హీరోనే తిప్పలు పడుతుంటే అక్కినేని నాగార్జున మాత్రం సైలెంట్ గా ఉండటం కచ్చితంగా సినిమాలకు గుడ్ బై చెప్పినట్టే అనే టాక్ వస్తోంది. ఇప్పటికే నాగార్జునను ఒకప్పటి హీరో అని భావిస్తున్న ప్రేక్షకులు... ఆయన సినిమాలు చేయకపోతే బుల్లి తెర యాంకర్ గా గుర్తించే పరిస్థితి ఉంటుంది. నాగార్జున ఇమేజ్ కి ఒక మంచి హిట్ కొట్టి ఫాం లోకి రావాలని కోరుతున్నారు అక్కినేని ఫ్యాన్స్.