కాశ్మీర్ లో ఇకపై సినిమా షూటింగ్స్ జరగవా.. టెర్రర్ అటాక్స్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది..?
ఇండియాలో ఉన్న అత్యంత సుందరమైన ప్రదేశాల్లో జమ్మూ కాశ్మీర్ కూడా ఒకటి. అక్కడ ఉన్నన్ని అద్భుతమైన ప్రదేశాలు ఇంకా ఎక్కడ కనిపించవు.

ఇండియాలో ఉన్న అత్యంత సుందరమైన ప్రదేశాల్లో జమ్మూ కాశ్మీర్ కూడా ఒకటి. అక్కడ ఉన్నన్ని అద్భుతమైన ప్రదేశాలు ఇంకా ఎక్కడ కనిపించవు. అందుకే దాన్ని స్వర్గమంటారు. అలాంటి అందమైన ప్రదేశాలు ఉన్న ప్లేసులో సినిమా షూటింగ్స్ కూడా బాగానే జరుగుతాయి కదా. ఒకప్పుడు కాశ్మీర్లో ఎన్నో సినిమాలు షూటింగ్స్ జరిగేవి. పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన తెలుగు సినిమాల షూటింగ్స్ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రదేశాల్లో షూటింగ్ చేసుకున్నాయి. అక్కడ ఎన్నో పాటల చిత్రీకరణ కూడా జరిగింది. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో అంటూ చిరంజీవి సినిమాలో ఒక పాట కూడా ఉంది. అలాగే మంచు కొండల్లోన ప్రణయమా అని శ్రీకాంత్ తాజ్ మహల్ సినిమాలోని పాటను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. మణిరత్నం తెరకెక్కించిన రోజా సినిమాను.. అందులో కాశ్మీర్ అందాలను ఎవరు మరిచిపోతారు చెప్పండి..? అలా భారతీయ సినిమాతో కాశ్మీర్ కు విడదీయరని అనుబంధం ఉంది. కేవలం ప్రేమ కథలకు, పాటలకు మాత్రమే కాదు.. ఎన్నో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా జమ్మూ కాశ్మీర్ వేదికగా నిలిచింది. ఉగ్రవాదుల భయం ఉన్నా కూడా.. సైనిక రక్షణలో మన సినిమాల షూటింగ్ జరుగుతూనే ఉంటుంది.
గత అయిదారు సంవత్సరాలలో మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సరిలేరు నీకెవరు సినిమాలోని మొదటి షెడ్యూల్ కాశ్మీర్లోనే చేశారు. అలాగే శివ కార్తికేయన్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అమరన్ షూటింగ్ మొత్తం అక్కడే జరిగింది. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొత్తం కాశ్మీర్లోనే షూట్ చేశారు. తాజాగా ఉగ్రవాదులు అటాచ్ చేసిన పహాల్గాంలోనే మూడేళ్ల కింద విజయ్ దేవరకొండ బర్త్ డే పార్టీ కూడా జరిగింది. ఇక కాశ్మీర్ ఫైల్స్ సహా ఇంకా చాలా సినిమాలు షూటింగ్స్ ఈ మధ్య కాలంలో కాశ్మీర్లో జరిగాయి. స్వయంగా ప్రధానమంత్రి మోడీ కూడా కాశ్మీర్ రండి.. ఇక్కడ షూటింగ్ చేసి మన అందమైన ప్రదేశాలను ప్రపంచానికి చూపించండి అంటూ ప్రమోట్ చేశాడు. గత కొన్నేళ్లుగా కాశ్మీర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అందుకే సినిమా వాళ్ళు ధైర్యంగా అక్కడికెళ్లి షూటింగ్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు జరిగిన ఉగ్రవాదుల దాడులు నేపథ్యంలో.. సినిమా షూటింగ్స్ పై తీవ్ర ప్రభావం పడేలా కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ వెళ్లి తమ సినిమాలో షూటింగ్ చేసుకునే ధైర్యం ఏ దర్శక నిర్మాత చేయకపోవచ్చు.
ఒకవేళ అక్కడ ఏదైనా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నా కూడా ఇప్పుడు దాన్ని రీ షెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి తోడు ఆర్మీ నుంచి కూడా అనుమతులు అంత ఈజీ కాదు. ఇప్పటి నుంచి కాశ్మీర్లో సినిమా షూటింగ్ అంటే లెక్కకు మించి అనుమతులు తీసుకురావాల్సి వస్తుంది. అందుకే బెటర్ అవాయిడ్ అనే సిట్యుయేషన్ లోనే ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఉన్న ఈ ఉగ్ర వేడి తగ్గడానికి చాలా సమయం పట్టేలా ఉంది. పరిస్థితులు అన్నీ సద్దుమనిగి కాశ్మీర్ లో సినిమా షూటింగ్స్ మళ్లీ జరగాలి అంటే కనీసం ఒక ఏడాది కచ్చితంగా పడుతుంది. అంతేకాదు ఈ ఎఫెక్ట్ బాలీవుడ్ సినిమాల మీద కూడా పడేలా ఉంది. మన సినిమాలు పాకిస్థాన్లో విడుదల చేయకూడదని.. ఎప్పటినుంచో ఒక రూల్ పాస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయినా కూడా కొన్ని సినిమాలు అక్కడ విడుదలవుతూనే ఉంది. ఇప్పుడు వీటికి కూడా ఫుల్ స్టాప్ పడేలా కనిపిస్తుంది. ఎలా చూసుకున్నా కూడా పహల్గాం ఉగ్రవాదుల దాడి సినిమా ఇండస్ట్రీపై కూడా ఇన్ డైరెక్ట్ గా ప్రభావం చూపించనుంది.