Bhola shankar: వైసీపీ ప్రభుత్వంపై చిరు, హైపర్ ఆది కామెంట్స్.. భోళా శంకర్‌కు ఇబ్బంది తప్పదా..?

ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ప్రభుత్వం నుంచి గట్టి స్పందనే వచ్చే అవకాశం ఉంది. సినిమా ఇండస్ట్రీపై కాదు.. ప్రత్యేక హోదా, అభివృద్దిపై దృష్టి పెట్టాలంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం సీరియస్‌గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 8, 2023 | 04:22 PMLast Updated on: Aug 08, 2023 | 4:23 PM

Ysrcp Govt Will Give Shock To Bhola Shankar In Ap

Bhola shankar: తనకు ఎవరు.. ఏ రకంగా ఎదురొచ్చినా వైసీపీ అస్సలు సహించదు. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ సహించే రకం కాదు. చివరకు సొంత పార్టీ నేతలు ఎదురుతిరిగినా ప్రభుత్వం నుంచి ప్రతిఘటన తప్పదు. అలాంటిది ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ప్రభుత్వం నుంచి గట్టి స్పందనే వచ్చే అవకాశం ఉంది. సినిమా ఇండస్ట్రీపై కాదు.. ప్రత్యేక హోదా, అభివృద్దిపై దృష్టి పెట్టాలంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం సీరియస్‌గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. చిరంజీవికి కౌంటర్ ఇవ్వడానికి ఇప్పటికే మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని రంగంలోకి దిగారు. కౌంటర్లు ఇచ్చేశారు. అయితే, వైసీపీ రియాక్షన్ ఇంతే ఉంటుందనుకోవడానికి లేదు. మరింత ఘాటుగా స్పందించే ఛాన్స్ ఉంది.

తాజా అంచనా ప్రకారం.. ఈ వారం రిలీజ్ కానున్న చిరంజీవి మూవీ భోళా శంకర్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు. గతంలో పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. వకీల్ సాబ్ రిలీజైనప్పుడు టిక్కెట్ రేట్లు తగ్గించింది. అదనపు షోలకు అనుమతివ్వలేదు. ఇప్పుడు ఇదే వైఖరిని చిరంజీవి భోళా శంకర్‌పై చూపించే అవకాశం ఉంది. చిరంజీవి సినిమా అంటే చాలా చోట్ల ఫ్యాన్స్ స్పెషల్ షోలు వేసుకుంటారు. అర్ధరాత్రి నుంచే షోలు ప్రారంభమవుతాయి. కొన్ని చోట్ల తెల్లవారుఝామున నాలుగు గంటలకే షోలు పడతాయి. ఈ షోలకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈసారి భోళా శంకర్ మూవీకి అలాంటి అనుమతులు ఇచ్చే అవకాశం లేదు. గతంలో పవన్ సినిమాల విషయంలో ఇబ్బంది పెట్టినా.. ఉద్దేశపూర్వకంగానే చిరంజీవి సినిమాలకు సహకరించింది. చిరంజీవిని తాము గౌరవిస్తామంటూ వైసీపీ చెప్పుకొంది. కానీ, ఈసారి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. చిరంజీవి ఒక్కరే కాదు.. అంతకుముందు హైపర్ ఆది కూడా అంబటి వంటి వారిపై విరుచుకుపడ్డారు. దీనిపై కూడా వైసీపీ హైకమాండ్ గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల భోళా శంకర్‌ను వైసీపీ టార్గెట్ చేసేటట్లే కనిపిస్తోంది.
పవన్‌కు సపోర్ట్..
అయితే, చిరంజీవి ఈ వ్యాఖ్యలు మరోసారి చేసుంటే అంత ఎఫెక్ట్ ఉండేది కాదేమో. కానీ, తన సినిమా విడుదల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం సినిమాకు కొంత ఇబ్బందే. పైగా సినిమాపై వైసీపీ అభిమానులు నెగెటివ్ ప్రచారం చేస్తారు. సినిమా టాక్ ఏమాత్రం తేడాకొట్టినా వైసీపీ అభిమానులు రెచ్చిపోతారు. ఈ విషయంలో వైసీపీ వర్సెస్ మెగా ఫ్యాన్స్‌గా వార్ ముదిరే అవకాశం మాత్రం ఉంది. తన సినిమా రిలీజ్ టైంలో చిరంజీవి అనవసరంగా ఈ వ్యాఖ్యలు చేశారేమో అనే వాదన కొందరి నుంచి వినిపిస్తోంది. చిరంజీవి వ్యాఖ్యల ద్వారా ఒక విషయం మాత్రం స్పష్టమైంది. అదే.. చిరంజీవి ఏపీ రాజకీయాల్ని పూర్తిగా గమనిస్తున్నారని. పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రకంగానూ మద్దతుగా మాట్లాడని చిరంజీవి.. తాజా వ్యాఖ్యల ద్వారా పవన్ అభిప్రాయానికి విలువ ఇస్తున్నట్లు పరోక్షంగా స్పష్టం చేశారు. దీంతో జనసేనకు చిరంజీవి మద్దతు ఉందనుకోవాలని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఇంకెలాంటి స్పందన వస్తుందో చూడాలి.