హసీనాకు చుక్కలు చూపించిన 26 ఏళ్ళ యువకుడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 6, 2024 | 05:22 PMLast Updated on: Aug 06, 2024 | 5:22 PM

26 Years Old Men Target Shaik Haseena

ప్రజాస్వామ్య దేశాల్లో ఉద్యామాలు చేయడం అంటే అంత ఈజీ కాదు… కాని ఉద్యమం చేసి ప్రధానినే భయపెట్టడం అంటే అది సాధారణ విషయం కానే కాదు. 15 ఏళ్ళ నుంచి పాలిస్తున్న 74 ఏళ్ళ సీనియర్ నాయకురాలికి చుక్కలు చూపించి దేశం వదిలి పారిపోయేలా చేసాడు ఒక యువకుడు. ఆ యువకుడే 26 ఏళ్ళ నహీద్ ఇస్లాం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ జీవితాన్నే తలకిందులు చేసిన యువకుడు అతను. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఢాకా యూనివర్శిటీ నుంచి ఈ ఉద్యమం మొదలయింది.

ఇది సాధారణ ఉద్యమం అని ముందు హసీనా భావించారు. ముందు హడావుడి చేసినా తర్వాత నీరు గారిపోతుంది అనుకుని ఆమె ధీమాగా ఉన్నారు. కాని ఆమె రాజీనామా చేయాల్సిందే అంటూ నహీద్ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలోకి తీసుకెళ్ళాడు. అన్ని వైపుల నుంచి మద్దతు కూడగట్టాడు. తన నుదుటిపై బంగ్లాదేశ్ జెండాను ధరించి విశ్రాంతి లేకుండా హసీనాపై పోరాటం చేసాడు. జనవరిలో జరిగిన ఎన్నికల్లో హసీనా రిగ్గింగ్ చేసి గెలిచారని రాజీనామా చేయాల్సిందే అని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసాడు.

సోషియాలజీ విద్యార్ధి అయిన నహీద్ కు వివాహం కూడా అయింది. సాధారణంగా వివాహం అయిన వారు ఇలాంటి ఉద్యమాలకు నాయకత్వం వహించాలంటే భయపడతారు. కాని నహీద్ లక్ష్యం పెద్దది కావడంతో అతను వెనకడుగు వేయలేదు. అన్ని పక్షాలను ఏకం చేసి దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించాడు. 1998లో ఢాకాలో జన్మించిన నహీద్… చేసిన ప్రసంగాల దెబ్బకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, హసీనా భయపడ్డారంటే ఏ స్థాయిలో అతని ప్రసంగాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

అతనితో రాజీ చేసుకోవడానికి ఆమె ప్రయత్నం కూడా చేసారనే వార్తలు వచ్చాయి. అయినా సరే నహీద్ ఎక్కడా తలవంచలేదు. తాను ప్రభుత్వంతో పోరాడుతున్నా అనకుండా కేవలం ఒక వ్యక్తితో పోరాడుతున్నా అంటూ ఉద్యమాన్ని ముందుకు నడిపించాడు. విద్యార్ధులు అందరూ ఏకం కావడంతో ఆర్మీ కూడా రాజధానిలో చేతులెత్తేసిన పరిస్థితి. ఇక ప్రాణ భయంతో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి సైలెంట్ గా దేశం విడిచి భారత్ పారిపోయారు.