Nepal, 28 Flight Accidents : 30ఏళ్లలో 28విమాన ప్రమాదాలు.. ఫ్లైట్‌ యాక్సిడెంట్‌కు కేరాఫ్‌గా నేపాల్‌.. ఎందుకు?

చుట్టూ హిమాలయాలు.. చల్లగా పలకరించే గాలులు.. అద్భుతమైన వాతావరణం.. ప్రశాంతత అంతా అక్కడే ఉందా అనిపిస్తుంటుంది నేపాల్. అలాంటిది ఇప్పుడు నేపాల్ విమానం అంటే.. జనాల వెన్నులో వణుకు పుడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 24, 2024 | 03:15 PMLast Updated on: Jul 24, 2024 | 3:15 PM

28 Plane Accidents In 30 Years Nepal As A Carafe For Flight Accidents Why

 

 

చుట్టూ హిమాలయాలు.. చల్లగా పలకరించే గాలులు.. అద్భుతమైన వాతావరణం.. ప్రశాంతత అంతా అక్కడే ఉందా అనిపిస్తుంటుంది నేపాల్. అలాంటిది ఇప్పుడు నేపాల్ విమానం అంటే.. జనాల వెన్నులో వణుకు పుడుతోంది. ఫ్లైట్ యాక్సిడెంట్‌కు నేపాల్‌ కేరాఫ్‌గా మారుతోంది. 30ఏళ్లలో 28 ప్రమాదాలు.. వందల ప్రాణాలు.. ఇది చాలదా ఆ భయం పెరగడానికి! ప్రాణం వణికిపోవడానికి ! ఖాట్మండూలోని త్రిభువన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 18మంది చనిపోయారు. రెండేళ్ల కింద యతి ఎయిర్‌లైన్స్‌ మిగిల్చిన విషాదం మర్చిపోకముందే.. మరో ప్రమాదం జరగడం ఇప్పుడు ప్రతీ ఒక్కరిని భయభ్రాంతాలకు గురి చేస్తోంది. 2022లో పొఖారా విమానాశ్రయం దగ్గర యతి ఎయిర్‌లైన్స్‌ కుప్పకూలిన ఘటనలో 72 ప్రాణాలు బుగ్గిఅయ్యాయ్. 30 ఏళ్లలో 28 ప్రమాదాలు.. 2010 నుంచే 13 విమాన ప్రమాదాలు జరిగాయ్ నేపాల్‌లో! 2010 ఆగస్టు 24న ఖాట్మండులో అగ్ని ఎయిర్‌ప్లేన్‌ కుప్పకూలింది.

ఈ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. 2010 డిసెంబర్‌ 15.. తూర్పు నేపాల్‌లో విమానం కూలి 22మంది చనిపోయారు. 2011 సెప్టెంబర్‌ 25.. ఎవరెస్ట్‌ శిఖరం పరిసరాల్లో సైట్‌ సీయింగ్‌ కోసం వచ్చిన 19 మంది పర్యాటకులతో బయలుదేరిన చిన్న విమానం… ఖాట్మండు సమీపంలోని కొండలపై కూలిపోయింది. 19మందిలో ఒక్కరు కూడా మిగల్లేదు. 2012 మే 14.. 21మంది ప్రయాణికులతో వెళ్తున్న అగ్ని ఎయిర్‌ప్లేన్‌ ఉత్తర నేపాల్‌లోని జామ్సన్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో కుప్పకూలింది. 15మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2012 సెప్టెంబర్‌ 28.. 19మంది యాత్రికులతో బయలుదేరిన విమానం… మార్గమధ్యలో ఖాట్మండు శివార్లలో కాలిపోతూ కూలిపోయింది. ఈ ప్రమాదంలోనూ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. 2014 ఫిబ్రవరి 16.. అర్ఘఖంచి జిల్లాలో నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిన ఘటనలో.. 18మంది చనిపోయారు.

2016 ఫిబ్రవరి 24.. తారా ఎయిర్‌ నడిపించే ట్విన్‌ ఒట్టర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యాగ్ది జిల్లాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 23మంది చనిపోయారు. 2018 మార్చి 12.. ఢాకా నుంచి బయల్దేరిన ఓ విమానం.. ఖాట్మండులోని ఎయిర్‌పోర్టులో క్రాష్‌ల్యాండ్‌ అయింది. ఈ ప్రమాదంలో 51మంది మరణించారు. 2019 ఏప్రిల్‌ 14… ఎవరెస్ట్‌ శిఖరం సమీపంలో ఓ చిన్న విమానం టేకాఫ్‌ అవుతూ రన్‌వే నుంచి జారిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. 2022 మే 29.. నేపాల్‌ క్యారియర్‌ అయిన తారా ఎయిర్‌.. ట్విన్‌ ఒట్టర్‌ విమానం పశ్చిమనేపాల్‌లోని పొఖారా ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 22మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రెండేళ్ల కింద పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో యతి ఎయిర్‌లైన్స్‌ కుప్పకూపింది.

ఈ ఘటనలో 72మంది చనిపోయారు. రెండేళ్ల కింద జరిగిన విషాదాన్ని మర్చిపోకముందే.. మళ్లీ ఇప్పుడు విమానం కూలడం.. 18 ప్రాణాలు గాల్లో కలవడం టెన్షన్ పుట్టిస్తోంది. నేపాల్ విమానం ఎక్కాలంటే.. భయపడే పరిస్థితి తీసుకువచ్చింది. ఖాట్మండు ప్రాంతంలోనే ఎక్కువ ప్రమాదాలు జరగడం.. మరిన్ని భయాలకు కారణం అవుతోంది. ఐతే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయ్. నేపాల్‌ పర్వత ప్రాంతం కావడంతో.. ఇక్కడ వాతావరణం చాలా వేగంగా మారిపోతుంది. దీనికితోడు ఎయిర్‌పోర్టులు పర్వతాలపై సముద్రమట్టానికి ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ గాలి సాంద్రత తక్కువ. దీంతో విమానాల ఇంజిన్ల సామర్థ్యం తగ్గిపోతుంది. హఠాత్తుగా వాతావరణం మారితే మార్గం కనిపించడం కష్టమైపోతుంది. పైగా ఇక్కడ వాడే చాలా పాత విమానాల్లో వీటిని తట్టుకొనే టెక్నాలజీలు లేవు. దీంతో వాతావరణం దెబ్బకు.. చిన్న విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయ్.