బ్రేకింగ్: దేశం వదిలి పారిపోయిన ప్రధాని
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయారు. సైనిక హెలికాప్టర్ లో ఆమె ఝార్ఖండ్ మీదుగా మన దేశంలోని త్రిపుర చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా లండన్ వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె భారత ప్రభుత్వ సహకారంతో త్రిపురలో ఉన్నారని తెలుస్తోంది. ఆమె ప్రయాణించే హెలికాప్టర్ భారత్ లోకి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇక సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రాజధాని ఢాకా నుండి సైనిక విమానంలో బయలుదేరారు. తన సోదరితో కలిసి ఆమె భారత్ కు చేరుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రపంచానికి తెలియజేసారు. ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని రాజీనామా చేశారని, సైన్యం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతోందని పేర్కొన్నారు.
దాదాపు 15 ఏళ్ళ నుంచి ఆమె దేశ ప్రధానిగా ఉన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆమె నాలుగో సారి విజయం సాధించారు. అక్కడి నుంచి నిరసనలు తీవ్ర స్థాయిలో మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయకపోవడంతో ఆమె విజయం సాధించారు. ఇక సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలను ఒక వర్గానికే ఇస్తున్నారనే ఆరోపణలు ఆమెపై తీవ్ర స్థాయిలో వచ్చాయి. అక్కడి నుంచి ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి ఆమె రాజీనామా చేసే వరకు వెళ్ళింది.