BIG BREAKING : పాకిస్థాన్ లో కాల్పులు – 23 మంది మృతి : తామే కాల్పులు జరిపామన్న తాలిబన్లు
పాకిస్తాన్ - ఆఫ్గనిస్తాన్ బోర్డర్ లో మారణహోమం జరుగుతోంది. TPT కి చెందిన తాలిబన్లు పాకిస్తాన్ సైన్యం లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. మంగళవారం జరిపిన ఎటాక్ లో 23 మంది చనిపోయారు.
Talibans Massive attack in Pakistan: పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తున్ ఖ్వాలో తాలిబన్లు జరిపినదాడుల్లో 23 మంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో పాక్ ఆర్మీ బేస్ లక్ష్యంగా ఈ కాల్పులు జరిగాయి. మొదట ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఓ స్కూల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక సైనిక శిబిరంపైనా పేలుడు పదార్థాలు నింపిన ఓ ట్రక్కుతో దాడి జరిగింది. ఈ ఘటనలో 27మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ళ ధాటికి 3 రూమ్స్ ధ్వంసం అయ్యాయి. వీటి శిథిలాల కింద డెడ్ బాడీల కోసం వెతుకుతున్నారు. పాకిస్తాన్ తాలిబన్లకు చెందిన తెహ్రీక్ ఇ జిహాదీ పాకిస్తాన్ సంస్థ తామే కాల్పులు జరిపినట్టు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో ఉన్న ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా ప్రావెన్సును పాకిస్తాన్ దళాలు వదిలిపెట్టిపోవాలన్న డిమాండ్ తో ఈ కాల్పులు జరిపినట్టు తాలిబన్లు చెప్పారు. పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న ఆఫ్ఘన్ దేశస్థులను బలవంతంగా పంపిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయినప్పటి నుంచి ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా ప్రావెన్సులో తరుచుగా పేలుళ్ళు, కాల్పులు, ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. గత జనవరిలో పెషావర్ లోని మసీదులో జరిపిన బాంబు దాడిలో 80 మంది చనిపోయారు. చిత్రాల్ ఏరియాలో సరిహద్దులు దాటుతున్న TTP ఉగ్రవాదులను పాక్ మిలటరీ బలగాలు కాల్చి చంపాయి.