ట్రంప్‌తో తాడో పేడో, నువ్వెవడివి… ఆ హక్కు రద్దు చేయడానికి…?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కొంపలో కుంపటి మొదలైంది. విపక్షాల నుంచే కాదు స్వపక్షం కూడా మాంచి కాకపై ఉంది. వలసదారులు అధ్యక్షుడిపై రగిలిపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2025 | 02:12 PMLast Updated on: Jan 24, 2025 | 2:12 PM

Pepoles Serious On Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కొంపలో కుంపటి మొదలైంది. విపక్షాల నుంచే కాదు స్వపక్షం కూడా మాంచి కాకపై ఉంది. వలసదారులు అధ్యక్షుడిపై రగిలిపోతున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని చాలా రాష్ట్రాలు ట్రంప్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కాయి. మాతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవడివి అంటూ నిలదీస్తున్నాయి… 30రోజుల్లో ఈ చట్టాన్ని ఎలా అమలు చేస్తావో చూస్తామంటూ సవాల్ విసురుతున్నాయి. ఇంతకీ ట్రంప్ అనుకున్నది సాధ్యమవుతుందా…? ఆ చట్టం రద్దవుతుందా..?

బర్త్‌ రైట్‌ సిటిజన్‌షిప్‌ రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాను కుదిపేసింది. ట్రంప్ దీనిపై ముందే చెప్పినా ఇంత దారుణమైన కండిషన్లు పెడతారని ఎవరూ ఊహించలేదు. కాస్తో కూస్తో మినహాయింపు ఇస్తారని ఇల్లీగల్‌ ఇమ్మిగ్రెంట్స్‌ వరకే పరిమితం చేస్తారని చాలామంది భావించారు. కానీ ట్రంప్ మాత్రం ఒక్క సైన్‌తో వాళ్లూ వీళ్లు అని లేకుండా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికన్ పౌరులు కాకపోతే పిల్లలు అమెరికన్లు కాదని తేల్చేశారు. 160 ఏళ్ల క్రితం రాజ్యాంగం కల్పించిన హక్కుకు ఓ కలం పోటుతో ముగింపు పలికారు. దీన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మాతో సంబంధం లేకుండా నువ్వెవరివి నిర్ణయం తీసుకోవడానికి అంటూ కోర్టుకెక్కాయి. ఒకటి కాదు రెండు కాదు వందల లా సూట్లు పడ్డాయి. రాష్ట్రాలే కాదు హక్కుల రక్షణ సంస్థలు కూడా ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను కోర్టుకు లాగాయి.

న్యూయార్క్‌, న్యూజెర్సీ, కాలిఫోర్నియా సహా కొన్ని రాష్ట్రాలు ఓ గ్రూప్‌గా ఏర్పడి మసాచుసెట్స్‌ కోర్టులో లాసూట్‌ ఫైల్‌ చేశాయి. ఇటు అరిజోనా, ఒరెగాన్, ఇల్లినాయిస్‌, వాషింగ్టన్‌లు మరో గ్రూప్‌గా ఏర్పడి సియాటెల్‌లో పిటిషన్‌ వేశాయి. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, శాన్‌ఫ్రాన్సిస్కో కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటానికి రెడీ అయ్యాయి. మొత్తంగా 22 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. రాజ్యాంగ విరుద్ధమైన ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను రద్దు చేయాలని కోర్టును కోరాయి రాష్ట్రాలు. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరూ అమెరికన్లేనని 14వ రాజ్యాంగ సవరణ చెబుతోందని… దాన్ని రద్దు చేసే హక్కు అధ్యక్షుడిగా ట్రంప్‌కు లేదన్నది వారి వాదన. అసలు కాంగ్రెస్‌కు కూడా ఆ హక్కు లేదని అలాంటప్పుడు ట్రంప్ ఒక్కరే అలా ఎలా నిర్ణయం తీసుకుంటారని రాష్ట్రాలు నిలదీస్తున్నాయి. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, లాయర్స్ ఫర్ సివిల్‌ రైట్స్‌ న్యూహాంప్‌షైర్, మసాచుసెట్స్‌లో పిటిషన్లు వేశాయి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌తో పౌరసత్వాన్ని కోల్పోతున్న చిన్నారుల తల్లిదండ్రుల తరపున కోర్టును ఆశ్రయించాయి ఈ సంస్థలు. ట్రంప్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పలు రాష్ట్రాలు, పౌరహక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. అమెరికాలో పుట్టిన వారంతా అమెరికన్లే అని రాజ్యాగంలో స్పష్టంగా ఉన్నా ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్‌కిన్‌ తప్పుపట్టారు. అధ్యక్షుడికి విశేష అధికారాలుంటాయని కానీ ఆయనేం రాజు కాదని గుర్తుంచుకోవాలంటూ క్లాస్ పీకారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా చాలా ప్రమాదకరమైనదన్నారు న్యూయార్క్‌ అటార్నీ జనరల్ జేమ్స్. ట్రంప్‌పై కేసు వేసిన రాష్ట్రాలన్ని డెమొక్రటిక్ పాలనలో ఉన్నవే. అయితే రిపబ్లికన్ల పట్టున్న రాష్ట్రాల్లో కూడా కొన్ని ఈ చట్టం రద్దును వ్యతిరేకిస్తున్నాయి. అవి కూడా లీగల్ బ్యాటిల్‌లో చేరితే ట్రంప్‌కు మరిన్ని చిక్కులు తప్పవు.

అమెరికా మొత్తం మీద ఆ దేశ పౌరులు కాని తల్లిదండ్రులకు ఏటా లక్షన్నర మంది పిల్లలు పుడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరందరిపై ఇప్పుడు ట్రంప్ సైన్ ఎఫెక్ట్ పడనుంది. ఒక్క కాలిఫోర్నియాలోనే 20వేల మంది చిన్నారులు ఏటా పౌరసత్వ హక్కును కోల్పోతారు. అంటే వాళ్లే దేశం వాళ్లో వాళ్లకే తెలియకుండా పరాయిదేశంలో ఉంటున్నట్లు….వాళ్లను ఏ దేశ పౌరులుగా గుర్తించాలో ఎవరికీ అర్థంకాని అయోమయ పరిస్థితిలోకి నెట్టేశారు ట్రంప్. ఈ కన్ఫ్యూజన్‌ నుంచి బయటపడేయటానికే కోర్టులు దీన్ని ఫాస్ట్‌ట్రాక్‌ పద్దతిలో విచారించాలని కోరాయి రాష్ట్రాలు. నెలరోజుల్లో ఈ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ అమల్లోకి రావాల్సి ఉంది. అంటే ఫిబ్రవరి 20లోపు పిల్లలు పుడితే వారు అమెరికన్లు… ఆ తర్వాత ఆ తల్లి ఓ నిమిషం ఆలస్యంగా ప్రసవిస్తే వారు అమెరికన్లు కాదు.. ఇప్పుడు ట్రంప్ ఆర్డర్‌పై కోర్టులో పిటిషన్లు వెల్లువెత్తడంతో నెలరోజుల్లో అది అమలు కావడం డౌట్‌గానే కనిపిస్తోంది.

అమెరికాలో పుట్టిన వారంతా అమెరికన్లే అన్నది అక్కడి రాజ్యాంగం. తల్లిదండ్రుల పౌరసత్వంతో సంబంధం లేదు. అయితే అధ్యక్షుడిగా తొలిరోజే దాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు ట్రంప్. పిల్లలకు అమెరికా పౌరసత్వం రావాలంటే తల్లి లేదా తండ్రిలో ఒకరు అమెరికన్ అయి ఉండాలని లేదా గ్రీన్‌కార్డ్‌ కలిగి ఉండాలని లేదా సైన్యంలో పని చేస్తూ ఉండాలని రూల్ పెట్టారు. అక్రమంగా ఉంటున్నా లేక చట్టబద్దమైన శాశ్వత నివాస హోదా లేకపోయినా ఇకపై వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. నెలరోజుల్లో ఇది అమల్లోకి వస్తుందన్నారు ట్రంప్. అయితే ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయడంతో అది 30రోజుల్లో అమలుకావడం కష్టంగానే కనిపిస్తోంది. ఇదే కాదు మరిన్ని విషయాల్లోనూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై కేసులు పడ్డాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీపైనా, మస్క్ నియామకంపైనా ఇలా పలు అంశాలపై కేసులు వేశారు. ఇప్పుడు ట్రంప్ తొలిరోజు సంతకం పెట్టిన వాటిలో ఎన్ని నెలరోజుల్లో అమల్లోకి వస్తాయో చెప్పలేని పరిస్థితి.