చిచ్చు పెట్టి పోయిన జో బైడెన్.. ట్రంప్ ముందు అన్నీ సవాళ్లేనా?
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రపంచానికి ట్రంప్ ఫస్ట్ డేనే పవర్ షో చూపించారు. నాలుగేళ్ల పాలనలో తీసుకోవాల్సిన ఎన్నో సంచలన నిర్ణయాలను తొలిరోజే తన సంతకాలతో ఫైనల్ చేసేశారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రపంచానికి ట్రంప్ ఫస్ట్ డేనే పవర్ షో చూపించారు. నాలుగేళ్ల పాలనలో తీసుకోవాల్సిన ఎన్నో సంచలన నిర్ణయాలను తొలిరోజే తన సంతకాలతో ఫైనల్ చేసేశారు. ట్రంప్ డిసైడ్ అయితే వార్ వన్ సైడే అనే రేంజ్‌లో, ఆటోగ్రాఫ్స్ ఇచ్చినంత ఈజీగా సంచలన ఆర్డర్లపై సంతకాలు చెక్కేశారు. తద్వారా అమెరికా ఫస్ట్ నినాదానికే కట్టుబడి ఉన్నానని మరోసారి తేల్చేశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ డేరింగ్ డెసిషన్స్ తీసుకున్నారు. కానీ, అమెరికాను పవర్ ఫుల్‌గా మార్చడం సంతకాలు చేసింత ఈజీ అయితే కాదు.. అసలు చిక్కులు డొనాల్డ్ ట్రంప్‌నకు ముందే ఉన్నాయి. కాస్త వివరంగా చెప్పాలంటే వచ్చే నాలుగేళ్లలో అమెరికాకు ఎదురయ్యే సవాళ్లకు డొనాల్డ్ ట్రంప్ దగ్గర కూడా సమాధానాలు లేవు. ఇంతకూ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ట్రంప్ మంత్రా ఆచరణలోకి రావడానికి ఉన్న చిక్కులేంటి? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
WHO నుంచి బయటకొచ్చేశారు.. పారిస్ ఒప్పందాన్ని పక్కనపెట్టేశారు.. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చేశారు.. పనామాపై తన నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని తేల్చేశారు.. టారిఫ్ వార్‌లో తగ్గేదే లే అన్నారు. ఒక్కటేంటి.. నాలుగేళ్ల పాలనలో తీసుకోవాల్సిన పవర్‌ఫుల్ డెసిషన్స్ అన్నీ ఆత్రంగా తొలి రోజే తీసేసుకున్నారు. పవర్‌ఫుల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై వరుస సంతకాలతో అమెరికన్లకు భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించారు. ‘ట్రంప్ వచ్చేశాడు.. ఇక మా కష్టాలన్నీ తీరిపోయినట్టే అని సగటు అమెరికన్ ప్రశాంతంగా నిద్రపోయి ఉంటాడు కూడా. కానీ, గత ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేస్తేనో, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పారిస్ ఒప్పందాల నుంచి బయటకు వచ్చేస్తేనో అమెరికా పవర్‌ఫుల్ కంట్రీగా మారిపోదు. ఎందుకంటే అమెరికా కంటికి కనిపించేంత బలంగా లేదు. ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధాలు అగ్రరాజ్యాన్ని ఎప్పుడో గుల్ల చేసేశాయి.
.
తన నిర్ణయాలతో ‘అమెరికా ఫస్ట్’ అనేదే తన ప్రయారిటీ అనే సంకేతాలు పంపిస్తున్నారు ట్రంప్.తన హయాంలో దేశానికి స్వర్ణ యుగం తీసుకువస్తాననీ.. అమెరికాను పవర్‌ఫుల్ కంట్రీగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు. కానీ, అది ఎంతవరకూ సాధ్యమన్నదే అసలు ప్రశ్న. నిజానికి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాను ఆ దిశగా నడిపించడం.. అంత ఈజీ కాదు. తన ప్రసంగంలో ట్రంప్ ప్రస్తావించినట్టు అనేక సమస్యలు, సవాళ్లు సైతం దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక సవాలుగా మారగా.. దీనికి నిరుద్యోగం కూడా తోడైంది. ఈ రెండు అంశాలను ఛేదించి.. పాలనను సజావుగా ముందుకు సాగించడం కత్తిమీద సామే అనేది నిపుణుల మాట. దేశ జీడీపీ గత రెండేళ్లతో పోల్చుకుంటే భారీగా పతమైందని ఇటీవలే అగ్రరాజ్యం ఆర్థిక శాఖ వెల్లడించింది. ఫలితంగా కొన్ని ఆర్థిక బిల్లులు కూడా నిలిచిపోయాయి. పైగా అమెరికా తయారీ రంగం దెబ్బతింది. ఉక్రెయిన్, పశ్చిమాసియా యుద్ధాలపై బైడెన్ సర్కార్ వ్యవహరించిన తీరుతో పెట్టుబడి దారులు వెనక్కి తగ్గడం కూడా ఆర్థిక రంగంపై పెను ప్రభావం చూపించింది.
ఇక, మరో కీలక విషయం.. అగ్రరాజ్యంలోని రాజకీయ చిక్కులు. కేంద్ర స్థాయిలో ట్రంప్ పవర్ లోకి వచ్చినా.. రాష్ట్రాల స్థాయిలో చూసుకుంటే డెమొక్రాట్ల ప్రభావమే అధికంగా కనిపిస్తోంది. కాబట్టి.. ట్రంప్ తీసుకునే నిర్ణయాలను రాష్ట్రాల స్థాయిలో ఆమోదించేందుకు డెమొక్రాట్లపై ఆధార పడాల్సి ఉంటుంది. ఇంతకుముందు బైడెన్ పాలనలో ట్రంప్ చేసింది కూడా అదే. ఇప్పుడు అవే రాజకీయ చిక్కులు ట్రంప్ పాలనకు అతిపెద్ద అడ్డంకిగా మారే ఛాన్స్ లేకపోలేదు. ఇక, అమెరికాను ఎప్పట్నుంచో వేధిస్తున్న డ్రగ్స్, వలసలు, వీసాలు వంటివి సెన్సిటివ్ అంశాలుగా మారాయి. అంతర్జాతీయంగా వస్తున్న సవాళ్లకు తోడు.. వలసలు పెరుగుతుండడం.. వీసాల విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అమెరికా భవిష్యత్తును మార్చే అవకాశం ఉన్నా.. ఈ నిర్ణయాలు ఆయన చెబుతున్నంత ఈజీ మాత్రం కాదు. దీనికి సుదీర్ఘ కసరత్తు చేయాల్సి ఉంటుంది. మరోవైపు.. వీసాలు, వలసల విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో.. ఐటీ రంగంపై కనుక ప్రభావం పడితే.. దేశ జీడీపీ మరింత తగ్గుముఖం పడుతుంది. అదే జరిగితే అమెరికా ఆర్ధిక రంగానికి మరిన్ని చిక్కులు తప్పవు.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. ట్రంప్ ప్రస్తావించిన మరో కీలకమైన అంశం.. సరిహద్దుల భద్రత. ముఖ్యంగా ఎర్ర సముద్రంలో తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు చైనా వేస్తున్న ఎత్తులను అమెరికా ముందు నుంచి వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు కూడా ఈ సమస్య వెంటాడుతుంది. నేరస్తుల కట్టడికి కూడా.. ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆయన దృష్టిలో అంతర్జాతీయంగా నేరస్తులు తమ దేశంలోకి వలసలు వస్తున్నారని చెబుతున్నారు. కానీ, రియాలిటీ వేరు.. నిరుద్యోగ ప్రభావంతో అమెరికాలోనే నేరస్తులు తయారవుతున్నట్టు ఇటీవలే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది. అంటే.. నిరుద్యోగమే ఇప్పుడు.. ట్రంప్‌కు అతిపెద్ద సవాలు. అమెరికాను తిరిగి గొప్ప దేశంగా నిలబెట్టాలంటే నిరుద్యోగాన్ని మొదటగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. మొత్తంగా చూస్తే.. ట్రంప్ దూకుడు ఎలా ఉన్నా ఆయన ముందు కనిపిస్తున్న సమస్యలు-సవాళ్లు అనేకం ఉన్నాయన్నది నిజం. ఈ సమస్యలను ట్రంప్ ఎలా ఎదుర్కొంటారన్నదానిపైనే అగ్రరాజ్యం భవిష్యత్ ఆధారపడి ఉంది. అప్పటివరకూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది జస్ట్ నినాదంగానే ఉంటుంది.