ఐటీ రైడ్స్, “దిల్ రాజు ఇరుక్కు” అరవ సినిమా లెక్కల్లో బొక్క…?
ప్రముఖ నిర్మాత దిల్ రాజును ఐటీ అధికారులు వదిలిపెట్టడం లేదు. నాలుగు రోజుల నుంచి జరుగుతున్న సోదాలలో ఎక్కువగా దిల్ రాజును టార్గెట్ చేశారు
ప్రముఖ నిర్మాత దిల్ రాజును ఐటీ అధికారులు వదిలిపెట్టడం లేదు. నాలుగు రోజుల నుంచి జరుగుతున్న సోదాలలో ఎక్కువగా దిల్ రాజును టార్గెట్ చేశారు. మంగళవారం ఉదయం ఐటీ అధికారుల సోదాలు మొదలయ్యాయి. మొత్తం 55 బృందాలుగా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. అందులో మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా మాంగో మీడియా అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్, అభిషేక్ పిక్చర్స్ ను ఎక్కువగా టార్గెట్ చేశారు. ఇదే టైంలో దిల్ రాజు పై ఎక్కువ ఫోకస్ పెట్టడం సెన్సేషన్ అయింది. దాదాపు పది బృందాలు దిల్ రాజు ఇల్లు, అలాగే కార్యాలయాలతో పాటుగా ఆయన కుమార్తె హన్సిత రెడ్డి అల్లుడు బ్యాంకు లాకర్లను కూడా పెద్ద ఎత్తున పరిశీలించారు ఐటి అధికారులు.
సంక్రాంతి కానుకగా దిల్ రాజు రెండు సినిమాలను రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో రిలీజ్ అయ్యాయి. దాదాపుగా సినిమా గేమ్ చేంజర్ సినిమా కోసమే 450 కోట్లకు పైగా దిల్ రాజు ఖర్చుపెట్టినట్లు వార్తలు వచ్చాయి. దాదాపుగా హీరో రెమ్యూనరేషన్ 100 కోట్లకు పైగానే ఉందనే ప్రచారం కూడా జరిగింది. ఇక సినిమా వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి. ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా సూపర్ హిట్ అయింది. వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
ఈ సినిమాని కూడా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. సంక్రాంతికి రెండు సినిమాలను రిలీజ్ చేస్తే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో థియేటర్లను కూడా భారీగా పెంచారు. దీనితో ఐటీ అధికారులు దిల్ రాజు పై గట్టిగానే గురిపెట్టినట్లు క్లారిటీ వస్తుంది. ఇతర నిర్మాతల కంటే ఎక్కువగా దిల్ రాజు ఆఫీసుల్లోనే సోదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా దిల్ రాజును ఎస్ వి సి కార్యాలయానికి తీసుకెళ్లారు ఐటి అధికారులు. దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజులపాటు ఐటీ సోదాలు నిరంతరాయంగా కొనసాగాయి.
ఆయనను ఆయన కుటుంబ సభ్యులను ఎక్కడికి వెళ్ళనీకుండా సోదాలు నిర్వహించారు అధికారులు. ఇక దిల్ రాజు ఇంట్లో కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లిన అధికారులు అక్కడ కూడా సోదాలు చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇక దిల్ రాజు ఇంట్లో మరిన్ని రోజులు సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా ఉంది. ఇతర నిర్మాతల ఇళ్లలో దాదాపుగా సోదాలు కంప్లీట్ అయ్యాయి. అయితే దిల్ రాజుకు భారీగా ఫైన్ పడే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒక తమిళ సినిమాకు సంబంధించి దిల్ రాజు వద్ద సరైన పత్రాలు లేవు అనే ఆరోపణలు వినిపించాయి. ఆ సినిమా ఆధారంగానే ఎక్కువగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.