Olympics : ఆరంభ వేడుకలు అదరహో.. ఆకట్టుకున్న ఓపెనింగ్ సెర్మనీ
విశ్వక్రీడాసంబరం ఒలింపిక్స్ ఆరంభోత్సవ వేడుకలు ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో అట్టహాసంగా జరిగాయి. వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా జరిగిన ప్రదర్శన ఆకట్టుకుంది.
విశ్వక్రీడాసంబరం ఒలింపిక్స్ ఆరంభోత్సవ వేడుకలు ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో అట్టహాసంగా జరిగాయి. వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా జరిగిన ప్రదర్శన ఆకట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్టేడియం బయట జరిగిన ఓపెనింగ్ సెర్మనీ ఇటు ప్రేక్షకులకు, అటు క్రీడాకారులకు కొత్త అనుభూతిని మిగిల్చింది. పారిస్ లో ప్రసిద్ధమైన సియోన్ నదిలో అథ్లెట్ల పరేడ్ పడవలపై జరగడం విశేషంగా నిలిచింది. చిన్న పడవలో ముగ్గురు పిల్లలు, ఓ ముసుగు వ్యక్తి ఒలింపిక్ జ్యోతి పట్టుకుని రావడంతో ఆరంభ వేడుకలు ఉత్సాహంగా మొదలయ్యాయి.
పరేడ్ లో మొదట గ్రీస్ బృందం రాగా… అనంతరం శరణార్థి టీమ్ వచ్చింది. అక్కడి నుంచి ఫ్రెంచ్ అక్షర క్రమంలో మిగతా దేశాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. పరేడ్ లో 84వ దేశంగా భారత్ వచ్చింది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు భారత బృందానికి ఫ్లాగ్ బేరర్స్ గా వ్యవహరించారు. ఇక నదికి రెండు వైపులా కళాకారుల ప్రదర్శనలు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. క్రీడలతో దేశాల మధ్య ఐకమత్యమే ప్రధాన థీమ్ గా ప్రదర్శనలు అలరించాయి. పరేడ్ సాగుతున్నప్పుడే ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా ప్రదర్శనతో అలరించింది.