James Anderson : కెరీర్ ముగించిన వికెట్ల వీరుడు.. లార్డ్స్ లో ఆండర్సన్ కు గ్రాండ్ ఫేర్ వెల్
అంతర్జాతీయ క్రికెట్ లో మరో శకం ముగిసింది. టెస్ట్ క్రికెట్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో మరో శకం ముగిసింది. టెస్ట్ క్రికెట్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. క్రికెట్ మక్కా లార్డ్స్ లో అతనికి గ్రాండ్ ఫేర్ వెల్ దక్కింది. ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ విజయంతో అతనికి సెండాఫ్ ఇచ్చింది. విశేషమేమిటంటే తన కెరీర్ ను ఎక్కడ ప్రారంభించాడో అదే గ్రౌండ్ లో రిటైరయ్యాడు. 2003లో లార్డ్స్ మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన ఆండర్సన్ ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ లో ప్రధాన బౌలర్ గా మారాడు. 21 ఏళ్ళ కెరీర్ లో ఆండర్సన్ 188 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ ట్వంటీలు ఆడాడు. కెరీర్ లో ఎక్కువ శాతం టెస్ట్ ఫార్మాట్ కే ప్రాధాన్యత ఇవ్వడమే కాదు ఎన్నో రికార్డులు అందుకున్నాడు.
టెస్ట్ క్రికెట్ లో 704 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్ అత్యధిక వికెట్ల తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంతో కెరీర్ ముగించాడు. రెడ్ బాల్ క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ పేసర్ గానూ ఘనత సాధించాడు. ఇక టెస్టు క్రికెట్ చరిత్రలో 40,000 బంతులు వేసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా ఆండర్సన్ రికార్డులెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో ఆండర్సన్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. అదేవిధంగా టెస్టుల్లో విండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా ఆండర్సన్ నిలిచాడు. టెస్టుల్లో 32 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కనబరిచాడు. కాగా ఫేర్ వెల్ మ్యాచ్ కావడంతో అభిమానులు భారీగా తరలివచ్చి స్టాండింగ్ ఒవేషన్ తో ఈ వికెట్ల వీరుడికి ఫేర్ వెల్ ఇచ్చారు.