సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా…!
అమెరికా ఓటేసింది. ట్రంప్ గెలిచారు... ఇంతవరకు బాగానే ఉంది. మరి మన సంగతేంటి... ట్రంప్ మన కొంప ముంచుతారా..? భారతీయ ఐటీ ఇండస్ట్రీకి గడ్డు రోజులు వచ్చినట్లేనా...? పోలోమంటూ అమెరికా ఫ్లైటెక్కిన ఇండియన్లు తట్టాబుట్టా సర్దుకుని తిరిగొచ్చేయాలా...?
అమెరికా ఓటేసింది. ట్రంప్ గెలిచారు… ఇంతవరకు బాగానే ఉంది. మరి మన సంగతేంటి… ట్రంప్ మన కొంప ముంచుతారా..? భారతీయ ఐటీ ఇండస్ట్రీకి గడ్డు రోజులు వచ్చినట్లేనా…? పోలోమంటూ అమెరికా ఫ్లైటెక్కిన ఇండియన్లు తట్టాబుట్టా సర్దుకుని తిరిగొచ్చేయాలా…?
ట్రంప్ గెలుపు ఇండియన్ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీని అలర్ట్ చేసింది. ప్లస్ లు, మైనస్ లు లెక్కలేస్తున్నాయి కంపెనీలు. గతంలో ట్రంప్ మన ఐటీ పరిశ్రమను కాస్త ఇబ్బంది పెట్టారు. ఈసారి కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తారేమోనని సాఫ్ట్ వేర్ సుధీర్ లు తెగ కంగారు పడిపోతున్నారు. భారత్ నుంచి వేలమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పేరిట H1-B వీసాలపై అమెరికా వెళుతుంటారు. అయితే గతంలో ఈ పద్దతిని ట్రంప్ వ్యతిరేకించారు. బై అమెరికన్- హైర్ అమెరికన్ అన్నది ఆయన విధానం. ఆయన తీసుకువచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13788తో వీసాల తిరస్కరణ ఎక్కువగా ఉండేది. H1-B వీసాలే కాదు L-1 వీసాలు రావడం కూడా గగనమయ్యేది. వీసా తిరస్కరణ రేటు ట్రంప్ హయాంలో గతంలో ఎన్నడూ లేనంత ఉండేది. ఆ కారణంగా అప్పట్లో మనవారికి వీసాలు కాస్త తక్కువగా వచ్చేవి. ఇప్పుడు కూడా అవే రూల్స్ తీసుకువస్తే కొత్తగా ఉద్యోగాల కోసం అవకాశాల స్వర్గం అమెరికా వెళ్లడం కాస్త కష్టమైన పనే. ఇక మరో సమస్య H1-B వీసాలు. ట్రంప్ వాటిని తగ్గిస్తారని, విధానాలు కఠినతరం చేస్తారన్న అనుమానాలున్నాయి. బైడెన్ ప్రభుత్వ హయాంలో ఈ వీసా విధానంలో ఎన్నో లోపాలున్నాయి. వాటిని భారతీయులు తెలివిగా ఉపయోగించుకున్నారు. కానీ ట్రంప్ రావడంతో దానికి బ్రేక్ పడనుంది.
ట్రంప్ వల్ల అన్నీ నష్టాలేనా అంటే కాదనే చెప్పాలి. లాభాలు కూడా ఉన్నాయి. గతంలో ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అమెరికా వేతనాలతో సరి సమానంగా H1-B వీసాదారులకు కూడా వేతనం ఇవ్వాలన్న డిమాండ్ ను ఆయనే తీసుకువచ్చారు. దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా జరిగాయి. దీనివల్ల ఐటీ కంపెనీల లాభాలు కాస్త తగ్గాయి. ఇప్పుడు కూడా అదే రూల్ ను ట్రంప్ తెరపైకి తీసుకురావచ్చు. అంటే జాబ్ దొరికితే జీతానికి గ్యారెంటీ ఉంటుందన్న మాట. ఇప్పటికే అక్కడ జాబ్ చేస్తున్న వారికి ట్రంప్ గెలుపు వల్ల పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే సమయంలో వీసాను అడ్డు పెట్టుకుని అక్రమంగా ఉంటున్న వారికి మాత్రం గడ్డు కాలమేనని చెప్పాలి. కొత్తగా ఉద్యోగం కోసం అమెరికా వెళ్లడమూ కష్టమే.
సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీపై ట్రంప్ గెలుపు ప్రభావం భారీగా ఉండదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. కొన్ని భారతీయ కంపెనీలు స్థానికులనే నియమించుకుంటున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్ లు గతంతో పోల్చితే ఈ వీసాలపై ఆధారపడటం తగ్గించాయి. అలాగే ఇప్పుడు H1-B వీసాదారులకు ఇస్తున్న వేతనాలు కూడా కాస్త ఎక్కువగానే ఉండటంతో స్థానికులను తొలగించి విదేశీ ఉద్యోగుల్ని నియమించుకోవడం కాస్త తగ్గింది. ఇక దేశీయ ఉత్పత్తులపై కార్పొరేట్ ట్యాక్స్ ను 21శాతం నుంచి 15శాతానికి తగ్గించాలన్న ట్రంప్ ప్రతిపాదన అమలైతే అమెరికా సంస్థల బడ్జెట్ పరిమితులు కాస్త తగ్గి సాఫ్ట్ వేర్ సేవలకు డిమాండ్ పెరగొచ్చని భావిస్తున్నారు. అది భారతీయ కంపెనీలకు లాభమే. ఇక ట్రంప్ వచ్చి అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదురుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మెల్లిగా పట్టాలెక్కుతుంది. ఇది కూడా మన సాఫ్ట్ వేర్ సేవలకు డిమాండ్ పెంచుతుంది. మొత్తంగా చూస్తే ట్రంప్ గెలుపు ప్రభావం మన సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీపై స్వల్పమనే చెప్పాలి. కొన్ని ఇబ్బందులు ఎదురైనా అది కొంతకాలమే కావచ్చు.
సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీని పక్కన పెడితే దేశీయ పరిశ్రమలపై ట్రంప్ గెలుపు ప్రభావం మిశ్రమంగా ఉండనుంది. భారతీయ ఉత్పత్తులపై పన్నులు పెంచుతామని ప్రచారంలో ట్రంప్ పలుమార్లు చెప్పారు. దీని ప్రభావం మన ఎగుమతులపై ఖచ్చితంగా పడుతుంది. లాభాలు తగ్గుతాయి. అదే సమయంలో ట్రంప్ అమలు చేస్తున్న డిస్టెన్స్ చైనా విధానం మనకు కలసిరానుంది, ఇప్పటికే ఆపిల్ వంటి కంపెనీలు చైనాపై ఆధారపడటం తగ్గించాయి. భారత్ ను తమ ఉత్పత్తి కేంద్రంగా మార్చుకుంటున్నాయి. ఇప్పుడు ట్రంప్ రాకతో మిగిలిన కంపెనీలు కూడా చైనాకు కాస్త దూరంగా జరిగే అవకాశం ఉంది. ఇది మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా మారాలన్న భారత ఆశలకు మరింత ఊపిరిపోసేదే. చైనా నుంచి తప్పుకునే కంపెనీలకు భారత్ ప్రత్యామ్నాయం కావచ్చు.
ట్రంప్ పాలసీలు కాస్త కఠినంగా ఉన్నా ఆయన గెలుపు భారత్ కు అంత ఇబ్బంది కలిగించేది కాదనే చెప్పాలి. ప్రధాని మోడీపై ట్రంప్ కు మంచి గురి ఉంది. ఎన్నికల ప్రచారంలో కూడా పలుమార్లు మోడీని పొగిడారు. 2020 ఎన్నికల సమయంలో ట్రంప్ కు మద్దతుగా మోడీ మాట్లాడారు. హౌడీ మోడీ.. నమస్తే ట్రంప్ నినాదం ఎత్తుకున్నారు. ఇప్పుడు కూడా ఈ ఇద్దరు నేతలు కలసి పనిచేస్తే మనపై పడే నెగెటివ్ ప్రభావం కొంతమేర తప్పవచ్చు.