US JOB CUTS : అమెరికాలో ఉద్యోగాలు ఊస్టింగ్….  ఆందోళనలో ఇండియన్స్ !

అమెరికాలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోడానికి సిబ్బంది చేతిలో ఊస్టింగ్‌ లెటర్స్ పెడుతున్నాయి కంపెనీలు. ఇంతకీ ఈ పరిస్థితికి కారణం ఏమిటి..? భూతల స్వర్గం లాంటి అగ్ర రాజ్యంలో వేతన జీవుల దిన దిన గండానికి కారణం ఏమిటి? 

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2024 | 11:46 AMLast Updated on: Jan 24, 2024 | 11:46 AM

Us Job Cuts Indians Worry

అమెరికా (USA)లో ఉద్యోగత భద్రత అనే మాటకు అర్థం లేకుండా పోతోంది. ఈ రంగం… ఆ రంగం అని లేదు… ఉద్యోగుల మెడపై ఊస్టింగ్‌ కత్తి ఊగిసలాడుతోంది. అమెరికా ఆర్థిక పరిస్థితిపై అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో కంపెనీలు ఆర్థిక భారం తగ్గించుకోడానికి ప్రాధాన్యమిస్తున్నాయి.  కొన్ని కంపెనీలకు ఉద్యోగుల జీతాలు చెల్లింపు భారంగా మారుతోంది. దీంతో వారిని వదిలించుకోడానికి లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి.  2023లో ఉద్యోగాల్లో కోతలు భారీగా నమోదయ్యాయి. ఏడు లక్షల 21 వేల మంది ఉద్యోగులను తొలగించాయి అమెరికా కంపెనీలు. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది రెట్టింపు. 2022లో 3 లక్షల 62 వేల మందికి కొలువులు పోయాయి. మెటా, అమెజాన్ (Meta, Amazon) లాంటి టెక్‌ దిగ్గజాలే లక్షన్నర మందికి పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాయి. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఏడాది అన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నాయి. దాంతో లేఆఫ్‌లు (US Lay offs) పెరగడంతో పాటు కొత్త నియామకాలు నెమ్మదిస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కృత్రిమ మేథ, సంస్థల విలీనాలు, వనరుల క్రమబద్దీరణ లాంటి కారణాలతో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల్లో కోతలు అధికంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గత ఏడాది రిటైల్‌ రంగంలో (US Retail Sector) కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. దాదాపు 80 వేల మంది చేతిలో ఊస్టింగ్‌ లెటర్‌ పెట్టి ఇంటికి పంపించేశాయి కంపెనీలు. ఇక హాస్పిట్స్, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల్లో దాదాపు 60 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు. అలాగే, దేశంలోని మూడో వంతు సంస్థలు గత ఏడాది ఉద్యోగులకు ప్రోత్సహకాలు ఇవ్వలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితికి తాజా పరిస్థితులు తోడయ్యాయి. కొన్ని పెద్ద సంస్థలు దివాళా తీశాయి. కీలక స్టోర్లు మూతపడ్డాయి. టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం పెరిగింది. దీంతో ఉద్యోగుల తొలగింపు అనివార్యమౌతోంది.