రోహిత్ సెట్ అయ్యాడు, మరి కోహ్లీ ఎప్పుడు ?
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి సన్నాహక సిరీస్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ తో రెండో వన్డేలో సెంచరీతో దుమ్మురేపాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ అభిమానులకు హిట్ మ్యాన్ తన విధ్వంసకర బ్యాటింగ్ ను రుచి చూపించాడు

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి సన్నాహక సిరీస్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ తో రెండో వన్డేలో సెంచరీతో దుమ్మురేపాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ అభిమానులకు హిట్ మ్యాన్ తన విధ్వంసకర బ్యాటింగ్ ను రుచి చూపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు. 16 నెలలుగా వన్డేల్లో సెంచరీ లేదు.. ఇక రిటైర్మెంట్ ప్రకటనే మిగిలిందన్న ఒత్తిడి చుట్టుముట్టిన వేళ హిట్ మ్యాన్ తన విశ్వరూపం చూపించాడు. కీలక సమయంలో ఫామ్ అందుకుని తనలో ఇంకా బ్యాటింగ్ సత్తా మిగిలే ఉందని నిరూపించాడు. కటక్ వన్డేలో భారీ షాట్లతో సెంచరీ సాధించాడు. నిజానికి వరుస వైఫల్యాలతో విమర్శల ఎదుర్కొంటున్నప్పుడు ఏ బ్యాటర్ అయినా నిదానంగా ఆడతాడు. అన్నింటికీ మించి సెంచరీ ముంగిట సింగిల్స్ కే ప్రాధాన్యతనిస్తాడు. కానీ రోహిత్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం ఇవేవి పట్టించుకోకుండా తనదైన శైలిలో సిక్సర్ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు.
వన్డేల్లో అతనికిది 32వ సెంచరీ.. అయితే హిట్ మ్యాన్ ఫామ్ కోల్పోయి చాలా రోజులైపోయింది. అసలు ఏడాది కాలంగా రోహిత్ నుంచి ఒక్క మెరుపు ఇన్నింగ్స్ కూడా లేదు. టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో ఎవ్వరూ ఈ విషయాన్ని పట్టించుకోకున్నా… అతని పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. కనీసం సొంతగడ్డపై అయినా కూడా రోహిత్ మెరుపులు మెరిపించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక ఆటకు గుడ్ బై చెప్పమంటూ పలువురు సెటైర్లు కూడా వేశారు.అటు బీసీసీఐ కూడా హిట్ మ్యాన్ ను దీనిపై క్లారిటీ కూడా అడిగినట్టు వార్తలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో నాగ్ పూర్ వన్డేలో కూడా ఫ్లాప్ అయిన రోహిత్ ఇప్పుడు కటక్ లో మాత్రం దుమ్మురేపాడు. సెంచరీతో మళ్ళీ టచ్ లోకి వచ్చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఖచ్చితంగా భారత్ కు ఇది హ్యాపీ న్యూసే..
అయితే టీమిండియాను ఇంకా వెంటాడుతున్న మరో టెన్షన్ విరాట్ కోహ్లీ ఫామ్… రోహిత్ , కోహ్లీ ఫామ్ కోల్పోయి దాదాపుగా ఏడాది దాటిపోయింది. రన్ మెషీన్ గా పిలుచుకునే కోహ్లీ సైతం చాలారోజుల నుంచి పరుగులు చేసేందుకు తంటాలు పడుతున్నాడు. ఒకప్పటి తన వీక్ నెస్ కే వికెట్లు ఇచ్చుకుంటూ ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్నాడు. రోహిత్ తో పోలిస్తే మరింత ఫిట్ గా ఉండే విరాట్ గతంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితులను చాలానే ఎదుర్కొన్నా ఈ సారి మాత్రం బౌన్స్ బ్యాక్ అవ్వలేకపోతున్నాడు. గత ఏడాది కాలంగా వన్డే, టీ ట్వంటీ, టెస్ట్ ఫార్మాట్ లో కోహ్లీ ఆడిన భారీ ఇన్నింగ్స్ చాలా తక్కువ. పేలవ ఫామ్ నుంచి బయటపడేందుకు ఇటీవల రోహిత్, కోహ్లీలు రంజీ మ్యాచ్ లు కూడా ఆడారు. అయినా సక్సెస్ కాలేకపోయారు. కానీ ఇప్పుడు రోహిత్ ఫామ్ లోకి రావడంతో కోహ్లీపై ఒత్తిడి పెరగడం ఖాయం.. ఎందుకంటే విరాట్ కూడా ఇంతకంటే ఎక్కువ విమర్శలే ఫేస్ చేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగాటోర్నీలో రోహిత్, కోహ్లీ వంటి స్టార్ బ్యాటర్లు ఎంతకీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ప్రస్తుతం ఈ మెగా టోర్నీకి ముందు రోహిత్ ఫామ్ లోకి రావడంతో మరి కోహ్లీ ఎప్పుడు టచ్ లోకి వస్తాడన్న చర్చ మొదలైంది. ఇక విరాట్ కు మిగిలిన ఒకే ఒక చివరి ఛాన్స్ ఫిబ్రవరి 12న ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్… ఇంగ్లాండ్ తో మూడో వన్డే ముగిసిన మూడురోజుల్లోనే టీమిండియా దుబాయ్ కు బయలుదేరుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ కూడా సెంచరీతో ఫామ్ లోకి వస్తే ఫ్యాన్స్ కు అంతకంటే కావాల్సిందేముంది. ఇక రోహిత్, కోహ్లీ ఇద్దరూ టచ్ లోకి వచ్చారంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే అంటున్నారు ఫ్యాన్స్..