Hathras, Bhole Baba : హాథ్రస్ తొక్కిసలాటలో 121 మంది మృతి.. కారణమిదే..? దేశ వ్యాప్తంగా ఎన్ని ప్రమాదాలో తెలుసా..?
UPలోని హాథ్రస్ జిల్లాలో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమానికి వెళ్లి 121 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. హాథ్రస్ జిల్లాలోని ఆ కార్యక్రమంలో ఎక్కడ చూసినా శవాల కుప్పలే కనిపిస్తున్నాయి.
UPలోని హాథ్రస్ జిల్లాలో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమానికి వెళ్లి 121 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. హాథ్రస్ జిల్లాలోని ఆ కార్యక్రమంలో ఎక్కడ చూసినా శవాల కుప్పలే కనిపిస్తున్నాయి. బాబా పాదాల వద్ద ఉన్న పవిత్ర మట్టి, జలాన్ని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు వదిలినట్లు సమాచారం.. మృతుల్లో అమాయక మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉండటం అందరినీ కలచివేస్తోంది.
దీంతో హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ గౌరవ్ ద్వివేది కోరారు. UPలోని హాథ్రస్‌లో జరిగిన విషాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ముఖ్య నిర్వాహకుడు దేవప్రకాశ్‌తో పాటు మరికొందరిపై BNSలోని హత్యానేరం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భోలే బాబాను అరెస్ట్ చేసే అంశంపై ఆ రాష్ట్ర DGP ప్రశాంత్ కుమార్ స్పందించారు. దర్యాప్తులో ఉన్న సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం 2 లక్షల మందికి బందోబస్తుగా 40+ మంది పోలీసులే విధుల్లో ఉన్నారట.
- మృతదేహాలను చూసి గుండెపోటు.. కానిస్టేబుల్ మృతి
అక్కడి ఎటా మెడికల్ కాలేజీలో నేలపై పడి ఉన్న మృతదేహాలను చూసి 30 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ రజనీశ్ గుండెపోటుతో మరణించాడు. అతడిని క్విక్ రెస్పాన్స్ టీమ్(QRT)లో డ్యూటీ కోసం అత్యవసరంగా పిలిపించారు. పదుల సంఖ్యలో మృతదేహాలను చూసి తట్టుకోలేక గుండెపోటుకు గురై ప్రాణాలను వదిలాడు.
- హాథ్రస్ ఘటనపై హోంమంత్రి ప్రకటన చేయాలి: ఖర్గే
యూపీ హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో హోంమంత్రి ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. నకిలీ బాబాలను నియంత్రించాలని కోరారు. సత్సంగ్ లాంటి కార్యక్రమాలకు మార్గదర్శకాలు, ప్రత్యేక చట్టాలు రూపొందించాలని సూచించారు. మరోవైపు ఈ ఘటనపై రాజ్యసభ సభ్యులు సంతాపం తెలియజేశారు.
- హత్రాస్ ఘటనపై పుతిన్ సంతాపం
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ తొక్కిసలాటలో 121 మంది వరకు మరణించిన సంగతి తెలిసిందే.. ఈ విషాద ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకు సందేశాలు పంపారు. ఆ ఘటన తనను ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారతదేశంలో తొక్కిసలాటలు.. విషాదాలు.. మరణాలు
- 2005: మంధర్‌దేవీ ఆలయం(MH)-340 మంది మృతి
- 2008: నైనా దేవీ కోవెల(HP)-162 మంది మృతి
- 2008: చాముండా దేవీ ఆలయం(RS)-250 మంది మృతి
- 2011: ఇడుక్కి(KL)-104 మంది అయ్యప్ప భక్తులు మృతి
- 2013: దతియాలో(MP)-115 మంది మృతి
- 2014: పట్నా(బిహార్)-32 మంది మృతి
- 2022: వైష్ణోదేవీ ఆలయం(J&K)-12 మంది మృతి
- 2023: ఇండోర్(MP)-36 మంది మృతి
- 2024: హాథ్రస్(UP)-116 మంది మృతి