మెగా వేలంలో 13 ఏళ్ల చిన్నోడు, ఎవరీ వైభవ్ సూర్యవంశీ ?

క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా వేలం ఆరంభానికి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఊహించని విధంగా 13 ఏళ్ల చిన్నోడు ఈ సారి మెగా వేలం బరిలో నిలిచాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 18, 2024 | 12:25 PMLast Updated on: Nov 18, 2024 | 12:25 PM

13 Year Old Boy In Mega Auction Every Vaibhav Suryavanshi

క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ మెగా వేలం ఆరంభానికి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఊహించని విధంగా 13 ఏళ్ల చిన్నోడు ఈ సారి మెగా వేలం బరిలో నిలిచాడు. ఈ జాబితాలో అత్యంత ఎక్కువ వయస్కుడిగా ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నిలవగా.. అత్యంత పిన్నవయస్కుడిగా బీహార్ కుర్రాడు 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 1574 మందిలో వెయ్యి మందిని తొలగించిన ప్రాంఛైజీలు.. ఓ 13 ఏళ్ల కుర్రాడికి చోటివ్వడం ఆశ్చర్యపరుస్తోంది. అతని స్పెషాలిటీ ఏంటన్న చర్చ మొదలయింది. బీహార్‌లోని తాజ్‌పూర్ గ్రామంలో 2011లో జన్మించిన వైభవ్ నాలుగేళ్ళ వయస్సులోనే బ్యాట్ పట్టాడు. క్రికెట్ పట్ల అతని మక్కువను చూసి ఆశ్చర్యపోయిన తండ్రి సంజీవ్.. కుమారుడి కోసం సొంత ఆట స్థలాన్ని నిర్మించారు. ఇరుగుపొరుగు వారితో కలిసి అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు.

వైభవ్‌ ను ఎనిమిదేళ్ళు వయస్సులో క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ రెండున్నరేళ్ల ట్రైనింగ్ అనంతరం పదేళ్లకే అండర్ 16 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పదేళ్ల వయస్సులోనే వైభవ్.. బీహార్ అంతటా వివిధ స్థానిక టోర్నమెంట్లలో ఆడుతూ ఔరా అనిపించాడు. హేమన్ ట్రోఫీ, అంతర్-జిల్లా టోర్నమెంట్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌లలో దాదాపు 800 పరుగులు చేశాడు. అదే ఫామ్‌ను వినూ మన్కడ్ ట్రోఫీలోనూ కంటిన్యూ చేశాడు. 5 మ్యాచ్‌ల్లో 400కు పైగా పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన అతని కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది. బీహార్ బోర్డు దృష్టిలో పడిన వైభవ్ ఈ ఏడాది ప్రారంభంలో బీహార్ రాష్ట్రం తరుపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అప్పుడు అతని వయస్సు12 ఏళ్ల 284 రోజులు.

అనంతరం భారత అండర్19 టీమ్‌కి ఎంపికైన వైభవ్ ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేసి అతి పిన్న వయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లోనూ ఆడుతున్నాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీలో ఆరంగ్రేటం చేసిన వైభవ్ సూర్యవంశీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో మొదటి మ్యాచ్ ఆడిన నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు. ఇపుడు ఐపీఎల్ వేలంలో ఎంట్రీ ఇవ్వడం ద్వారా చరిత్ర సృష్టించాడు. రేపు వేలంలో అమ్ముడయితే అది మరో రికార్డుగా
మిగిలిపోనుంది.