చెన్నై జట్టులోకి 17 ఏళ్ళ సంచలనం, రుతురాజ్ స్థానంలో ఆయుష్ మాత్రే
ఐపీఎల్ 18వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఎన్నడూ లేని విధంగా వరుసగా ఐదు మ్యాచ్ లలో పరాజయం పాలైంది. అసలు ఆడుతోంది చెన్నై జట్టేనా అన్న కామెంట్లు కూడా వినిపించాయి.

ఐపీఎల్ 18వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఎన్నడూ లేని విధంగా వరుసగా ఐదు మ్యాచ్ లలో పరాజయం పాలైంది. అసలు ఆడుతోంది చెన్నై జట్టేనా అన్న కామెంట్లు కూడా వినిపించాయి. ఈ వరుస ఓటములకు తోడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో దూరమవడం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. అతని స్థానంలో ధోనీ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. కానీ ఫామ్ లో ఉన్న రుతురాజ్ బ్యాటింగ్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరన్న చర్చ జరుగుతోంది. తాజాగా చెన్నై యాజమాన్యం దీనికి తెరదించింది. రుతురాజ్ స్థానంలో ముంబై చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రేను జట్టులోకి తీసుకుంది. రుతురాజ్ ప్రత్యామ్నాం కోసం సీఎస్‌కే మేనేజ్‌మెంట్ మాత్రేతో పాటు పృథ్వీ షా , ఉర్విల్ పటేల్, సల్మాన్ నిజర్ పేర్లను పరిశీలించినప్పటికీ, చివరికి మాత్రే వైపే మొగ్గుచూపింది.
మాత్రేను చెన్నై ఫ్రాంచైజీ 30 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. ఈ 17 ఏళ్ళ యువ బ్యాటర్ మెగా వేలంలో పోటీపడినప్పటికీ ఏ ఫ్రాంచైజీ అతన్ని కొనుగోలు చేయలేదు. మాత్రేపై సీఎస్‌కే మొదటి నుంచి సానుకూలంగా ఉన్నా ఎందుకో మెగా వేలంలో కొనుగోలు చేయలేదు. గతేడాది మాత్రేను ట్రయల్స్‌కు కూడా పిలిపించుకుంది. మాత్రేను ట్రయల్స్‌కు పిలిచిన విషయాన్ని అంగీకరించిన సీఎస్‌కే యాజమాన్యం అవసరమైతేనే అతన్ని జట్టుకు ఎంపిక చేస్తామని గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు రుతురాజ్ స్థానంలో అతనికే చోటు కల్పించింది.
మాత్రేను వీలైనంత త్వరగా జట్టులో చేరాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ కబురు పెట్టినట్లు తెలుస్తుంది. ఎల్‌ఎస్‌జీతో మ్యాచ్ కోసం సీఎస్‌కే ప్రస్తుతం లక్నోలో ఉంది. ఈ మ్యాచ్ కు అతను జట్టుతో చేరే ఛాన్స్ లేదు. ఏప్రిల్ 20న సీఎస్‌కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు మాత్రే అందుబాటులోకి రావచ్చు. కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ అయిన మాత్రేకు ముంబై క్రికెటింగ్ సర్కిల్స్‌లో మంచి గుర్తింపు ఉంది. మాత్రే ముంబై తరఫున అతి తక్కువ మ్యాచ్‌లు ఆడినా టాలెంటెడ్ ఆటగాడిగా పేరు సంపాదించాడు. మాత్రే 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 504 పరుగులు చేశాడు. 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 458 పరుగులు చేశాడు. గతేడాది అక్టోబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మాత్రే అతి తక్కువ కాలంలోనే టీమిండియా మెటీరియల్‌గా ముద్ర వేసుకున్నాడు. లిస్ట్ ఎ క్రికెట్ లో యశస్వి వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆయుష్ మాత్రే అత్యంత పిన్న వయసులో 150కిపైగా స్కోరు చేసిన బ్యాటర్ గా వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు.