SAHIL CASE : సాహిల్ ను తప్పించడానికి 30 లక్షలు..?
హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ను తప్పించడానికి 30 లక్షలకు బేరం కుదిరినట్టు తెలుస్తోంది. ఈనెల 23న బేగంపేట ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.
హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ను తప్పించడానికి 30 లక్షలకు బేరం కుదిరినట్టు తెలుస్తోంది. ఈనెల 23న బేగంపేట ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బ్యారికేడ్స్ ను ఢీకొట్టింది. కారు నడిపిన సాహిల్ దుబాయ్ పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో సాహిల్ ను తప్పించి.. మరో వ్యక్తిని నిందితుడిగా చేర్చడానికి భారీ ఎత్తున డీల్ కుదిరినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు అంతర్గత విచారణ చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ కోసం పోలీసుల సెర్చింగ్ ముమ్మరంగా సాగుతోంది. ప్రమాదం జరిగిన రోజు పంజాగుట్ట ఇన్స్ స్పెక్టర్ దుర్గారావు.. ఘటనా స్థలం నుంచి సాహిల్ ను స్టేషన్ కు తీసుకొచ్చినట్టు సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా ఉంది. అప్పటి నుంచి షకీల్ అనుచరులతో సంప్రదింపులు మొదలయ్యాయి. ఈ ప్రమాదం కేసు నుంచి సాహిల్ ను తప్పించడానికి 30 లక్షలకు బేరం కుదిరిందని అంటున్నారు. సాహిల్ అరగంటపాటు స్టేషన్ లోనే ఉన్నాడు. ఈలోపు అతని స్థానంలో ఇంట్లో డ్రైవర్ ఆరిఫ్ ను నిందితుడిగా చూపించడానికి స్కెచ్ వేశారు. అయితే డైరెక్ట్ గా సాహిల్ ను వదిలేస్తే ఇబ్బందులు వస్తాయని పోలీసులు అనుమానించారు. అందుకే ఆయన్ని బ్రీత్ అనలైజర్ టెస్టుల కోసం పేరుతో పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు హోంగార్డ్ ను ఇచ్చి పంపారు.
అక్కడ సాహిల్ ఎస్కేప్ అయినట్టు చెబుతున్నారు. అయితే ఇదంతా సాహిల్ ను తప్పించడానికి ఆడిన డ్రామాగా పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇన్సెపెక్టర్ దుర్గారావును ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఈ కేసులో దుర్గారావును కూడా నిందితుడిగా చేర్చాలని భావిస్తున్నారు.
సాహిల్ ఎస్కేప్ అయిన గంట తర్వాతే పోలీసులు కేసును రిజిస్టర్ చేసినట్టు తేలింది. బేరసారాలు చేసిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రమేయం ఎంతవరకు ఉందనేది కూడా పరిశీలిస్తున్నారు. పోలీసులపై శాఖాపరమైన విచారణ కూడా కొనసాగుతోంది. దుబాయ్ కి పారిపోయాడని భావిస్తున్న నిందితుడు సాహిల్ రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో డిజిటల్ ఎవిడెన్స్ పక్కాగా ఉండేలా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.