500 Gas Cylinder : రూ.500కే గ్యాస్ సిలెండర్… ఎప్పటి నుంచి అంటే… మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన !
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో రూ. 500కే గ్యాస్ సిలిండర్’ కూడా ఉంది. ఈ గ్యాస్ సిలెండర్ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారని తెలంగాణలో సామాన్య జనం ఎదురు చూస్తున్నారు. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
Uttam on 500 Gas Cylinder : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక… రెండు గ్యారెంటీలను అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. దీన్ని 100 రోజుల్లో అమలుచేస్తామంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పౌర సరఫరాల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై అధికారులు వివరించారు. గత పాలకుల వల్ల పౌర సరఫరాల శాఖలో తప్పులు జరిగాయి. దాంతో 11వేల కోట్ల నష్టాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ ఉందన్నారు ఉత్తమ్.
రైతుల నుంచి ప్రోక్యూర్మెంట్ చేసే శాఖ సివిల్ సప్లయీస్ శాఖ. గ్యాస్ సిలిండర్ రూ.500, ప్యాడి ప్రోక్యూర్మెంట్‌లో రూ. 500 పెంచే రెండు కార్యక్రమాలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 5 కిలోల బియ్యాన్ని కేంద్రం అందిస్తోంది. ఇప్పటివరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బీఆర్ఎస్ ఇచ్చింది. లబ్ధిదారుల నుంచి పీడీఎస్ రైస్ డైవర్ట్ అయ్యిందన్నారు ఉత్తమ్. లబ్ధిదారులకు తినగలిగే రైస్ ఇవ్వాలన్నారు.
గత ప్రభుత్వం సివిల్ సప్లయీస్ శాఖకు సాయం చేయకపోవడంతో 56 వేల కోట్లు అప్పు చేసింది. సివిల్ సప్లై కార్పొరేషన్ దగ్గర 90 లక్షల మెట్రిక్ టన్నులు, 18వేల కోట్ల విలువైన ప్యాడి రైస్ మిల్లర్ల దగ్గర స్టాక్ ఉన్నాయి. వీటిని ఏం చేయాలనేది క్యాబినెట్‌లో చర్చిస్తామన్నారు మంత్రి. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లోపాలు ఉన్నాయి. ఉన్న రేషన్ కార్డులో బియ్యం తీసుకున్న వారు 89 శాతం దాటడం లేదన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ ఉంది. సీఎం దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్తామని చెప్పారు ఉత్తమ్.
‘పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం సరఫరా విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు మంత్రి. 1.8 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామనీ… కానీ ప్రజలు వాటిని ఉపయోగించుకుంటున్నారా? అన్నది గమనించాలి. కిలో 39 రూపాయలు పెట్టి సేకరిస్తున్న బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నప్పుడు అవి పేదలు తినకపోతే ఈ పథకం నిరుపయోగం అవుతుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. రాష్ట్రంలో బియ్యం లబ్దిదారుల నుంచి రాండం చెక్ చేయాలనీ… ప్రజల నుంచి సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు.