పంత్ కు 90 ఫోబియా ? ఏడు సార్లు చేజారిన శతకం

బెంగళూరు టెస్టులో నాలుగోరోజు సర్ఫరాజ్ ఖాన్ శతకంతో పాటు రిషబ్ పంత్ ఫైటింగ్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. గాయంతో పంత్ బ్యాటింగ్ కు వస్తాడో రాడో అనుకుంటున్న సమయంలో క్రీజులోకి వచ్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 19, 2024 | 04:46 PMLast Updated on: Oct 19, 2024 | 4:46 PM

90 Phobia For Pant A Century Passed Seven Times

బెంగళూరు టెస్టులో నాలుగోరోజు సర్ఫరాజ్ ఖాన్ శతకంతో పాటు రిషబ్ పంత్ ఫైటింగ్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. గాయంతో పంత్ బ్యాటింగ్ కు వస్తాడో రాడో అనుకుంటున్న సమయంలో క్రీజులోకి వచ్చాడు. నొప్పితో బాధపడుతూనే సర్ఫరాజ్ తో కలిసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన పంత్ తృటిలో సెంచరీ చేజార్చుకోవడమే ఫ్యాన్స్ నిరాశపరిచింది. అయితే ఓవరాల్ గా పంత్ మాత్రం తన బ్యాటింగ్ తో అభిమానులను ఎంటర్ టైన్ చేశాడు. కళ్లు చెదిరే సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. టీమ్ సౌథీ వేసిన 61 ఓవర్‌ ఓవర్లో పంత్ లాంగాఫ్ లో కొట్టిన సిక్సర్ హైలెట్ గా నిలిచింది. తర్వాత ఆజాజ్ పటేల్ వేసిన 66వ ఓవర్‌లో పంత్ మరో రెండు సిక్స్‌లు బాదాడు. తనదైన శైలిలో స్టెప్ ఔటై.. భారీ సిక్స్‌లు కొట్టాడు. మోకాలి గాయంతో మైదానం వీడిన పంత్.. ఎలాంటి ఇబ్బంది లేకుండా సిక్సర్లు బాదాడు.

రిషబ్ పంత్ సిక్సర్ల ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు బిత్తరపోయారు. అభిమానులు అయితే పంత్ సిక్సర్లను ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. జట్టును గట్టెక్కించే క్రమంలో సర్ఫరాజ్‌ ఖాన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.చిన్నస్వామి స్టేడియం మొత్తం పంత్ షాట్లకు దద్దరిల్లింది. అయితే ఒక పరుగు తేడాతో పంత్ ఔటవడం ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశపడ్డారు. కివీస్ పేసర్ రూర్కీ వేసిన 89వ ఓవర్‌ మొదటి బంతికే పంత్‌ అనూహ్య రీతిలో బౌల్డ్‌ అయ్యాడు. పంత్ సెంచరీ మిస్సవ్వడంతో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది.

పంత్‌ టెస్టుల్లో ఇలా 90లలో అవుట్‌ కావడం ఇది ఏడోసారి. అతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 5 సిక్సర్లున్నాయి. ధోనీ తర్వాత 99 పరుగుల దగ్గర ఔటైన రెండో వికెట్ కీపర్ గా నిలిచాడు. ఓవరాల్ గా 90లలో అత్యధిక సార్లు ఔటైన బ్యాటర్ల జాబితాలో ఈ యువ క్రికెటర్ మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ , ద్రావిడ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరిద్దరూ 10 సార్లు 90లలో ఔటయ్యారు. పంత్ తన టెస్ట్ కెరీర్ లో ఇప్పటి వరకూ ఆరు శతకాలు సాధించాడు. ఎటువంటి పరిస్థుతుల్లోనైనా దూకుడుగా ఆడే పంత్ ఇలా శతకం చేజార్చుకోవడం భారత ఫ్యాన్స్ కు బాధ కలిగించింది. మొత్తం మీద గాయం తాలుకు నొప్పి వేధిస్తున్నా విలువైన ఇన్నింగ్స్‌ ఆడిన ఈ వికెట్‌ కీపర్‌ కు స్టేడియంలో ఫ్యాన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.