ఒక బెర్త్…3 జట్లు రసవత్తరంగా సెమీస్ రేస్
మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా సెమీఫైనల్ రేస్ రసవత్తరంగా మారిపోయింది. ప్రస్తుతానికి ఆసీస్ జట్టు మాత్రమే మెరుగైన స్థితిలో ఉండగా.. మిగిలిన ఒక బెర్త్ కోసం రేసులో మూడు జట్లు నిలిచాయి.
మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా సెమీఫైనల్ రేస్ రసవత్తరంగా మారిపోయింది. ప్రస్తుతానికి ఆసీస్ జట్టు మాత్రమే మెరుగైన స్థితిలో ఉండగా.. మిగిలిన ఒక బెర్త్ కోసం రేసులో మూడు జట్లు నిలిచాయి. భారత మహిళల జట్టుతో పాటు న్యూజిలాండ్, పాకిస్థాన్ కూడా పోటీలో ఉన్నాయి. తొలి మ్యాచ్ లో కివీస్ పై ఓడినా తర్వాత పాక్ పై గెలిచిన భారత్ తప్పక గెలవాల్సిన మరో మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. శ్రీలంకపై 82 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి నెట్‌రన్‌రేటును గణనీయంగా మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హర్మన్ ప్రీత్ టీమ్ రెండో స్థానానికి ఎగబాకింది. ఆసీస్ మొదటి స్థానంలో ఉండగా.. పాకిస్థాన్, న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గ్రూప్ ఎ సెమీస్ సమీకరణాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
ఆస్ట్రేలియా మిగిలిన తమ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే అజేయంగా సెమీస్‌కు దూసుకెళ్తుంది. ఒకవేళ భారత్ చేతిలో ఓడి, పాకిస్థాన్‌పై గెలిచినా.. న్యూజిలాండ్ తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో ఓడితే.. నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా ఆసీస్ సెమీఫైనల్స్‌కు చేరుకుంటుంది. కివీస్ విజయాలతో సంబంధం లేకుండా కూడా మెరుగైన నెట్‌రన్‌రేటు ఉండడంతో కంగారూలు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇక పోటీ అంతా రెండో స్థానం కోసమే నడుస్తోంది. సెమీస్ రేసులో భారత్‌కు న్యూజిలాండ్ గట్టిపోటీనిస్తోంది.. పాకిస్థాన్‌కు కూడా రేసులో ఉన్నప్పటికీ.. ఆ జట్టు బలమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పోటీపడాల్సి ఉండడంతో ఆ జట్లును ఓడించడం కష్టమే. దీంతో రెండో బెర్త్ కోసం భారత్, కివీస్ జట్ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.
భారత్ సెమీస్ కు చేరాలంటే ఆస్ట్రేలియాపై భారత్ తప్పక విజయం సాధించాలి. ఒకవేళ ఆసీస్‌పై టీమిండియా గెలిచి, పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా నెగ్గి, మరోవైపు న్యూజిలాండ్ తమ మిగిలిన మ్యాచ్‌ల్లో శ్రీలంక, పాకిస్థాన్‌పై గెలిస్తే… భారత్, ఆసీస్, కివీస్ ఆరు పాయింట్లతో నిలుస్తాయి. అప్పుడు మెరుగైన నెట్‌రన్‌రేటు ఉన్న జట్లు సెమీస్‌కు వెళ్తాయి. మరోవైపు ఆసీస్ ను ఓడించడం భారత జట్టుకు సవాలే అయినప్పటకీ… కనీసం 10 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలిస్తే రన్ రేట్ విషయంలో కివీస్ ను దాటొచ్చు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైనా భారత్ సెమీస్‌కు చేరే అవకాశం ఉంటుంది. అయితే న్యూజిలాండ్, పాకిస్థాన్ కనీసం తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఒక్కటైనా ఓడిపోవాలి. అలాగే ఆసీస్ చేతిలో భారత్ స్వల్ప తేడాతో ఓడినా మెరుగైన రన్ రేట్ తో ముందంజ వేయొచ్చు.