మంచుకొండల్లో సలసల మరిగే నీటికుంట.. సైన్స్‌కు అంతుచిక్కని రహస్యం.. శివయ్య మహిమేనా..?

ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అన్నీ సైన్స్‌కు అంతుపట్టవు. ఆ రహస్యాల వెనుక మర్మం కనుక్కోవాలని శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. కానీ... సమాధానాలు లేని ప్రశ్నలుగానే మిగులుతుంటాయి. అందులో ఒకటి హిమాలయాల్లోని మణికరణ్‌ పుణ్యక్షేత్రం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2024 | 06:45 PMLast Updated on: Dec 04, 2024 | 6:45 PM

A Boiling Pool Of Water In The Icebergs A Mystery That Baffles Science

ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అన్నీ సైన్స్‌కు అంతుపట్టవు. ఆ రహస్యాల వెనుక మర్మం కనుక్కోవాలని శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. కానీ… సమాధానాలు లేని ప్రశ్నలుగానే మిగులుతుంటాయి. అందులో ఒకటి హిమాలయాల్లోని మణికరణ్‌ పుణ్యక్షేత్రం. మంచుకొండల్లో ఉన్న శివాలయం దగ్గర ఒక వైపు నీరు గడ్డకడుతూ ఉంటుంది… దాని పక్కనే ఉన్న నీటి బుగ్గలో మాత్రం… సలసల మరిగే నీరు ఉంటుంది. అది చూస్తే… నిజంగా ఆశ్చర్యమే. అలా ఎలా జరుగుంది..? దీని వెనుకున్న రహస్యం ఏంటి..? దేవుడి మహిమేనా..?

మణికరణ్‌.. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న శివాలయం.. పురాతనకాలం నాటిది. ఆ ఆలయంలో అద్భుతమైన శివలింగం ఉంది. ఇది పూర్తిగా నల్లరాతితో చెక్కబడి ఉంటుంది. ఇది మహిమగల శివలింగమని… భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం… ఈ ఆలయంలోని పరమశివున్ని పూజించేందుకు దేవతలు స్వర్గం నుండి దిగివస్తారట. శ్రీరాముడు కూడా.. ఈ ప్రదేశంలో శివుడిని అనేక సార్లు దర్శించుకుని పూజలు చేశాడని చెప్తారు.

ఇక… ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే వింత కూడా ఉంది. పవిత్రస్థలమైన మణికరణ్‌ మీదుగా పార్వతీ నది ప్రవహిస్తుంది. దీనికి ఒక వైపు శివాలయం, మరోవైపు మణికరణ్‌ సాహిబ్ అని పిలువబడే గురుద్వారా ఉంది. పార్వతి నదిలో గడ్డకట్టే నీరు ఉంటే… పక్కనే ఉన్న నీటి బుగ్గలో ఎప్పుడూ సలసలమని మరిగే నీరే ఉంటుంది. అది ఎలా సాధ్యమని.. చూసినవారంతా ఆశ్చర్యపోతారు. గడ్డకట్టే చలిలోనూ… ఆ నీటి బుగ్గలో వేడి నీరు ఎలా ఉంటుంది అనేది… ఇప్పటి వెయ్యి డాలర్ల ప్రశ్నే. సైన్స్‌కు కూడా అంతుచిక్కని ఆ వింత… మహాశివుడి మహిమే అని ఒప్పుకుని తీరాలంటారు భక్తులు.

పురాతనమైన ఈ శివాలయానికి సంబంధించి… ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. శివుడి సతీమణి పార్వతీదేవి చెవిపోగు ముత్యం… నదిలో పడిపోయి.. పాతాళానికి చేరుకుందట. ఇది తెలిసి శివుడు… ముత్యాన్ని వెతికి తెచ్చేందుకు తన గణాలను పంపాడట. ఎంత వెతికినా ముత్యం దొరకపోవడంతో… శివుడు కోపించి మూడో కన్ను తెరిచాడు. మహాదేవుని కోపానికి నదిలో నీరు మరగడం మొదలైందట. అప్పటి నుంచి ఇప్పటికీ… ఆ నీరు మరుగుతూనే ఉందని చెప్తారు.

మణికరణ్‌లో వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శీతాకాలమంతా మంచు కురుస్తే.. వేసవిలో ఆహ్లాదకరంగా ఉంటుంది. శివాలయంలోని మరుగుతున్న నీటి బుగ్గలన్నీ కలిసి 10 నుంచి 15 అడుగుల ఎత్తులో ఒక ఫౌంటెన్‌లా కనిపిస్తాయి. ఈ నీటి బుగ్గల ఉష్ణోగ్రత 65 నుంచి 80 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ నీటి బుగ్గల్లో నీరు ఎందుకంత వెచ్చగా ఉంటుందో తెలుసుకునేందుకు కొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ… రహస్యాన్ని ఛేదించలేకపోయారు. అయితే.. ఇక్కడి నీటిలో సల్ఫర్ ఉండదని మాత్రం తేల్చిచెప్పారు. దీంతో ఆ నీటిలో అన్నం, పప్పు, కూరగాయలు వంటి వివిధ ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. ఆ నీటిలో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలు నయమవుతాయని నమ్ముతారు.