Sprite Bottle: పేషెంట్ కి యూరిన్ బ్యాగ్ స్థానంలో స్ప్రైట్ బాటిల్..!
వైద్యో నారాయణో హరి అంటారు. ఎందుకంటే వీళ్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సరైన చికిత్స అందించి, రోగాన్ని నయం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దుతారు కాబట్టి. అలాంటి వైద్యులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే పరిస్థితి ఉలా ఉంటుందో ఇప్పుడు చూడండి.

A bottle of Sprite was arranged in the urine bag place for a patient in a Bihar government hospital
బీహార్ లోని ఓ సర్కారీ దవాఖానాలో వైద్యపరికరాల కొరత తీవ్రంగా ఉంది. ఆసుపత్రిలో చేరిన పేషెంట్లకు ఇది పెద్ద సమస్యగా మారింది. తాజాగా ఒక వృద్దుడు అపస్మారక స్థితిలో పడిపోతే వారి కుటుంబ సభ్యులు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే అతనిని పరీక్షించిన వైద్యులు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇచ్చి స్పృహ వచ్చేలా చేశారు. ఇతనికి కాలు విరిగిన కారణంగా లేవలేని పరిస్థితి. దీంతో యూరిన్ బ్యాగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ పరికరాల కొరత కారణంగా 2.25 లీటర్ల స్ప్రైట్ బాటిల్ ఏర్పాటు చేశారు. దీనిపై తమ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమానవీయమైన సంఘటనను కొందరు ఫోటో తీసి సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంపై, యూరిన్ బ్యాగ్ స్థానంలో కూల్ డ్రింక్ బాటిల్ ఏర్పాటు చేయమని నర్సుకు సూచించిన వైద్యునిపై తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. దీనిపై ఆసుపత్రి ఉన్నతాధికారిని అక్కడి స్థానికులు, రోగి బంధువులు నిలదీశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తిరిగి మరుసటి రోజు ఉదయం అప్పటికప్పుడు పరిమిత సంఖ్యలో యూరిన్ బ్యాగులను తీసుకువచ్చి పేషెంట్ కు అందించారు మేనేజర్ పాండే. విషయం బయటకు పొక్కడంతో హాస్పిటల్ యాజమాన్యం వెనక్కి తగ్గి యూరిన్ బ్యాగులు స్టాక్ రూంలో లేని విషయం నాకు తెలియదు. ఈ సమస్య నా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించానని చెప్పి తప్పును కప్పిపుచ్చుకున్నారు.
బీహార్ కి చెందిన 60 ఏళ్ల ఓ వ్యక్తి జాజా రైల్వే ట్రాక్ దగ్గర కాలు విరిగి పడిపోవడం గుర్తించారు స్థానిక పోలీసులు. ఇతనిని వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిపించారు. బాధితుని నుంచి ఇంటి సమాచారాన్ని సేకరించి కుటుంబ సభ్యులకు విషయాన్ని చేరవేశారు. దీంతో హుఠాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు అతని బంధువులు. కాలువిరిగిన వ్యక్తిని తమ ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి రెండు రోజుల క్రితం అతను సృహకోల్పోవడంతో వెంటనే సర్కారీ దవాఖానాకు తరలించారు. అప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించి పరికరాలు, మందులు, డాక్టర్ల కొరతను అధిగమించేందుకు ప్రయత్నించాలని కోరుకుంటున్నారు అక్కడి ప్రజలు
T.V.SRIKAR