బ్యాటర్లకు సవాలే, గబ్బా పిచ్ రిపోర్ట్ ఇదే

గబ్బా... ఈ పేరు వినగానే గత ఆసీస్ టూర్ లో భారత్ చారిత్రాత్మక విజయమే గుర్తొస్తుంది.. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన వేళ భారత్ అద్భుత విజయంతో వరుసగా రెండోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2024 | 12:05 PMLast Updated on: Dec 12, 2024 | 12:05 PM

A Challenge For Batters This Is The Gabba Pitch Report

గబ్బా… ఈ పేరు వినగానే గత ఆసీస్ టూర్ లో భారత్ చారిత్రాత్మక విజయమే గుర్తొస్తుంది.. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన వేళ భారత్ అద్భుత విజయంతో వరుసగా రెండోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. గబ్బాలో తమకు తిరుగేలేదంటూ విర్రవీగిన కంగారూలకు ఆ పిచ్ పై ఓటమి రుచి చూపించింది. ఇప్పుడు మళ్ళీ గబ్బా పిచ్ పైనే ఆస్ట్రేలియాతో టెస్ట్ సమరానికి రెడీ అయింది. ఈ సారి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతున్న వేళ తమకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన గబ్బాలోనే మరోసారి అదరగొట్టాలని ఉవ్విళ్ళూరుతోంది. మూడో టెస్టుకు సమయం దగ్గర పడుతుండడంతో పిచ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఎప్పటిలానే గబ్బా పిచ్ బ్యాటర్లకు సవాల్ గానే ఉండనుంది. ఇక్కడ ఓపిగ్గా ఆడకుంటే పరుగులు చేయడం చాలా కష్టమని చెప్పొచ్చు. ఈ సారి కూడా గబ్బా వికెట్‌ను బౌన్సీ పిచ్‌గా సిద్ధం చేసినట్లు క్యురేటర్ చెప్పాడు. సంప్రదాయమైన వికెట్‌నే సిద్ధం చేశామని తెలిపాడు.

ప్రతి ఏడాది తరహాలోనే మంచి పేస్, వేగం ఉండేలానే గబ్బా వికెట్ ఉందన్నాడు. బంతికి, బ్యాట్ కు మధ్య పోటీ సమానంగా ఉండేలా రూపొందించామని చెప్పాడు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ క్రమంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లకు పిచ్ అత్యంత సవాల్ గా ఉంటుందన్నాడు. గత కొన్ని రోజులు కూడా పలుసార్లు జల్లులు పడటంతో గబ్బా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.ఇదిలా ఉంటే గబ్బాలో ఆడిన 61 టెస్టుల్లో ఆస్ట్రేలియా ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయింది. అదే క్రిస్మస్ తర్వాత ఆడిన అయిదు టెస్టుల్లో మూడింట్లో పరాజయం పాలైంది. గత మూడేళ్లలోనే రెండు ఓటమలు చవిచూసింది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా టెస్టులో భారత్ గెలవడం సంచలనమనే చెప్పాలి. ఎందుకంటే 1988 నుంచి గబ్బాలో తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన ఆసీస్ కు ఓటమి రుచి చూపించింది.

ఇదిలా ఉంటే పెర్త్ టెస్టులో కంగారూలను చిత్తు చేసిన రోహిత్ సేన తర్వాతి మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేసింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పూర్తి డామినేట్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆసీస్ ఈ గెలుపుతో సిరీస్‌ ను 1-1తో సమం చేసింది. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను భారత్ తప్పనిసరిగా గెలవాలి. ఈ క్రమంలో గబ్బా టెస్టుపై అంచనాలు భారీగా పెరిగాయి.