Darmapuri Arvind: ధర్మపురిపై సొంతపార్టీ నేతల ఆగ్రహం
ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో బండి సంజయ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మొదలైన దుమారం ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిని ఒకరు వివరణ ఇచ్చుకునే స్థాయికి పోయింది. దీనిపై అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం.
ఈ గొడవ సర్థుమణగక ముందే మరో వివాదాన్ని కొనితెచ్చుకున్నారు. అదే మండలాధ్యక్షుల నియామకం. బీజేపీలో ఉండి ఎంతో కాలంగా జండా మోస్తున్న వారిని కాదని తనకు నచ్చిన వారికి మండలాధ్యక్ష పదవులు ఇవ్వడం ఎంతవరకూ సమంజసం అని పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయారు.దీనిపై కిషన్ రెడ్డిని కలిసి వివరణ కూడా ఇచ్చారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి స్పందిస్తూ ఈ వ్యహారంపై తాను జోక్యం చేసుకుంటానని పార్టీ శ్రేణులకు హామీ ఇవ్వడంతో గొడవ సర్ధుమణిగింది.
తాజాగా మరో సారి రెచ్చిపోయిన కార్యకర్తలు ధర్మపురికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ పార్టీ ఆఫీసును ముట్టడించారు. ఇలా సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు, వ్యతిరేక నినాదాలు వినిపించడంతో నిజామాబాద్ లో బీజేపీ రాజకీయం ఒక్కసారి వేడెక్కింది. ఆర్మూర్, బోధన్, బాల్కొండకు చెందిన నాయకులు ధర్మపురి పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీనికి కారణం రాష్ట్ర అధ్యక్షుడు మాటను కూడా బేకాతరు చేస్తూ అరవింద్ నిర్ణయాలు తీసుకోవడమే అనే స్వరం గట్టిగా వినిపిస్తుంది. చివరికి ఈ గొడవ ఏక్కడికి పోతుందో వేచిచూడాలి.
ఒకవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీలో ఇలాంటి లుకలుకలు పార్టీని గద్దెపై కూర్చోనిస్తాయా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లో లాగా బీజేపీలోనూ వర్గపోరు, అసమ్మతి క్రమక్రమంగా బయటపడుతుండటంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.