బట్టతల మీద జుట్టు మొలిపిస్తా..! ఓల్డ్‌సిటీలో అత్తిలి సత్తిబాబు
మీలో ప్రతీ ఒక్కరూ విక్రమార్కుడు సినిమా చూసే ఉంటారు. ఈ సినిమాలో చిన్న చిన్న మోసాలు చేస్తూ బతికేస్తుంటాడు అత్తిలి సత్తిబాబు. అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తూ జేబులు నింపుకుంటాడు.

మీలో ప్రతీ ఒక్కరూ విక్రమార్కుడు సినిమా చూసే ఉంటారు. ఈ సినిమాలో చిన్న చిన్న మోసాలు చేస్తూ బతికేస్తుంటాడు అత్తిలి సత్తిబాబు. అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తూ జేబులు నింపుకుంటాడు. ఒక రోజు ఓ వీధిలోకి వెళ్లి అందరికీ మాయమాటలు చెప్పి అరగుండు కొట్టి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మరొకడు వచ్చి గుండ్లు చేస్తామంటూ ప్రకటనలు ఇస్తాడు.. ఇలా వేల రూపాయలు వసూలు చేస్తాడు. అచ్చు గుద్దినట్టు ఇలాంటి వ్యవహారమే హైదరాబాదులో వెలుగు చూసింది. ఢిల్లీకి చెందిన వకీల్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామంటూ ప్రకటన చేశాడు.
ఈ వకీల్ బిగ్ బాస్‌లో కూడా పాల్గొన్న వ్యక్తి. తాను కూడా ట్రై చేశానని వెంట్రుకలు వచ్చాయని చెప్పాడు. ఆ తర్వాత పాతబస్తీలో తన మిత్రుడికి ఒక షాపు ఉందని అక్కడికి తాను వస్తున్నానని చెప్పాడు. దీంతో పాతబస్తీలోని పతే దర్వాజా ప్రాంతంలోని బిగ్‌బాస్ సెలూన్‌కి వచ్చాడు. వకీల్ వస్తున్న సమాచారం ముందుగానే సోషల్ మీడియాలో పెట్టడంతో వందలకొద్దీ బట్టతల యువకులు షాప్ ముందు ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయింది. తమకు గుండు చేసి వెంట్రుకలు మొలిపించాలని అందరూ పట్టుబట్టడంతో. ఒక్కొక్క గుండుకు వంద రూపాయలు చొప్పున వసూలు చేసి గుండ్లు గీయించాడు. ఆ తర్వాత తల మీద కొన్ని కెమికల్స్ రాసి పంపించాడు. ఆ తర్వాత కొన్ని షరతులు కూడా పెట్టాడు.
గుండు ఆరిపోకుండా ఉండాలని, గుండు పైన నీళ్లు చల్లుతూ ఉండాలని.. నీళ్లు కిందికి జారకుండా బట్ట కట్టాలి అంటూ జాగ్రత్తలు చెప్పి పంపించాడు. అలా గుండు గీయించుకొని కెమికల్ రాయించుకొని వెళ్లిన వారందరికీ మంట రావడంతో పాటు కొందరికి రియాక్షన్స్ అయి బొబ్బలు వచ్చాయి. దీంతో లబోదిబో అంటూ చాలామంది ఆస్పత్రికి వెళ్లారు. సాయంత్రం వరకు కొన్ని వందల మందికి గుండు గీసి డబ్బులు పట్టుకొని వకీల్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ గుండు వ్యవహారం పాతబస్తిలో సంచలనం రేకెత్తిస్తుంది. బట్టతల మాట ఏమో కానీ.. ఉన్న వెంట్రుకలు పోయాయని అందరూ బాధపడుతున్నారు.