Love Marriage: కూతురు తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని పంతానికి పోయి పరువునే హత్య చేసుకున్న తండ్రి

భూమి గుండ్రంగా తిరుగుతుంది. ఆ భూమితో పాటూ కాలం కూడా గిర్రున పరిగెడుతుంది. ఇది నిజమే ఎందుకంటే ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు భర్తను చంపి తన పరువును కాపాడుకోవాలనుకున్నారు ఒకరు. చివరికి ఆ పరువుతోపాటూ ప్రాణం పోగొట్టుకున్నారు. ఇది నాటి ప్రీతీ కేసులో తండ్రికి జరిగినది. ఇది ప్రారంభంలోని మాట. ఇక కొంత కాలం వేచి చూస్తే ప్రేమించకపోతే రోడ్డుపై నరుకుతాడు ఒకడు. ప్రేమిస్తే చంపి డ్రైనేజ్ లో పడేస్తాడు ఇంకొకడు. అదంతా మన్నటి వరకూ జరిగిన దారుణాలు. అయితే తాజాగా కూతురు పెళ్లి చేసుకుందని బ్రతికుండగానే దహన సంస్కారాలు చేశాడు ఒక తండ్రి. తిరిగి తిరిగి కాలం పేరెంట్స్ పరువు వద్దకే వస్తుంది. ఇలా వచ్చే క్రమంలో కొంత మార్పు చెందింది. ఒకప్పుడు కట్టుకున్న వాడిని కడచేరిస్తే.. ఇప్పుడు కన్న కూతురినే కాటికి పంపాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 19, 2023 | 06:45 PMLast Updated on: Jun 19, 2023 | 6:45 PM

A Father Who Does Not Want His Daughter To Marry The Man She Loves Or Burns His Effigy

ప్రేమంటే ఏమిటంటే.. ఒక్కమాటలో చెప్పేది కాదని నాటి కాలంలో అనేవారు. కానీ దీనికి అర్థాన్ని మారుస్తూ పరువుతో ముడిపెట్టి చూస్తూన్నారు. ఇందులో యువతరం అస్సలు లేరు. అంతా నాటితరం వారే ఉన్నారు. వీరు అనాగరికులా అంటే.. కాదనే చెప్పాలి. ఎందుకంటే నాగరిక కాదు అధునాగరిక సమాజానికి అలవాటు పడి బ్రతుకున్నారు కాబట్టి. ఒకప్పుడు భర్త చనిపోతే.. భార్యను బ్రతికుండగానే చితి పేర్చి అందులో నెట్టేసేవారు. దీనిని సతీసహగమనం అనే టైటిల్ ఒకటి. దీనిని రూపుమాపడానికి రాజారామ్మోహన్ రాయ్ తొలి అడుగు వేశారు. ఇక కొంత ముందుకు వెళితే స్త్రీకి విద్యే వద్దన్నారు. దీనికి కూడా సంస్కరణలు జరిగాయి. అలాగే కాస్త ముందుకు వెళితే బాల్య వివాహాలు చేసేవారు. దీనిని అంతమొందిస్తూ కందుకూరి నడుంబిగించారు. అదికాస్త కన్యాశుల్కంగా మారింది. మళ్లీ ఒక మహానుభావుడు గురజాడ అప్పారావులా ఉద్భవించారు. ఈ పరిస్థితిని కడచేర్చారు. ఇదంతా ఒకప్పటి చరిత్ర. ఇలా చరిత్ర అనుకుంటే ఇప్పటి వర్తమానం కూడా రేపటికి చరిత్రే అవుతుంది. ఆ చరిత్రలో మహాపురుషులుగా ఉండాలా.. లేక పురుషాధిక్యతలో ఉండాలా అనేది కొందరు తల్లిదండ్రలు జ్ఞప్తిలోకి ఉంచుకోవాలి. ఇక ఇప్పటి తరానికి వస్తే బలవంతపు పెళ్లిళ్లు అంతగా లేవు, బాల్య వివాహాలు అస్సలు కనిపించవు అయితే ఉన్న పరువు కోసం ఊరిలో పరువు తీసుకునేలా సరికొత్త శకానికి నాంది పలికారు కొందరు తల్లిదండ్రులు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. గతంలో పెద్దలు తప్పు చేసిన ప్రతిసారీ ఒక ఉద్యమం వెంబడించింది. వారిని నిలువరించింది. కానీ ఇప్పుడు చేస్తున్న తప్పుకు ఉద్యమం రాకపోయినా ఊపిరిపోతుంది. అది తల్లిదండ్రులది కావచ్చు. ప్రేమించిన ప్రేయసి, ప్రియుడిది కావచ్చు, పెళ్లి చేసుకున్న భార్యాభర్తలది కావచ్చు. ఒకప్పటి అమృత ప్రణయ్ నుంచి నేటి ప్రీతి వరకూ అన్నీ పరువు హత్యలే. అయితే తాజాగా జరిగిన సంఘటనలో పరువు వల్ల ప్రాణం పోలేదు. పంతానికి పోయిన తండ్రి పరువే పోయింది.

వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలంలోని కట్యాల గ్రామానికి చెందిన సమ్మెట శరత్, నాంపల్లి ప్రీతీ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ ప్రయాణం గత ఏడేళ్లుగా సాఫీగా సాగుతుంది. అబ్బాయి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మాయి కూడా మార్కెటింగ్ విభాగంలో పనిచేసి జీవనం సాగిస్తుంది. ఇదిలా ఉండగా ఒక రోజు తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పేసింది. మా ఇద్దరికీ పెళ్లి చేయమని అడిగింది. కుటుంబ సభ్యులు ససేమేరా అని.. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు అని వివాహానికి నిరాకరించారు. దీంతో వీరిద్దరూ కలిసి వారం రోజుల క్రితం హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. తమకు వారి తల్లిదండ్రల నుంచి రక్షణ కల్పించాలని వర్థన్నపేట పోలీసులను కోరారు.

స్థానిక ఎస్సై నూతన వధూవరుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆతరువాత ఇంటికి వచ్చిన ప్రీతి తల్లిదండ్రులు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. తమ కూతురు లాగా దిష్టిబొమ్మను చేసి అమ్మాయి బట్టలతో అలంకరించారు. శవయాత్రకోసం పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దీనికి గ్రామస్థులు అంగీకరించలేదు. ఇలా చేయడం సరైన పద్దతి కాదని నిలువరించారు. అయినప్పటికీ అమ్మాయి తండ్రి ఆవేశంతో దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు చేశారు. తన కూతురు చనిపోయిందని ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇలా తన పరువు తానే తీసుకున్నాడు. ఇది పరువు హత్య కాదు. పంతం కోసం పోయి ఉన్న పరువునే హత్య చేసుకున్నాడు అని చెప్పాలి. కులం కూడు పెట్టదు. మతం మంచి నీళ్లు కూడా ఇవ్వదు. గోత్రం గుడి కట్టి పూజించదు. ఈ విషయం తెలియక భుజాన ఎత్తుకున్న కూతురినే బహిరంగంగా కాల్చేశాడు ఈ తండ్రి. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లుగా తన ఇంటి పరువును తానే తీసుకున్నాడు. అదే ఇద్దరినీ ఒకటిగా కలిపి ఇకపై తనకు దూరంగా అయినా కలిసి ఉండండి అని చెప్పి ఉండవచ్చు. ఎందుకంటే తాను కోరుకున్న పరువు మిగిలేది. ఆలోచనా రాహిత్యంతో, అవగాహనా లోపంతో ఇలాంటి చర్యలకు పాల్పడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఇప్పటికైనా తెలుసుకోవాలి.

T.V.SRIKAR