BRS Party Leaders: నేను లోకల్..నువ్వు నాన్ లోకల్.. టిక్కెట్ల కోసం బీఆర్ఎస్ నేతల మధ్య స్థానిక పంచాయితీ

లోకల్ నాన్ లోకల్ అన్న మాటకు తెలంగాణకు విడదీయరాని బంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య ఈ మాటలే చిచ్చు పెట్టాయి . ఇదంతా చరిత్ర. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలే లోకల్ నాన్ లోకల్ అంటూ పంచాయితీలు పెట్టుకుంటున్నారు. ఇది నా నియోజకవర్గం నీ పెత్తనం ఏంటి అన్న స్థాయిలో బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 13, 2023 | 11:04 AMLast Updated on: Aug 13, 2023 | 11:04 AM

A Local And Non Local War Is Going On Between Some Leaders Of The Brs Party In The Issue Of Distribution Of Mla Tickets

లోకల్ నాన్ లోకల్ అన్న మాటకు తెలంగాణకు విడదీయరాని బంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య ఈ మాటలే చిచ్చు పెట్టాయి . ఇదంతా చరిత్ర. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలే లోకల్ నాన్ లోకల్ అంటూ పంచాయితీలు పెట్టుకుంటున్నారు. ఇది నా నియోజకవర్గం నీ పెత్తనం ఏంటి అన్న స్థాయిలో బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్నారు. మరో వారం పది రోజుల్లో కనీసం 90 మంది అభ్యర్థులతో మొదటి విడత జాబితాను విడుదల చేసేందుకు కేసీఆర్ రెడీ అవుతుంటే.. వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు , ఆశావహుల మధ్య లోకల్ వర్సెస్ నాల్ లోకల్ ఫైట్ నడుస్తోంది. మరోసారి టిక్కెట్ తమకే దక్కాలనుకునే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓవైపు.. ఈసారి ఎలాగైనా టిక్కెట్ దక్కించుకోవాలనుకునే ఆశావహులు మరోవైపు.. నువ్వెంత..నువ్వెంత అనుకుంటున్నారు.

ముత్తిరెడ్డి వర్సెస్ పోచంపల్లి వర్సెస్ పల్లా

జనగాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల మధ్య టిక్కెట్ల రాజకీయం తారా స్థాయికి చేరింది. ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు రెండు మూడు వర్గాలుగా విడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి టిక్కెట్ ఆశిస్తుంటే.. జనగాం నుంచి బరిలోకి దిగేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ముత్తిరెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోతే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితీ వీళ్లిద్దరూ స్థానికులు కాకపోవడంతో లోకల్ వర్సెస్ నాన్ లోకస్ గొడవ మొదలయ్యింది. పరకాల ప్రాంతానికి చెందిన పోచంపల్లి జనగాం నుంచి ఎలా బరిలోకి దిగుతారని.. ముత్తిరెడ్డి వర్గీయులు విమర్శిస్తున్నారు. కేసీఆర్ స్థానికులకే ప్రాధాన్యత ఇస్తారని.. ఈసారి కూడా జనగాం ముత్తిరెడ్డిదే అని వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ముత్తిరెడ్డికి ఇవ్వని పక్షంలో తనను కాదని.. పల్లాకు టిక్కెట్ ఆఫర్ చేస్తే సహించబోమని పోచంపల్లి వార్నింగ్ ఇస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి చెందిన పల్లా జనగాం టిక్కెట్ ఎలా ఆశిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఉప్పల్ నియోజకవర్గంలోనూ సేమ్ సీన్

ఉప్పల్ నియోజకవర్గంలోనూ అసెంబ్లీ సీటు కోసం లోకల్ నాన్ లోకల్ అంటూ బీఆర్ఎస్ వర్గీయులు మాటల యుద్ధానికి దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాషణ్ రెడ్డి.. మరోసారి కేసీఆర్ తనకే బీ ఫారమ్ ఇస్తారని నమ్మకంతో ఉంటే.. బండారి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వర్గాలు ఉప్పల్ సీటుపై కన్నేశాయి. వరంగల్ ప్రాంతానికి చెందిన బొంతు రామ్మోహన్ కు ఉప్పల్ టిక్కెట్ ఇస్తే తాము సహించబోమని బండారి వర్గం చెబుతుంది. భువనగిరి జిల్లాలోని వలిగొండ ప్రాంతానికి చెందిన సుభాషణ్ రెడ్డి ఉప్పల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాము టిక్కెట్ ఆశించడంలో తప్పేంటన్నది మరో వర్గం వాదన. అయితే అటు బండారి, ఇటు బొంతు ఇద్దరు నేతలు బీఆర్ఎస్ హైకమాండ్ ఆశీస్సులు తమకే ఉన్నాయని చెప్పుకుంటున్నారు

సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ లోనూ లోకల్ ఫైట్

ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎం. కృష్ణయ్య, సాయన్న కుమార్తె..ఈ ముగ్గురు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు. సిద్దిపేటకు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ ను స్థానికేతరుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు సాయన్న వర్గం ప్రయత్నిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి మధ్య కూడా లోకల్ నాన్ లోకల్ వార్ నడుస్తోంది. ఎవరు ఎన్ని రకాల కార్డులు ప్లే చేసినా.. కేసీఆర్ మాత్రం సర్వేలనే ప్రాతిపదికగా తీసుకున్నారు. గెలుపు గుర్రాలను మాత్రమే ఆయన ప్రకటించబోతున్నారు. నియోజకవర్గంపై పట్టు ఉండి.. గెలిచే అవకాశాలు ఉంటే స్థానికేతరులకు కూడా అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. జాబితా విడుదలయితే గానీ కేసీఆర్ స్కెచ్ ఏంటన్నది అర్థం కాదు.. అప్పటి వరకు బీఆర్ఎస్ సిట్టింగులు, ఆశావహుల మధ్య ఈ ఫైట్ జరుగుతూనే ఉంటుంది.