AP BRS: కేసీఆర్ ఇచ్చిన డబ్బులపైనే ఆసక్తి.. ఏపీ బీఆర్ఎస్ చేరికల్లో కొత్త యాంగిల్!
ఏపీలో ప్రధాన పార్టీల్లో చేరినా.. పార్టీకి అధికారం దక్కుతుందేమో కానీ.. తమకు పవర్ దక్కుతుందన్న ఆశలేనివారు.. పైసా కోసమే బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
అడుగు తీసి అడుగు వేసేందుకు కూడా.. లాభం ఏంటనే ఆలోచిస్తారు రాజకీయ నాయకులు. లాభం లేనిదే వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకోరు అనే చర్చ జనాల్లో ఎప్పటి నుంచో ఉంది. రాజకీయం దిగజారిందా.. నాయకులు జారుతున్నారా అన్న డిస్కషన్ పక్కనపెడితే.. ఏపీలో బీఆర్ఎస్‌ను విస్తరించాలని కేసీఆర్ దూకుడు చూపిస్తున్న వేళ.. ఇదే మాట పదేపదే వినిపిస్తోంది. తోట చంద్రశేఖర్, రావెలలాంటి నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్లు ఎంతమంది జనాలకు తెలుసు అన్న సంగతి ఎలా ఉన్నా.. తోటను ఏపీకి పార్టీ చీఫ్‌గా ప్రకటించారు కేసీఆర్. విశాఖలో బీఆర్ఎస్ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకేరోజు 70మంది నేతలు గులాబీ తీర్థం పుచ్చుకుంటారని చర్చ జరిగినా.. అది చర్చ దగ్గరే ఆగిపోయింది.
ఐతే బీఆర్ఎస్‌లో చేరేందుకు ఏపీలో నేతలు భారీ ఆసక్తి చూపిస్తున్నారు. కేసీఆర్ మీద అభిమానమో.. బీఆర్ఎస్ అద్భుతాలు సృష్టిస్తుందో అన్న నమ్మకంతోనే ఈ చేరికలు కనిపించడం లేదని.. అసలు మతలబు వేరే ఉందనే చర్చ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీల్లోనే బీఆర్ఎస్ ధనికమైన పార్టీగా ఉంది దేశంలో ! అదే ఇప్పుడు ఏపీలో గులాబీ పార్టీలో చేరాలి అనుకునేవారికి ఆశగా మారింది. కేసీఆర్ దగ్గర, బీఆర్ఎస్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని.. రేపటి నుంచి పోటీ చేసినా.. పార్టీ ఫండ్ రూపంలోనే, కేసీఆర్ నుంచో డబ్బులు అందుతాయని… వాటిని సెట్‌రైట్ చేస్తే.. లైఫ్‌సెటిల్ అన్నట్లుగా నేతలు కనిపిస్తున్నారనే చర్చ మొదలైంది. ఫండ్ రూపంలో పార్టీ నుంచి వచ్చే డబ్బుల్లో పది శాతం ఖర్చు చేసి.. మరో 90శాతం దాచుకోవచ్చని.. బీఆర్ఎస్ వైపు చూస్తున్న నేతలంతా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇదే నిజం అని చెప్పేందుకు ఆధారాలు లేకపోయినా.. ఇది నిజం కాదు అని మాత్రం కచ్చితంగా అనడానికి లేదు. పవర్ ఉండాలి.. లేదంటే పైసా ఉండాలి.. రాజకీయాల్లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలంటే.. ఈ రెండే ముఖ్యం ! ఏపీలో ప్రధాన పార్టీల్లో చేరినా.. పార్టీకి అధికారం దక్కుతుందేమో కానీ.. తమకు పవర్ దక్కుతుందన్న ఆశలేనివారు.. పైసా కోసమే బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది.