AP Politics : ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందా..?

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని నిర్ణయించబోతున్నాయి. ఎవరి నమ్మకాలు వారివి..వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ఐదేళ్ళ పాలనమీద ప్రజలు ఇచ్చిన తీర్పు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లలో నిక్షిప్తమై ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 14, 2024 | 04:30 PMLast Updated on: May 14, 2024 | 4:30 PM

A New Government Is Going To Be Formed In Ap

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని నిర్ణయించబోతున్నాయి. ఎవరి నమ్మకాలు వారివి..వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ఐదేళ్ళ పాలనమీద ప్రజలు ఇచ్చిన తీర్పు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లలో నిక్షిప్తమై ఉంది. ఎండావానలను సైతం లెక్కచేయకుండా ఓటర్లు చైతన్యంతో వ్యవహరించడం ప్రశంసనీయం. ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం, హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరం. పోలింగ్‌ తమకు ప్రయోజనకరమని టీడీపీ భావిస్తుంటే, శాసనసభలో తన ప్రవేశానికి ఈ ఫలితాలు మార్గం సుగమం చేస్తాయని టీడీపీ–జనసేనతో జతకట్టిన బీజేపీ నమ్ముతోంది. తాము పవర్ లోకి రావడం ఖాయమేనని టీడీపీ కూటమి ధీమా.

పోలింగ్‌ రాష్ట్రవ్యాప్తంగా తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ఫలితాలు తమ కూటమికే ఏకపక్షంగా ఉండబోతున్నాయని టీడీపీ, జనసేన, బీజేపీ అభిప్రాయపడుతున్నాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగిన తీరు, ప్రజలు స్పందించిన తీరు తదితర అంశాలపై వైసీపీ, కూటమి సమాచారం సేకరించాయి. దీంతోపాటు తమ నేతలు, ఇతరత్రా మార్గాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా వివిధ నియోజకవర్గాల్లో పరిస్థితిని నాయకత్వాలు విశ్లేషించుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ డే అంతా టిడిపి కేంద్ర కార్యాలయంలోని వార్‌ రూమ్‌ నుంచి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. అన్ని జిల్లాల నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తాజా పరిస్థితి తెలుసుకున్నారు. పోలింగ్‌ సరళి మాకు పూర్తి సంతృప్తి కలిగించింది. మేం చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేయబోతున్నామని చెప్పుకొచ్చారు చంద్రబాబు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తాము ఊహించినదానికన్నా బలంగా వ్యతిరేకత ఉందని, అందుకే ఓటింగ్‌కు ప్రజలు వెల్లువలా వచ్చారని చెబుతున్నారు కూటమి నేతలు.

ఇక రూలింగ్ పార్టీది కూడా సేమ్ వాదన. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. ప్రజలు స్పష్టంగా ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారని.. వైసీపీ ప్రభుత్వానికి మరోసారి సానుకూల ఫలితాలు వస్తున్నాయని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఏపీలో పోలింగ్ సరళి చూస్తే ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ సానుకూల ఓటర్ల సరళి ఉప్పెనలా కనిపిస్తుందని.. ఇది చాలా అరుదన్నారు. అంతిమంగా ప్రజలది విజయం అవుతుందని చెప్పారు సజ్జల.

ఇలా ఎవరి ధీమాల్లో వారు ఉన్నారు రూలింగ్ అపోజిషన్ నేతలు. అయితే లాజిక్ మిస్ అవుతోంది. మహిళలు, వృద్ధులు తమ వైపే ఉన్నారని ఎవరికి వారే మేకపోతు గాంభీర్యంతో ప్రకటించుకుంటున్న నేపధ్యంలో పోలింగ్ కేంద్రాలకు వెల్లువలా తరలివచ్చిన మహిళలు, వృద్ధులు ఎవరికి ఓటు వేసారు అనేది తేలాల్సిన ప్రశ్న. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికల పరిణామాలు ఓసారి గమనిస్తే…. పసుపు కుంకుమ పేరుతో అప్పటి సీఎం చంద్రబాబు మహిళలకు వారి అకౌంట్స్‌లో 10వేలు జమ చేసారు. అప్పుడు కూడా వెల్లువలా వచ్చినా మహిళలను చూసి ఖచ్చితంగా ఓట్లు టిడిపికి పడటం ఖాయమని అన్నారు.

కట్ చేస్తే పసుపు చంద్రబాబుకు ఇచ్చిన మహిళలు..కుంకుమను తిలకంగా జగన్‌ కు దిద్దారు. మళ్లీ ఇప్పుడు సజ్జల లాజిక్ చూస్తే… మహిళలు, వృద్ధులకు తాము చేసిన మేలుకు రుణంగా తీర్చుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చారని చెబుతున్నారు. కూటమి మేనిఫెస్టో అసలు ఏమాత్రం పని చేయదు అని సజ్లల ఎలా డిసైడ్ అవుతారనేది రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురి చేస్తోంది. ఏ లాజిక్ లాజిస్టిక్‌గా మారుతుందనేది ఏమాత్రం అంతుచిక్కకుండా ఉన్న ఈ తరుణంలో… అంచనాల పొదరిల్లును, ఆశల పల్లకిని పక్కన పెట్టేసి జడ్జ్‌మెంట్ డే వరకు ఆగాల్సిందే…