ఐపీఎల్ లో కొత్త ట్రెండ్, రిటైర్డ్ ఔట్ లిస్ట్ పెద్దదే
ఐపీఎల్ 18వ సీజన్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. ఆఖరి ఓవర్లలో అప్పటి వరకు క్రీజులో కుదురుకుని ఉన్న బ్యాటర్‌ని అవుట్ చేయించి, కొత్త ఆటగాడిని బ్యాటింగ్‌కి పంపిస్తున్నారు.

ఐపీఎల్ 18వ సీజన్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. ఆఖరి ఓవర్లలో అప్పటి వరకు క్రీజులో కుదురుకుని ఉన్న బ్యాటర్‌ని అవుట్ చేయించి, కొత్త ఆటగాడిని బ్యాటింగ్‌కి పంపిస్తున్నారు. అయితే, రెండు సార్లు ఈ ప్రయోగం చేసినప్పటికీ రెండుసార్లూ వ్యతిరేక ఫలితాలే వచ్చాయి. ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ చేయించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తర్వాత.. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే తప్పు చేసి ఓటమిపాలయింది. క్రీజులో కుదురుకుని అప్పుడే హిట్టింగ్ మొదలుపెట్టిన దేవాన్ కాన్వేను సీఎస్కే రిటైర్డ్ అవుట్ చేయించింది. అతని స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా పెద్దగా రాణించకపోవడంతో సీఎక్కే ఓడిపోక తప్పలేదు. ఒకవైపు ఎంఎస్ ధోనీ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తుండగా.. మరో ఎండ్‌లో కాన్వే సిక్సర్లు బాదితే మ్యాచ్ గెలిచేదేమో అని సీఎస్కే అభిమానులు అంటున్నారు. పిచ్‌పై, బౌలర్లపై ఎక్స్‌పీరియన్స్ ఉన్న కాన్వేను రిటైర్డ్ అవుట్ చేయడం అంత సమంజసం కాదంటూ క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ కావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలా ఔటైన ఫస్ట్ బ్యాటర్ తిలక్ కాదు. అంతకంటే ముందే ఐపీఎల్ లో బ్యాటర్లు ఇలా పెవిలియన్ చేరారు. ఓవరాల్ గా ఐపీఎల్ లో రిటైర్డ్ ఔట్ లిస్ట్ పెద్దదిగానే ఉంది. గత సీజన్లలోనూ పలు సార్లు పలు జట్లు ఇలా రిటైర్డ్ ఔట్ ప్రయోగాన్ని చేశాయి. కానీ అప్పుడు కూడా చాలాసార్లు ఈ ప్రయోగం సక్సెస్ కాలేదు. ఐపీఎల్ హిస్టరీలో రిటైర్డ్ ఔట్ గా పెవిలియన్ చేరిన ఫస్ట్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఈ సీనియర్ స్పిన్నర్ 2022 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున లక్నోతో మ్యాచ్ లో ఇలా చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో పైన వచ్చిన అశ్విన్.. 19వ ఓవర్లో ఫస్ట్ రెండు బాల్స్ ఆడి రియాన్ పరాగ్ కోసం వ్యూహాత్మకంగా వెళ్లిపోయాడు. పంజాబ్ కింగ్స్ తరపున యంగ్ బ్యాటర్ అథర్వ టైడ్ కూడా రిటైర్డ్ ఔట్ అయ్యాడు. 2023 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ 124 రన్స్ ఛేజ్ చేయాల్సి వచ్చింది. ఛేదనలో అథర్వ పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు. పంజాబ్ లాస్ట్ 5 ఓవర్లలో 71 రన్స్ చేయాల్సి ఉందనగా రిటైర్డ్ ఔట్ గా పెవిలియన్ చేరిపోయాడు.
2023 ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా ఇలాగే రిటైర్డ్ ఔట్ అయ్యాడు. ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో 140 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నప్పటికీ రషీద్ ఖాన్ హిట్టింగ్ చేస్తాడని సుదర్శన్ నిష్క్రమించాడు. రెండు బాల్స్ ఆడిన రషీద్ ఓ ఫోర్ కొట్టాడు. గుజరాత్ 233 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు 18వ సీజన్ లో రిటైర్డ్ ఔట్ ప్రయోగం చేసిన రెండు జట్లు ముంబై, చెన్నై పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్నాయి. విజయాల కోసమే ఈ ప్రయోగం చేసినా ఫలితం మాత్రం రాలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం ఒక్క విజయంతో కింది నుంచి రెండో స్థానంలో కొనసాగుతంది. అలాగే ముంబై ఇండియన్స్ కూడా ఐదు మ్యాచ్ లలో నాలుగింట ఓడి ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో ప్లేస్ లో ఉంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ ఈ రెండు జట్లకు కీలకం కానున్నాయి.