మ్యాచ్ మధ్యలో వాకౌట్ రెండు మ్యాచ్ ల నిషేధం

అంతర్జాతీయ క్రికెట్ లో కేవలం ప్రతిభ ఉంటే మాత్రమే సరిపోదు... క్రమశిక్షణ కూడా ఉంటేనే జట్టులో చోటు ఉంటుంది. ఓవరాక్షన్ చేసి గల్లీ క్రికెట్ తరహాలో ప్రవర్తిస్తే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సిందే.. తాజాగా విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఇలాగే పనిష్మెంట్ కు గురయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 8, 2024 | 08:46 PMLast Updated on: Nov 08, 2024 | 8:46 PM

A Walk Out In The Middle Of A Match Is A Two Match Ban

అంతర్జాతీయ క్రికెట్ లో కేవలం ప్రతిభ ఉంటే మాత్రమే సరిపోదు… క్రమశిక్షణ కూడా ఉంటేనే జట్టులో చోటు ఉంటుంది. ఓవరాక్షన్ చేసి గల్లీ క్రికెట్ తరహాలో ప్రవర్తిస్తే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సిందే.. తాజాగా విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఇలాగే పనిష్మెంట్ కు గురయ్యాడు. కెప్టెన్‌ షై హోప్‌తో గొడవ పడి మ్యాచ్ మధ్యలోనే మైదానాన్నివీడిన జోసెఫ్‌పై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. రెండు మ్యాచ్‌లు నిషేధం విధిస్తూ వేటు వేసింది. ఆటగాళ్ల నుంచి ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని పేర్కొంది. బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో షై హోప్‌తో అల్జారీ జోసెఫ్ వాగ్వాదానికి దిగాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. తొలి బంతి తర్వాత కెప్టెన్ షై హోప్ ఫీల్డింగ్ సెటప్‌పై అల్జారీ జోషెఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కానీ ఓవర్‌ను కొనసాగించిన నాలుగో బంతికి జోర్డాన్ కాక్స్ ను ఔట్ చేశాడు.సారథి షై‌ హోప్‌తో వికెట్ సంబరాలు చేసుకోవడానికి అల్జారీ నిరాకరిస్తూ కెప్టెన్‌తో తీవ్రస్థాయిలోనే గొడవపడ్డాడు.

ఓవర్ పూర్తయిన వెంటనే కెప్టెన్‌పై అసహనం వ్యక్తం చేస్తూ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళిపోయాడు.తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ వచ్చి అల్జారీ జోసెఫ్‌ కు సర్థి చెప్పడంతో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. 10 ఓవర్ల కోటాను పూర్తి చేసి రెండు వికెట్లు తీశాడు. అయితే అల్జారీ జోసెఫ్ వైఖరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్‌లోని వ్యాఖ్యతలు కూడా అతని వైఖరిని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ బోర్డు అల్జారీ జోసెఫ్‌ను 2 మ్యాచ్ లు బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటు కోచ్ డారెన్ సామీ కూడా జోసెఫ్‌పై ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మరోవైపు ఈ ఘటనపై అల్జారీ జోషెఫ్ స్పందించాడు. కెప్టెన్ షై హోప్‌కు, సహచరులకు, టీమ్ మేనేజ్మెంట్‌కు క్షమాపణలు చెప్పాడు. జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తూ ఆటపై తన నిబద్ధత ఎప్పుడూ ఉన్నతస్థాయిలోనే ఉంటుందన్నాడు. విండీస్ క్రికెట్ అభిమానులు కూడా తనను క్షమించాలని కోరాడు. కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 263 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్ లో ఓపెనర్లు శతక్కొట్టడంతో విండీస్ 43 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది.